సాక్షి, న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ (సులభతర జీవన సూచీ) –2020 ర్యాంకుల్లో పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో బెంగళూరు నంబర్ 1గా నిలిచింది. విశాఖపట్నం 15వ స్థానంలో, హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచాయి. పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల్లో కాకినాడ నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే, మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (పురపాలిక పనితీరు సూచీ) ర్యాంకుల్లో పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో విశాఖపట్నం 9వ స్థానంలో నిలవగా, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల కేటగిరీలో తిరుపతి నగరం రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి గురువారం ఇక్కడ ఆన్‌లైన్ ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ర్యాంకులను విడుదల చేశారు.
జీవన నాణ్యత, పట్టణాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేసే సూచీ ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. విభిన్న అంశాల ప్రాతిపదికన పౌరుల జీవన ప్రమాణాలను ఈ ఇండెక్స్ అంచనా వేస్తుంది. పౌరుల అవగాహన సర్వేకు ఈ ఇండెక్స్‌లో 30 శాతం వెయిటేజీ ఉంటుంది. జీవన నాణ్యత, ఆర్థిక సామర్థ్యం, సుస్థిరత, 13 రంగాల (విద్య, తదితర) అభివృద్ధి అంశాలకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి ఈ ఇండెక్స్ రూపొందించారు. ఈ ర్యాంకులను రెండు కేటగిరీలుగా విభజించారు. పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాలను ఒక కేటగిరీలో, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాలను మరో కేటగిరీలో విభజించి ఈ ర్యాంకులను ప్రకటించారు. మొత్తం 110 నగరాలు ఈ ఇండెక్స్ ర్యాంకులకు పోటీ పడ్డాయి.
మిలియన్ ప్లస్ కేటగిరీలో టాప్–10 ఇవే..
ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పది లక్షలకు పైబడిన జనాభా గల నగరాల కేటగిరీలో బెంగళూరు మొదటి ర్యాంకు సాధించగా తరువాతి స్థానాల్లో వరుసగా పుణే, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై టాప్–10లో నిలిచాయి. ఏపీ నుంచి విజయవాడ 41వ స్థానంలో నిలిచింది.
నాలుగో ర్యాంకు సాధించిన కాకినాడ
ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పది లక్షల లోపు జనాభా గల నగరాల కేటగిరీలో మొదటి స్థానంలో సిమ్లా నిలవగా, తరువాతి స్థానాల్లో వరుసగా భువనేశ్వర్, సిల్వాస, కాకినాడ, సేలం, వెల్లూర్, గాంధీనగర్, గురుగ్రామ్, దావన్‌గెరె, తిరుచిరాపల్లి టాప్–10 స్థానాల్లో నిలిచాయి.
తెలంగాణ నుంచి వరంగల్ 19వ స్థానంలో, కరీంనగర్ 22వ స్థానాల్లో నిలిచాయి. ఏపీ నుంచి తిరుపతి 46వ స్థానంలో నిలిచింది.
మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఇలా..
దేశంలో తొలిసారిగా మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ రూపొందించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఒక సూచిక యొక్క ఫలితాన్ని నిర్దేశిస్తుండగా.. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఆ ఫలితానికి గల కారణాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. సేవల డెలివరీ, ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన ప్రక్రియల్లో సమర్థవంతమైన స్థానిక పాలనను నిరోధించే అంశాలను గుర్తించేందుకు ఈ ఇండెక్స్ దోహదపడుతుంది. సేవలు, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ప్రణాళిక, పరిపాలన అన్న ఐదు అంశాల ప్రాతిపదికన 20 రంగాల్లోని 100 సూచికలను ర్యాంకులకు ప్రాతిపదికగా తీసుకున్నారు.
విశాఖ –9.. తిరుపతి–2..!
మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్‌లో 10 లక్షలకు పైబడిన జనాభా కేటగిరీలో ఇండోర్ మొదటి స్థానం దక్కించుకుంది. తరువాత వరుసగా సూరత్, భోపాల్, పింప్రీ చించ్వాడ్, పుణే, అహ్మదాబాద్, రాయ్‌పూర్, గ్రేటర్ ముంబై, విశాఖపట్నం, వడోదర టాప్–10లో నిలిచాయి. ఇక, తెలంగాణ నుంచి హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచింది. ఏపీ నుంచి విజయవాడ 27వ స్థానంలో నిలిచింది. 10 లక్షల లోపు కేటగిరీలో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలిచింది. తిరుపతి రెండోస్థానంలో నిలిచింది. తరువాత వరసగా గాంధీనగర్, కర్నాల్, సేలం, తిరుప్పూర్, బిలాస్‌పూర్, ఉదయ్‌పూర్, ఝాన్సీ, తిరునల్వేలి నిలిచాయి. ఏపీ నుంచి కాకినాడ 11వ స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment