న్యూ లుక్‌లో విరాట్‌.. సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్న ఫోటోలు | Virat Kohli New Haircut And Beard Are Breaking The Internet Ahead Of IPL 2025 | Sakshi
Sakshi News home page

న్యూ లుక్‌లో విరాట్‌.. సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్న ఫోటోలు

Published Fri, Mar 14 2025 4:49 PM | Last Updated on Fri, Mar 14 2025 4:49 PM

Virat Kohli New Haircut And Beard Are Breaking The Internet Ahead Of IPL 2025

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సరికొత్త లుక్‌లో కనిపించాడు. కోహ్లి న్యూ లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోలను విరాట్‌ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ ఇన్‌స్టాలో షేర్‌ చేయగా.. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఈ ఫొటోల‌కు అలీమ్‌ ఖాన్‌ 'ది గోట్ ఎన‌ర్జీ' అని క్యాప్ష‌న్ ఇచ్చారు. "వన్ అండ్‌ ఓన్లీ విరాట్ కోహ్లీ కోసం కొత్త స్నిప్. రేజర్ షార్ప్ గా కనిపిస్తున్నాడు" అని ఆలీమ్ ఖాన్ త‌న ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. నయా లుక్‌లో ఫోటోలను చూసి  త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. కొత్త లుక్‌లో కింగ్‌ అదుర్స్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మరో 8 రోజుల్లో (మార్చి 22) ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే విరాట్‌ జట్టు ఆర్సీబీ డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ కేకేఆర్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ కోల్‌కతా వేదికగా జరుగనుంది. అన్నీ ఫ్రాంచైజీలు ఐపీఎల్‌ కోసం సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమతమ జట్లలో చేరుతున్నారు. విరాట్‌ మరి కొద్ది రోజుల్లో ఆర్సీబీ క్యాంప్‌లో చేరే అవకాశం ఉంది. ఆర్సీబీ తమ ప్రాక్టీస్‌ను ఇదివరకే షురూ చేసింది. విరాట్‌ కొన్ని యాడ్‌ షూట్స్‌ కారణంగా జట్టుతో కలవడం​ ఆలస్యమైంది.

విరాట్‌తో కూడిన టీమిండియా కొద్ది రోజుల కిందట ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలిచిన విషయం తెలిసిందే. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో విరాట్‌ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అతను 5 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్‌ సెంచరీ సాయంతో 218 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో విరాట్‌ ఐదో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.

ఈ టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీ చేసిన విరాట్‌.. కీలకమైన సెమీఫైనల్లో ఆసీస్‌పై మ్యాచ్‌ విన్నింగ్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. గత కొంతకాలంగా ఫామ్‌ లేమి వల్ల అపవాదులు ఎదుర్కొన్న విరాట్‌.. ఈ టోర్నీతో తిరిగి పూర్వ వైభవం సాధించాడు. విరాట్‌ ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్‌ నమ్మదే అంటూ డప్పు కొట్టుకుంటున్నారు.

ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను సైతం తప్పించి కొత్త కెప్టెన్‌గా రజత్‌ పాటిదార్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్‌ డేవిడ్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జేకబ్‌ బేతెల్‌, ఫిల్‌ సాల్ట్‌, రొమారియో షెపర్డ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. 

చాలా​కాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్‌ పాండ్యా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, భువనేశ్వర్‌ కుమార్‌ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్‌ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.

ఐపీఎల్‌-2025లో ఆర్సీబీ జట్టు..
రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌, టిమ్‌ డేవిడ్‌, స్వస్థిక్‌ చికారా, కృనాల్‌ పాండ్యా, మనోజ్‌ భండగే, రొమారియో షెపర్డ్‌, స్వప్నిల్‌ సింగ్‌, జేకబ్‌ బేతెల్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, మోహిత్‌ రతీ, ఫిలిప్‌ సాల్ట్‌, జితేశ్‌ శర్మ, జోష్‌ హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, లుంగి ఎంగిడి, రసిక్‌ సలాం దార్‌, సుయాశ్‌ శర్మ, యశ్‌ దయాల్‌, నువాన్‌ తుషార, అభినందన్‌ సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement