
అతి పెద్ద క్రికెట్ పండుగ ఐపీఎల్ మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. క్యాష్ రిచ్ లీగ్ 18వ ఎడిషన్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచ ఆతృతగా ఎదురుచూస్తుంది. లీగ్‌లో పాల్గొనే ఫ్రాంచైజీలన్నీ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్లతో చేరుతున్నారు. ఫ్రాంచైజీల ముఖ్యులు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నారు.
రెండు నెలలకు పైగా సాగే ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 ప్రారంభమవుతుంది. మే 25న జరిగే ఫైనల్లో ముగుస్తుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా తమతమ శిబిరాలకు చేరుకుంటున్నారు. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఆల్రెడీ డ్యూటీకి ఎక్కేశారు. యాడ్స్‌తో బిజీగా ఉన్న విరాట్ కోహ్లి మరికొద్ది రోజుల్లో ఆర్సీబీతో జతకడతాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘంగా సాగే ఐపీఎల్‌కు ముందు సేద తీరుతున్నాడు. రోహిత్ సరదాగా కుటుంబంతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో రోహిత్.. తన నెలల చిన్నారి, కూతురు సమైరా మరియు భార్య రితికాతో కలిసి బోట్‌లో ప్రయాణిస్తూ కనిపించాడు.
ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ హిస్టరీలో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ మాత్రమే ఐదు టైటిల్స్ సాధించాయి. రోహిత్ గత సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రోహిత్ తర్వాత హార్దిక్ పాండ్యా ముంబై పగ్గాలు చేపట్టాడు.
హార్దిక్ కెప్టెన్సీలో ముంబై గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసింది. త్వరలో ప్రారంభం కానున్న సీజన్‌లో ముంబై ప్రస్థానం మార్చి 23న మొదలవుతుంది. చెన్నై వేదికగా ఆ రోజు జరిగే మ్యాచ్‌లో ముంబై.. సమవుజ్జీ సీఎస్‌కేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.
ఈ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. మెగా వేలంలో బడా స్టార్లకు ఎర వేయలేదు. కొత్తగా విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి విదేశీ ఆటగాళ్లు జట్టులో చేరారు. ట్రెంట్ బౌల్ట్‌కు గతంలో ముంబై ఇండియన్స్‌తో అనుబంధం ఉంది. మెగా వేలానికి ముందు ముంబై రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్
Comments
Please login to add a commentAdd a comment