
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. అయితే ఈ జట్టు ఇంతవరకూ ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేకపోవడం ఒకింత ఆశ్చర్యకరం. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలేసే స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మస్కట్ గా ఉన్న ఈ జట్టుకి ఎందుకో ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ అందించలేకపోయాడు.
ఐపీఎల్ 2025 ప్రారంభం రోజున (మార్చి 22) కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో గతేడాది టైటిల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ జరిగే మ్యాచ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఒకవేళ అదృష్టం కలిసి రానందువల్ల ఆర్సీబీ ఇంతవరకు టైటిల్ సాధించలేకపోయిందని భావించినట్టయితే, ఈ సీజన్ అందుకు చాల అనుకూలమైనది గా భావించాలి.
ఎందుకంటే ఐపిఎల్ సీజన్ 18 స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఐకానిక్ జెర్సీ నంబర్ 18 తో సరిగ్గా సరిపోతుంది. చాలా కాలంగా జెర్సీ నంబర్ 18 కి పర్యాయపదంగా ఉన్న విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఈ సారైనా టైటిల్ సాధించి పెడతాడని అతని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
రజత్ పాటిదార్ కి కెప్టెన్సీ బాధ్యతలు
ఇక జట్టు కూర్పును చూస్తే, దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న 31 ఏళ్ల రజత్ పాటిదార్ కి ఆర్సీబీ ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. ఐపీఎల్‌లో తొలిసారి కెప్టెన్సీ చేపట్టనున్నప్పటికీ, పాటిదార్ 2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ లో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో మధ్యప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. మెగా వేలం ద్వారా గణనీయమైన మార్పులు చేసిన తర్వాత ఆర్సీబీ కొత్త దృక్పథంతో, కొత్త ఉత్సాహంతో ఐపీఎల్-2025లోకి అడుగుపెడుతుంది.
గత సీజన్‌లో ఆర్సీబీ వరుసగా ఆరు మ్యాచ్‌లను గెలిచి టాప్ నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. చివరికి రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎలిమినేటర్‌లో పరాజయం చవిచూసింది. ఆర్సీబీ మరోసారి సామర్థ్యంతో నిండిన జట్టును నిర్మించింది. శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్, బలీయమైన బౌలింగ్, నాయకత్వ అనుభవం, కలగలిసి ఈ సీజన్ లోనైనా తొలి టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఫిల్ సాల్ట్ తో కోహ్లీ ఓపెనింగ్
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ను ఆర్సీబీ రూ. 11.50 కోట్లకు తీసుకుంది. గత సీజన్‌లో కేకేఆర్ టైటిల్ గెలుచుకోవడంలో సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచ్‌ల్లో 182.01 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 435 పరుగులు సాధించాడు. గత సీజన్‌లో ఓపెనర్‌గా అతను సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆర్సీబీలో సాల్ట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉన్నందున, జట్టు అసాధారణమైన టాప్ ఆర్డర్‌ను సమకూర్చుకుంది. మిడిల్ ఆర్డర్‌లో రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్ మరియు టిమ్ డేవిడ్ ఉండటం జట్టు లైనప్‌ను మరింత బలోపేతం అవుతుంది. యావ బ్యాట్స్మన్ జితేష్ శర్మ కీపింగ్ విధులను కూడా నిర్వహిస్తాడు.
సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ రావడంతో వారి బౌలింగ్ లైనప్‌కు గణనీయమైన బలాన్నిచ్చింది. ముంబై ఇండియన్స్‌తో బిడ్డింగ్ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ సేవలను పొందేందుకు ఆర్సీబీ రూ. 12.50 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా లుంగి ఎంగిడి, నువాన్ తుషార వంటి ఫాస్ట్ బౌలర్లను చేర్చుకోవడం వలన ఆర్సీబీ బౌలింగ్ బలీయంగా ఉంది.
ఫీల్ సాల్ట్: గత సంవత్సరం కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించడం లో కీలక పాత్ర పోషించిన సాల్ట్ ఈసారి జట్టులో చేరడంతో ఆర్సీబీ బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. గత సీజన్‌లో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించిన సాల్ట్ మళ్ళీ అదే రీతిలో విజృభించి ఆడతాడని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.
భువనేశ్వర్ కుమార్: ఎంతో అనుభవ్గుణుడైన సీనియర్ బౌలర్ భువనేశ్వర్ జట్టులో చేరడంతో ఆర్సీబీ బౌలింగ్ లైనప్‌కు గణనీయమైన పదును లభించింది. కొత్త బంతిని స్వింగ్ మరియు డెత్ ఓవర్లలో యార్కర్‌లను వేసే సామర్థ్యం ఉన్న భువనేశ్వర్ జట్టు బౌలింగ్ కి కీలకం అనడంలో సందేహం లేదు.
రజత్ పాటిదార్: ఆర్సీబీ తొలి సారి ఐపీఎల్ టైటిల్ సాధించాల్సిన బృహత్తర బాధ్యత రజత్ పాటిదార్ పై ఉంది. మంచి ఫామ్ తో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న రజత్ పాటిదార్ జట్టును ముందుండి నడిపించడం ఆర్సీబీకి చాల ముఖ్యం.
విరాట్ కోహ్లీ: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ కి ఐపీల్ సీజన్ 18 చాల కీలకం. చాలా సంవత్సరాలుగా ఐపీఎల్ ట్రోఫీని గెలవాలనే కోహ్లీ ఆకాంక్ష ఈ సారైనా నెరవేరుతుందేమో చూడాలి.
ఆర్సీబీ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యష్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిక్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భండగే, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికర, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రథీ.
Comments
Please login to add a commentAdd a comment