IND vs NZ 2nd Test.. అన్ని అనుకూలతలు ఉన్నా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో చేతులదాకా వచ్చిన విజయాన్ని చేజిక్కించుకోలేకపోయిన భారత్ ఈసారి అలాంటి తప్పును పునరావృతం చేయరాదని పట్టుదలగా ఉంది. రెండో టెస్టులో గెలుపుతో పాటు సిరీస్‌ను కూడా సొంతం చేసుకునేందుకు టీమిండియా సన్నద్ధమైంది. నేటినుంచి వాంఖెడే మైదానంలో జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి ఈ టెస్టులో అందుబాటులోకి రావడం భారత జట్టు బలాన్ని పెంచింది. మరోవైపు పర్యాటక న్యూజిలాండ్ జట్టు కూడా తీసికట్టుగా ఏమీలేదు. ఒక్క వికెట్ చేతిలో పెట్టుకొని 11 మంది ఆటగాళ్లతో ఓ ఆటాడుకున్న కివీస్ అంతే ఆత్మవిశ్వాసంలో సమరానికి సన్నద్ధమైంది. ఈ రెండు జట్ల ఉత్సాహంపై చినుకులు కురిపించేందుకు వానా కూడా కాచుకుంది. గురువారం ముంబైలో వర్షం కురిసింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఇండోర్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేయాల్సివచ్చింది.
సాహా ఫిట్...
వచ్చీ రాగానే భారత కెప్టెన్ కోహ్లికి జట్టు కూర్పు పెను సవాలు విసురుతోంది. మైదానంలో దిగే తుది 11 మంది కోసం పెద్ద కసరత్తే చేయాల్సిన కష్టం వచ్చింది. కోహ్లి గైర్హాజరీలో కాన్పూర్‌లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ సెంచరీ, అర్ధ సెంచరీతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. దీంతో అతన్ని తప్పించడం విరాట్‌తో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఫామ్‌లో లేని రహానే, ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌లలో ఒకరిపై వేటు ఖాయం. అయితే సీనియర్‌గా రహానేకు సొంతగడ్డపై మరో అవకాశం దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
టెస్టు స్పెషలిస్టు కీపర్, అనుభజ్ఞుడైన సాహా ఫిట్‌గా ఉండటంతో ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ అరంగేట్రం చేసే అవకాశాలు తగ్గిపోయాయి. పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఇషాంత్ స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి రావచ్చు. భారత బ్యాటింగ్ లైనప్‌ను పుజారా, రహానేల వైఫల్యం కలవరపెడుతోంది. వీళ్లిద్దరు అనుభవజ్ఞులు తమ బ్యాట్లకు పని చెబితే భారత్‌కు భారీస్కోరు ఖాయమవుతుంది. వర్షంతో తేమ ఉన్నప్పటికీ సీమర్లకంటే ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్‌లపైనే టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకం పెట్టుకుంది.
కివీస్ గెలుపు ఆశలు!
టి20 సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను కోల్పోయేందుకు సిద్ధంగా లేదు. భారత్‌కు తగ్గట్టే స్పిన్ అస్త్రాలు, భారత్ కంటే మెరుగైన పేస్ బౌలర్లున్న కేన్ విలియమ్సన్ సేన ఈ టెస్టు విజయంతో సిరీస్‌ను ఎగరేసుకుపోవాలని చూస్తోంది. బౌలర్లకు అండగా బ్యాట్స్‌మెన్ కూడా నిలకడగా రాణిస్తే కివీస్ అనుకున్నది సాధిస్తుంది. ఓపెనర్లు యంగ్, లాథమ్‌లతో పాటు అనుభవజ్ఞుడైన రాస్ టేలర్ ఈ మ్యాచ్‌లో రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. అయితే మిడిలార్డర్‌లో నికోల్స్, వికెట్ కీపర్ బ్లన్‌డేల్ సత్తా చాటాల్సి ఉంది. రచిన్ రవీంద్ర స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. ఉదయం బౌన్స్‌కు అనుకూలించే వికెట్‌పై జేమీసన్, సౌతీ చెలరేగడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో భారత టాపార్డర్ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), శుబ్‌మన్, పుజారా, రహానే, అయ్యర్, సాహా, జడేజా, అశ్విన్, అక్షర్, సిరాజ్, ఉమేశ్.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), విల్ యంగ్, లాథమ్, టేలర్, నికోల్స్, బ్లన్‌డేల్, రచిన్ రవీంద్ర, కైల్ జేమీసన్, టిమ్ సౌతీ, సోమర్‌విలే /వాగ్నర్, ఎజాజ్ పటేల్.
పిచ్, వాతావరణం
తొలి రోజైతే వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో తేమ కారణంగా వాంఖెడే పిచ్ పేసర్లకు అనుకూలించవచ్చు. మూడు, నాలుగు రోజుల్లో ఆటపై స్పిన్ ప్రభావం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment