హోలీ వేళ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ హంగామా.. వైరల్‌ వీడియో | Sachin Tendulkar, Yuvraj Singh, Ambati Rayudu Celebrating Holi | Sakshi
Sakshi News home page

హోలీ వేళ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ హంగామా.. వైరల్‌ వీడియో

Published Fri, Mar 14 2025 5:36 PM | Last Updated on Fri, Mar 14 2025 6:31 PM

Sachin Tendulkar, Yuvraj Singh, Ambati Rayudu Celebrating Holi

హోలీ పండుగ వేళ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సంబురాలు అంబరాన్నంటాయి. సందర్భం ఏదైనా రిజర్వ్‌డ్‌గా కనిపించే సచిన్‌.. ఈసారి హోలీ ఉత్సవాల్లో చెలరేగిపోయాడు. చిన్నపిల్లాడిలా మారి సహచరులను రంగులతో ముంచెత్తాడు. సచిన్‌.. సహచర క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, అంబటి రాయుడు, ఇర్ఫాన్‌ పఠాన్‌ను రంగులతో ముంచెత్తిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో సచిన్‌ రంగులతో నింపిన వాటర్‌ గన్‌తో యువీ, రాయుడు, ఇర్ఫాన్‌లపై దాడి చేశాడు.

కాగా, సచిన్‌ ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌లో బిజీగా ఉన్నాడు. యువరాజ్‌, ఇర్ఫాన్‌, రాయుడు కూడా ఈ టోర్నీలో భారత మాస్టర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ టోర్నీలో భారత జట్టుకు సచిన్‌ సారథ్యం వహిస్తున్నాడు. తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భారత్‌ ఫైనల్‌కు చేరింది. 

నిన్న జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను 94 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. సచిన్‌ (42), యువరాజ్‌ (59), స్టువర్ట్‌ బిన్నీ (36) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

ఇన్నింగ్స్‌లో చివర్లో పఠాన్‌ సోదరులు కూడా చెలరేగిపోయారు. ఇర్ఫాన్‌ 10 బంతుల్లో 23, యూసఫ్‌ 7 బంతుల్లో 19 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో సచిన్‌కు జతగా ఓపెనర్‌గా వచ్చిన అంబటి రాయుడు 5, పవన్‌ నేగి 14, గురుకీరత్‌ సింగ్‌ 1 పరుగు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో డేనియల్‌ క్రిస్టియన్‌, దోహర్తి చెరో 2 వికెట్లు పడగొట్టగా..  హిల్ఫెన్హాస్‌, స్టీవ్‌ ఓకీఫీ, కౌల్టర్‌ నైల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌.. భారత బౌలర్‌ షాబాజ్‌ నదీమ్‌ (4-1-15-4) విజృంభించడంతో 18.1 ఓవర్లలో 126 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో షాబాజ్‌తో పాటు వినయ్‌ కుమార్‌ (2-0-10-2), ఇర్ఫాన్‌ పఠాన్‌ (3.1-0-31-2), స్టువర్ట్‌ బిన్నీ (3-0-20-1), పవన్‌ నేగి (3-0-13-1) కూడా రాణించారు. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో బెన్‌ కట్టింగ్‌ (39) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. షాన్‌ మార్ష్‌ (21), బెన్‌ డంక్‌ (21), నాథన్‌ రియర్‌డాన్‌ (21), దోహర్తి (10 నాటౌట్‌) రెండ​​ంకెల స్కోర్లు చేశారు. ఈ టోర్నీలో మూడు సెంచరీలు చేసి భీకర ఫామ్‌లో ఉన్న ఆసీస్‌ కెప్టెన్‌ షేన్‌ వాట్సన్‌ (5) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 

డేనియల్‌ క్రిస్టియన్‌ 2, కౌల్టర్‌ నైల్‌ 0, హిల్ఫెన్హాస్‌ 2, ఓకీఫీ 0, మెక్‌గెయిన్‌ 3 పరుగులు చేసి ఔటయ్యారు. శ్రీలంక, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఇవాళ (మార్చి 14) జరిగే రెండో సెమీఫైనల్లో విజేతతో భారత్‌ ఫైనల్లో తలపడుతుంది. ఫైనల్‌ మ్యాచ్‌ మార్చి 16న జరుగుతుంది. 

ఈ టోర్నీలో భారత్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు పాల్గొనగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ సెమీస్‌కు చేరుకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement