Ind vs Aus: ఆసీస్‌ గొప్ప జట్టు.. కానీ..: రోహిత్‌ శర్మ కామెంట్స్‌ వైరల్‌ | CT 2025 Pressure Will Be On: Rohit Sharma On Semi Final Against Australia | Sakshi
Sakshi News home page

Ind vs Aus: ఆసీస్‌ గొప్ప జట్టు.. కానీ..: రోహిత్‌ శర్మ కామెంట్స్‌ వైరల్‌

Published Mon, Mar 3 2025 5:37 PM | Last Updated on Mon, Mar 3 2025 6:44 PM

CT 2025 Pressure Will Be On: Rohit Sharma On Semi Final Against Australia

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా టైటిల్‌ రేసులో ముందుకు దూసుకుపోతోంది. గ్రూప్‌-‘ఎ’లో భాగంగా బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లను ఓడించి.. మూడింట మూడు విజయాలతో టాపర్‌గా నిలిచింది. ఇదే జోరులో సెమీ ఫైనల్లోనూ గెలుపొంది టైటిల్‌ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది.

నాకౌట్‌ మ్యాచ్‌లలో..
అయితే, సెమీస్‌లో గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా(India vs Australia) రూపంలో పటిష్టమైన ప్రత్యర్థి జట్టు రోహిత్‌ సేనకు సవాలుగా మారింది. ద్వైపాక్షిక సిరీస్‌ల సంగతి పక్కనపెడితే.. 2011 తర్వాత ఐసీసీ టోర్నమెంట్ల నాకౌట్‌ మ్యాచ్‌లలో కంగారూ జట్టు చేతిలో టీమిండియాకు పరాభవాలు తప్పడం లేదు. సొంతగడ్డపై లక్షలకు పైగా ప్రేక్షకుల నడుమ వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్‌లో భారత్‌ కమిన్స్‌ బృందం చేతిలో ఓడిన తీరును అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలో మంగళవారం దుబాయ్‌లో ఆసీస్‌తో జరిగే సెమీస్‌ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్లు సైతం గత చేదు అనుభవాలను మరిపించేలా రోహిత్‌ సేన ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆసీస్‌ గొప్ప జట్టు.. కానీ..
‘‘ఆసీస్‌ పటిష్ట జట్టు. మాకు గొప్ప ప్రత్యర్థి. అయితే, సెమీస్‌తో మ్యాచ్‌లో మా విధానం మారదు. గత మూడు మ్యాచ్‌ల మాదిరే మా ప్రణాళికలు ఉంటాయి. అయితే, ఆసీస్‌ జట్టును బట్టి వ్యూహాల్లో కొన్ని మార్పులు చేసుకుంటాం.

ఇక సెమీ ఫైనల్‌ అంటే మా మీద మాత్రమే ఒత్తిడి ఉంటుందని అనుకోకూడదు. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అయితే, జట్టుగా ఎలా రాణించాలన్న అంశం మీదే మేము ఎక్కువగా దృష్టి సారించాం. 

బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తే మాకు తిరుగే ఉండదు. సుదీర్ఘకాలంగా ఆస్ట్రేలియా గొప్ప జట్టుగా కొనసాగుతోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, మేము కూడా తక్కువేమీ కాదు. ప్రత్యర్థి ముందు అంత తేలికగా తలవంచే రకం కాదు.

ఇరుజట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత ముఖ్యమైంది. మేము అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నాం. ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే.. అనుకున్న ఫలితం అదే వస్తుంది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌పై విజయం తర్వాత పీటీఐతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్‌ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025
భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్‌ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

ఆస్ట్రేలియా జట్టు
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ లబుషేన్‌, జోష్ ఇంగ్లిస్(వికెట్‌ కీపర్‌), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్‌ సంఘా, కూపర్‌ కన్నోలి.

చదవండి: ఇదేం పని జడ్డూ? ఆటగాడు ఇలా చేయొచ్చా?: కివీస్‌ మాజీ క్రికెటర్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement