
సంజు సామ్సన్ (PC: RR)
మొట్ట మొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ గెలుచుకున్న జట్టు రాజస్థాన్ రాయల్స్. ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రేలియా స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ (Shane Warne) నాయకత్వంలో 2008లో టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ 2022లో రన్నర్ అప్ గా నిలవడంతో పాటు.. మొత్తంగా ఆరుసార్లు ప్లేఆఫ్‌లకు చేరుకుంది.
రాయల్స్ కెప్టెన్‌గా టీమిండియా వికెట్ కీపర్ సంజూ సామ్సన్ (Sanju Samson) కొనసాగుతున్నాడు. 2025 మెగా వేలానికి ముందు రాయల్స్ అతడిని రూ.18 కోట్ల భారీ ధరకు రెటైన్ చేసుకుంది.
భారత్ క్రికెట్ లో అపార నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల లో ఒకడిగా 30 ఏళ్ళ ఈ కేరళ వికెట్ కీపర్ ఖ్యాతి వహించాడు. సామ్సన్ నాయకత్వం, సామర్థ్యాలపై ఉన్న అపార విశ్వాసాన్ని రాయల్స్ పునరుద్ఘాటించింది.
సీజన్‌లోని మొదటి మ్యాచ్ నుంచే అతను పూర్తిగా ఫిట్‌గా, అందుబాటులో ఉండాలని ఫ్రాంచైజీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐపీల్ రెండో రోజున (మార్చి 23న) హైదరాబాద్ వేదిక గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ తో రాయల్స్ ఈ సీజన్ లో తన టైటిల్ వేట ప్రారంభిస్తుంది.
గాయం నుంచి కోలుకున్న సామ్సన్
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టి20 మ్యాచ్ సందర్భంగా సామ్సన్ కుడి చూపుడు వేలు కి గాయమైంది. కొన్ని రోజుల తర్వాత అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది, రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న సామ్సన్ మళ్ళీ కోలుకున్నట్టు తెలుస్తోంది. అయితే అతను ఇంకా జట్టు శిక్షణ శిబిరంలో చేరలేదు. సంజు సామ్సన్ పునరాగమనం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే సామ్సన్ బ్యాటింగ్ ఫిట్‌నెస్ పరీక్షలో విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, వికెట్ కీపింగ్ విధులను తిరిగి ప్రారంభించడానికి ఇంకా అనుమతి రాలేదని తెలుస్తోంది. అయితే రాయల్స్ జట్టులో ధ్రువ్ జురెల్ ఉన్నందున వికెట్ కీపింగ్ బాధ్యతలు అతనికి అప్పగించే అవకాశముంది.
బౌలింగ్ లో ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పునరాగమనం తో రాయల్స్ కొత్త ఉత్సాహం తో ఉంది. గత సంవత్సరం చివరి దశలో తడబడిన తర్వాత, మెగా వేలంలో రాయల్స్ తమ జట్టును స్మార్ట్ కొనుగోళ్ల ద్వారా పునర్నిర్మించింది.
ప్రధాన కోచ్ గా చేరిన రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంతో రాయల్స్ విధానంలో మార్పు కనిపిస్తోంది. మానసిక దృఢత్వం, వ్యూహాత్మక ఖచ్చితత్వాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టింది. సామ్సన్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మైర్, రియాన్ పరాగ్, మరియు ధ్రువ్ జురెల్ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నందున బ్యాటింగ్, బౌలింగ్ రెండింటినీ బలోపేతం చేయడానికి రాయల్స్ జోఫ్రా ఆర్చర్, నితీష్ రాణాతో సహా వేలంలో కీలకమైన చేర్పులను చేసింది.
రాయల్స్ జట్టులో వ్యూహాత్మక మార్పులు
రాయల్స్ 2025 సీజన్ కోసం జట్టులో వ్యూహాత్మక మార్పులు చేసింది. అనుభవజ్ఞులైన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌లను వదులుకోవడం వారి జట్టు యొక్క ప్రధాన వ్యూహంలో మార్పును సూచిస్తుంది.
జోఫ్రా ఆర్చర్‌ను కొనుగోలు చేయడంతో బౌలింగ్ కి గణనీయమైన పదును లభించింది. ఇంకా ఫజల్‌హాక్ ఫరూఖీ , తుషార్ దేశ్‌పాండే లతో పాటు స్పిన్ విభాగంలో వానిందు హసరంగా, మహేష్ తీక్షణ ఉన్నందున మిడిల్ ఓవర్ల లలో వైవిధ్యం, పొదుపుగా బౌలింగ్ చేసే అవకాశముంది. నితీష్ రాణా చేరికతో బ్యాటింగ్ యూనిట్ బలోపేతమయ్యింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున నిలకడగా రాణించిన రాణా బ్యాటింగ్ ని బలోపేతం చేస్తాడనడంలో సందేహం లేదు. ఇంకా 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కొనుగోలు ఫ్రాంఛైజీ దీర్ఘకాలిక దృక్పథాన్ని నొక్కి చెబుతుంది.
రాయల్స్ ప్రధాన ఆటగాళ్లు:
సంజు సామ్సన్
కెప్టెన్‌గా, అత్యంత నమ్మకమైన బ్యాటర్‌గా, సామ్సన్ ముందు నుండి నాయకత్వం వహించే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఈ సీజన్‌లో జోస్ బట్లర్ లేనందున సామ్సన్ పై బాధ్యత మరింత పెరిగే అవకాశముంది. జట్టుకి స్థిరత్వాన్నివ్వడం, క్లిష్టమైన సమయాల్లో ఆదుకోవడం ఇప్పుడు సామ్సన్ పైనే ఉంటుంది.
యశస్వి జైస్వాల్
అపార నైపుణ్యం ఉన్న యువ బ్యాటర్ జైస్వాల్ ఇటీవలి ఫామ్ అంత నిలకడగా లేనందున, భారత పరిమిత ఓవర్ల జట్టులోకి మళ్ళీ రావడానికి ఐపీఎల్ అతనికి మరో అవకాశం కల్పిస్తోంది.
నితీష్ రాణా
కోల్‌కతా నైట్ రైడర్స్ నుండి రాయల్స్ కి మారడం రాణా ఐపీఎల్ కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ అతని బహుముఖ ప్రజ్ఞ రాజస్థాన్‌కు గట్టి బలాన్నిస్తోంది.
జోఫ్రా ఆర్చర్
గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్ తిరిగి రావడంతో రాజస్థాన్ బౌలింగ్ కు మళ్ళీ పదును చేకూరింది. వ్యక్తిగతంగా సంవత్సరాల గాయాల వైఫల్యాల తర్వాత, ఐపీఎల్ 2025 ఇంగ్లాండ్ పేసర్‌కు తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు అవకాశాన్ని కల్పిస్తుండంలో సందేహం లేదు.
రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు
సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, వనిందు హసరంగా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, నితీష్ రాణా, తుషార్ దేశ్‌పాండే, శుభమ్ దూబే, ఎఫ్ యుధ్‌వీర్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, క్వేనా మఫాకా, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.
చదవండి: టీ20, వన్డేలు చాలు.. టెస్టుల్లో ఆడలేను.. కారణం ఇదే: వరుణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment