
భారత్‌కి చెందిన నలుగురు అగ్రశ్రేణి స్పిన్ బౌలర్లు ప్రపంచ క్రికెట్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలంలో వచ్చిన స్పిన్ బౌలర్లలో ఎడమచేతి వాటం స్పిన్నర్ పద్మాకర్ శివల్కర్(Padmakar Shivalkar) ఒకరు. 84 సంవత్సరాల వయసులో ముంబైలో సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు.
మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ, బి ఎస్ చంద్రశేఖర్, ఇ ఎ ఎస్ ప్రసన్న, శ్రీనివాసన్ వెంకట రాఘవన్ వంటి అసాధారణ స్పిన్నర్లు ఒక దశలో ప్రపంచ క్రికెట్ ని శాసించారు. అప్పట్లో అగ్రశ్రేణి జట్లయిన వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత స్పిన్నర్లని ఎదుర్కొనడానికి భయపడిన సందర్భాలు కోకొల్లలు.
ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌కి అనుకూలించే పిచ్‌లపై భారత్ బౌలర్లు చెలరేగిపోయి బౌలింగ్ చేసేవారు. అటువంటి కాలంలో వచ్చిన ఇద్దరు అగ్రశ్రేణి స్పిన్ బౌలర్లకు భారత్ జట్టుకి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించలేదు.
ఇప్పట్లో లాగా ఆ కాలంలో వన్డేలు, టీ20 టోర్నమెంట్లు లేవు. ఆడితే టెస్ట్ మ్యాచ్ లు ఆడాలి. ఇంక టెస్ట్ మ్యాచ్ లు అంటే జట్టుకి అత్యుత్తమ ఆటగాళ్లకే స్థానం దొరుకుతుంది. ఈ కారణంగా శివల్కర్, హర్యానా ఎడమచేతి వాటం స్పిన్నర్ రాజిందర్ గోయెల్ ఇద్దరూ తమకి అసాధారణ ప్రతిభ ఉన్నప్పటికీ భారత్ కి ఒక్క టెస్ట్ మ్యాచ్ లో కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం రాకపోవడంతో దేశవాళీ క్రికెట్ కే పరిమితమయ్యారు.
గావస్కర్ తీరని కోరిక
"నాకు తీరని కోరికగా మిగిలిపోయినది ఏమిటంటే, అప్పటి భారత జట్టు కెప్టెన్‌గా, గోయల్ సాబ్ మరియు పాడీ ( పద్మాకర్ శివల్కర్) లను భారతదేశం తరపున ఆడటానికి సెలెక్టర్లను నేను ఒప్పించలేకపోయాను" అని 2017లో గోయల్ మరియు శివల్కర్‌లకు సికే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసిన సందర్భంగా 'లిటిల్ మాస్టర్' సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) వ్యాఖ్యానించడం విశేషం.
"నేను చూసిన గొప్ప ఎడమచేతి వాటం బౌలర్ బిషన్ సింగ్ బేడి ఉన్న కాలంలోనే వారు జన్మించారు. లేకుంటే వారు కూడా భారతదేశం తరపున చాలా టెస్టులు ఆడి ఉండేవారు" అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
రంజీ ట్రోఫీలో ఆధిపత్యం
రంజీ ట్రోఫీలో అత్యంత విజయవంతమైన జట్టు అయిన బాంబే (ఇప్పుడు ముంబై) తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కాలంలో గవాస్కర్ శివల్కర్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నారు. 1965-66 నుండి 1976-77 వరకు బొంబాయి గెలిచిన పది రంజీ ట్రోఫీ ఛాంపియన్షిప్ టైటిల్స్ గెలిచిన కాలంలో శివల్కర్ తన స్పిన్ మాయాజాలంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆ కాలంలో ఒక సీజన్ తప్ప ప్రతి సీజన్‌లోనూ బాంబే (ఇప్పుడు ముంబై) టైటిల్‌ను గెలుచుకుంది. మళ్ళీ బాంబే 1980-81లో రంజీ ట్రోఫీ కిరీటాన్ని చేజిక్కించుకున్న జట్టులో కూడా శివల్కర్ ఉన్నాడు. ఆశ్చర్యకరంగా శివల్కర్ ఏడు సంవత్సరాల విరామం తరువాత 47 సంవత్సరాల వయస్సులో తిరిగి వచ్చి 1987-88 సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడాడు.
శివల్కర్ ఫస్ట్-క్లాస్ అరంగేట్రం ఏప్రిల్ 1962లో జరిగింది, అతను ప్రపంచ పర్యటనకు వెళ్తున్న అంతర్జాతీయ XIతో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్స్ XIలో ఎంపికయ్యాడు. బాబ్ సింప్సన్, టామ్ గ్రావెనీ, కాలిన్ కౌడ్రీ, ఎవర్టన్ వీక్స్, రిచీ బెనాడ్ మరియు సోనీ రామధిన్ వంటి ప్రముఖులతో కూడిన ఆ జట్టుపై, శివల్కర్ 129 పరుగులకు 5 వికెట్లు మరియు 44 పరుగులకు 2 వికెట్లు తీసి మ్యాచ్ ని డ్రాగా ముగించాడు.
రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన ముంబై బౌలర్
మొత్తం మీద, శివల్కర్ 124 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 19.69 సగటుతో 589 వికెట్లు పడగొట్టాడు. ఆ వికెట్లలో 361 రంజీ ట్రోఫీలో వచ్చాయి. రంజీల్లో ఏ ముంబై బౌలర్ కూడా ఇంతకంటే ఎక్కువ వికెట్లు తీయకపోవడం గమనార్హం. 1972-73లో తమిళనాడుతో జరిగిన ఫైనల్‌లో శివల్కర్ చెలరేగిపోయి 16 పరుగులకు 8 వికెట్లు తన అత్యుత్తమ బౌలింగ్ ని నమోదు చేసుకున్నాడు. "భారత క్రికెట్ నేడు నిజమైన లెజెండ్‌ను కోల్పోయింది.
ఎడమచేతి వాటం స్పిన్‌పై పద్మాకర్ శివల్కర్‌కు ఉన్న నైపుణ్యం మరియు ఆటపై ఆయనకున్న లోతైన అవగాహన ఆయనను దేశీయ క్రికెట్‌లో గౌరవనీయమైన వ్యక్తిగా మార్చాయి. ముంబై మరియు భారత క్రికెట్‌కు ఆయన చేసిన అసాధారణ నిస్వార్థ సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను, " అని భారత మాజీ మీడియం పేసర్ మరియు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఒక ప్రకటనలో తెలిపారు
భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు. “శివల్కర్ ముంబై యొక్క గొప్ప మ్యాచ్ విజేతలలో ఒకరు, ఆటలో ప్రముఖుడు, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన అపారమైన రికార్డు ఉన్నప్పటికీ, భారత క్యాప్‌ను ధరించకపోవడం దురదృష్టకరం” అని జాఫర్ అన్నారు.
“ఎంతో వినయం, నిజాయితీ కలిగిన శివల్కర్ కి మైదానంలో, మైదానం బయట అనేక మంది అభిమానులు ఉన్నారు. వారంతా ఆయనను ఆరాధించారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అని జాఫర్ వ్యాఖ్యానించాడు.
చదవండి: CT 2025: కివీస్‌తో సెమీస్.. సఫారీలకు గాయాల బెడద! జట్టులోకి స్టార్ ప్లేయర్
Comments
Please login to add a commentAdd a comment