
గత సీజన్ లో అనూహ్యంగా ఫైనల్ కి దూసుకొచ్చి కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయంపాలై రన్నరప్ టైటిల్ తో సరిపెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో మరింత దూకుడుగా ఆడి టైటిల్ సాధించాలని ప్రణాళిక సిద్దం చేసుకుంది.
ఆరు సంవత్సరాల విరామం తర్వాత సన్ రైజర్స్ 2024లో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. సన్ రైజర్స్ తమ మొదటి ఏడు మ్యాచ్ ల లో ఐదింటి లో విజయం సాధించి గత సీజన్ లో శుభారంభం చేసింది. చివరి దశలో మరో మూడు విజయాలు నమోదు చేసుకొని గ్రూప్ దశ చివరిలో రాజస్థాన్ రాయల్స్ తో పాటు 17 పాయింట్లతో సమంగా నిలిచింది. కానీ మెరుగైన నెట్ రన్ రేట్ తో సన్ రైజర్స్ రెండవ స్థానం పొందింది.
ఆ తర్వాత క్వాలిఫైయర్ 1లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. కానీ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి ఫైనల్‌కు చేరుకుని అక్కడ మళ్ళీ నైట్ రైడర్స్ చేతిలో పరాజయం చేతిలో పరాజయం చవిచూసి రన్నర్ ఆప్ తో సర్దుకోవాల్సి వచ్చింది.
బ్యాటింగ్ బ్యాండ్ బాజా
గత సీజన్‌లో బ్యాటింగ్ బ్యాండ్ బాజాతో ప్రారంభించి ప్రత్యర్థులను హడలెత్తించిన సన్ రైజర్స్ ఈ ఏడాది కూడా తమ ఫార్ములా లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. ఆస్ట్రేలియా కి చెందిన ట్రావిస్ హెడ్, భారత్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ల ద్వయం ప్రారంభం లో తమ విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థులను పరుగులు పెట్టించారు.
గత సీజన్ లో మూడుసార్లు 250 పరుగులు కి పైగా స్కోర్ చేసి సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డును సృష్టించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై 3 వికెట్లకు 287 పరుగులు స్కోర్ తో కొత్త రికార్డ్ ని నమోదు చేసింది.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటికీ లైనప్‌లో ఉండటంతో మరియు వేలంలో ఇషాన్ కిషన్‌ను చేర్చడంతో, సన్ రైజర్స్ హైదరాబాద్ తన పంథాను మార్చుకునే అవకాశం లేదు.
ఈ సీజన్లో కూడా సన్ రైజర్స్ యొక్క టాప్ ఐదుగురు అలాగే కొనసాగే అవకాశముంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్. లీగ్‌లోని ప్రతి బౌలింగ్ లైనప్‌ను వణికించడానికి ఇది సరిపోతుంది. కర్ణాటకకు చెందిన అభినవ్ మనోహర్ కూడా దిగువ ఆర్డర్‌లో ఫైర్‌పవర్‌ను జోడిస్తాడు. లీగ్‌లో అత్యంత శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్ సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం.
బలహీనంగా బౌలింగ్
అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కొంత బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్‌ను తప్పించి వారి స్థానంలో మహమ్మద్ షమీ మరియు హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక సన్ రైజర్స్ ప్రధాన స్పిన్నర్ రాహుల్ చాహర్ కూడా ఇటీవలి కాలంలో ఆశించిన ఫామ్‌లో లేడు. దీంతో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ భారత్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీతో కొత్త బంతిని పంచుకోవచ్చు.
సన్ రైజర్స్ తమ ఓపెనింగ్ బౌలర్లుగా ప్రపంచ స్థాయి బౌలింగ్ జతతో బరిలోకి దిగనుంది. అయితే కమ్మిన్స్ మరియు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఇద్దరూ విదేశీ ఆటగాళ్లు అయినందున వారిపై భారం ఎక్కువగా ఉండే అవకాశముంది, జంపా, కమిండు మెండిస్, ఎషాన్ మలింగ మరియు వియాన్ ముల్డర్‌లలో ఒకరిని నాల్గవ విదేశీ ఆటగాడిగా ఆడించాల్సి ఉంటుంది. జంపా ఆడటం అంటే చాహర్‌కు విశ్రాంతి ఇవ్వడం లేదా ఇద్దరు లెగ్ స్పిన్నర్లను ఫీల్డింగ్ చేయడం.
ప్రధాన ఆటగాళ్లు:
పాట్ కమ్మిన్స్: ప్రపంచ ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన పాట్ కమ్మిన్స్ జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత సన్ రైజర్స్ దశ మారిపోయింది. కమ్మిన్స్ నాయకత్వం, అపార అనుభవం ఒత్తిడి లో తట్టుకొని బౌలింగ్ చేయగల సామర్ధ్యం సన్ రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర వహించే అవకాశముంది.
ట్రావిస్ హెడ్: ట్రావిస్ హెడ్ సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌లో చాలా ముఖ్యమైన భాగంగా మారాడు. టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో అతని విధ్వంసకర బ్యాటింగ్ సన్ రైజర్స్ కి శుభారంభం ఇస్తుందనడంలో సందేహం లేదు.
హెన్రిచ్ క్లాసెన్: టి 20 క్రికెట్‌లో అత్యంత విధ్వంసక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా హెన్రిచ్ క్లాసెన్ ఖ్యాతి గడించాడు. సులభంగా బౌండరీలను క్లియర్ చేయగల అతని సామర్థ్యం మరియు స్కోరింగ్ రేటును వేగవంతం చేయడంలో నైపుణ్యం అతన్ని సన్ రైజర్స్ కి గేమ్-ఛేంజర్‌గా చేస్తాయి.
అభిషేక్ శర్మ: యువ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మ గత సీజన్ లో నిలకడగా ఆడి తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. అతని దూకుడు బ్యాటింగ్ శైలి, మెరుగైన బౌలింగ్ సన్ రైజర్స్ కి అదనపు బలాన్నిస్తాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు
పాట్ కమ్మిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైడే, అభినవ్ మనోహర్, సిమర్‌జీత్ సింగ్, జీషాన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఎషాన్ మలింగ, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్.
Comments
Please login to add a commentAdd a comment