number 1
-
విద్యుత్ సరఫరాలో విశాఖ దూకుడు
గాలి వీచిందా..? అయితే కరెంట్ గోవిందా.? వర్షం పడుతోందా..? టార్చ్‌లైట్స్, చార్జింగ్ లైట్స్ వెతుక్కోవాల్సిందే. ఇంకేముంది.. గంటల తరబడి కరెంట్ రాదు. ఏంటో ఈ పవర్ సప్లై ..రోజులో గంటల తరబడి కరెంట్ ఉండటం లేదు. ఇదీ ఒకప్పుడు వినియోగదారుల నుంచి తరచూ వినిపించిన మాట.. కాలం మారింది.. కరెంట్ సరఫరాలోనూ మార్పులు వచ్చాయి. సరఫరా అంతరాయమూ మారింది. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విశాఖ సర్కిల్ నిరంతరం శ్రమిస్తోంది. అందుకే సగటున పవర్ కట్‌ను రోజులో కేవలం 4 నిమిషాలకు మాత్రమే తగ్గించుకుంటూ ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న సర్కిళ్లలో నంబర్ వన్‌లో కొనసాగుతోంది. విద్యుత్ సరఫరా విషయంలో విశాఖ దూకుడుగా వ్యవహరిస్తోందని సైదీ సైఫీ సూచీలే స్పష్టం చేస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 5 సర్కిల్స్ ఉన్నాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, ఏలూరు, విజయనగరం సర్కిల్స్ పరిధిలో నిరంతరం విద్యుత్ సరఫరాలో ఉన్న లోపాలు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలే సిస్టమ్ యావరేజ్ ఇంట్రప్షన్ డ్యూరేషన్ ఇండెక్స్ (సైదీ), సిస్టమ్ యావరేజ్ ఇంట్రప్షన్ ఫ్రీక్వెన్సీ ఇండెక్స్ (సైఫీ). రోజూ ఆయా సర్కిల్స్ పరిధిలో ఎంత సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.? ఎంత సమయానికి పున రుద్ధరించారు.? ఇలాంటి వివరాలను ఎప్పటికప్పు డు గణిస్తూ సరాసరిని చూపిస్తుంటుంది. ఈ విషయంలో విశాఖ సర్కిల్ నంబర్‌వన్‌లో నిలిచింది. ఈ సర్కిల్ పరిధిలో 17,57,727 మంది వినియోగదారులున్నారు. ఇందులో 15,02,204 డొమెస్టిక్ కనెక్షన్లుండగా, 1,70,580 కమర్షియల్, 49,037 అగ్రికల్చర్, 30,632 ఇన్స్టిట్యూషనల్, 5,274 ఇండస్ట్రీస్ కనెక్షన్లున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సైదీ సైఫీ ర్యాంకింగ్‌ను ప్రకటిస్తుంది. నాలుగు నిమిషాలు మాత్రమే.. 2014–19 మధ్య కాలంతో పోల్చితే సర్కిల్ పరిధిలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ కాలంలో రోజుకు సగటున 60 నుంచి 85 నిమిషాల వరకూ విద్యుత్ అంతరాయం ఉండేది. అంటే 24 గంటల్లో కనీసం గంటకు పైగా కరెంట్ కోతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవి. పంపిణీ విషయంలో పక్కాగా వ్యవహరిస్తూ ఆధునిక సాంకేతికతను సిబ్బంది అందిపుచ్చుకుంటూ సరఫరా అంతరాయాన్ని తగ్గించారు. గంట ఉండే అంతరాయం క్రమంగా నిమిషాలకు చేరుకుంది. ఇప్పుడు కేవలం 4 నుంచి 10 నిమిషాలు మాత్రమే రోజులో విద్యుత్ అంతరాయం ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సగటున రోజుకు 9 నిమిషాలు మాత్రమే సరఫరాకు అంతరాయం ఉండగా.. ఈ నెలలో కేవలం 4 నిమిషాలు మాత్రమే సగటు ఇంట్రప్షన్ ఉన్నట్లు సైదీ సైఫీ నివేదికలో స్పష్టమైంది. నంబర్ వన్ ర్యాంకులో... విశాఖ సర్కిల్ గత కొద్ది నెలలుగా విశాఖ సర్కిల్ సైదీ సైఫీ ర్యాంకింగ్‌లో నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయాలు లేకుండా అందించడంలో సర్కిల్ అధికారులు, సిబ్బంది సఫలీకృతమవుతున్నారు. తర్వాత ర్యాంకింగ్స్‌లో రాజమండ్రి, శ్రీకాకుళం, ఏలూరు, విజయనగరం ఉన్నాయి. కేవలం సర్కిల్ మాత్రమే కాకుండా.. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు ఇంట్రప్షన్ తగ్గిస్తూ సరఫరా అందిస్తున్నారు. విశాఖ సర్కిల్లో 4 నిమిషాలు మాత్రమే ఉండగా రాజమహేంద్రవరంలో 8 నిమిషాలు, శ్రీకాకుళం పరిధిలో 10, విజయనగరంలో 13, ఏలూరులో 16 నిమిషాలు మాత్రమే రోజుకు సగటున విద్యుత్ కోతలు జరుగుతున్నట్లు సైదీ సైఫీ ర్యాంకింగ్స్‌లో స్పష్టమైంది. మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నాం ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాం. వినియోగదారులకు ఇచ్చే విద్యుత్‌ను నాణ్యంగా ఎలా అందించాలనే అంశంపై సీఎండీ సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. దానికనుగుణంగా మార్పులు చేస్తూ అంతరాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం సగటున 4 నిమిషాలున్న ఇంట్రప్షన్ను క్రమంగా తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విపత్తుల కారణంగా ఏదైనా అవాంతరాలు ఎదురైనా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇటీవలే ఆటోమేటెడ్ సబ్‌స్టేషన్‌ను రూపొందించాం. మిగిలిన చోట్లా అదే తరహా టెక్నాలజీ వస్తే ఈ అంతరాయం మరింత తగ్గించగలం. – ఎల్ మహేంద్రనాథ్, ఏపీఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ -
దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణే నెంబర్ వన్ : కేసీఆర్
-
బెంగళూరులో సులభతర జీవనం
సాక్షి, న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ (సులభతర జీవన సూచీ) –2020 ర్యాంకుల్లో పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో బెంగళూరు నంబర్ 1గా నిలిచింది. విశాఖపట్నం 15వ స్థానంలో, హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచాయి. పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల్లో కాకినాడ నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే, మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (పురపాలిక పనితీరు సూచీ) ర్యాంకుల్లో పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో విశాఖపట్నం 9వ స్థానంలో నిలవగా, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల కేటగిరీలో తిరుపతి నగరం రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ర్యాంకులను విడుదల చేశారు. జీవన నాణ్యత, పట్టణాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేసే సూచీ ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. విభిన్న అంశాల ప్రాతిపదికన పౌరుల జీవన ప్రమాణాలను ఈ ఇండెక్స్ అంచనా వేస్తుంది. పౌరుల అవగాహన సర్వేకు ఈ ఇండెక్స్‌లో 30 శాతం వెయిటేజీ ఉంటుంది. జీవన నాణ్యత, ఆర్థిక సామర్థ్యం, సుస్థిరత, 13 రంగాల (విద్య, తదితర) అభివృద్ధి అంశాలకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి ఈ ఇండెక్స్ రూపొందించారు. ఈ ర్యాంకులను రెండు కేటగిరీలుగా విభజించారు. పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాలను ఒక కేటగిరీలో, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాలను మరో కేటగిరీలో విభజించి ఈ ర్యాంకులను ప్రకటించారు. మొత్తం 110 నగరాలు ఈ ఇండెక్స్ ర్యాంకులకు పోటీ పడ్డాయి. మిలియన్ ప్లస్ కేటగిరీలో టాప్–10 ఇవే.. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పది లక్షలకు పైబడిన జనాభా గల నగరాల కేటగిరీలో బెంగళూరు మొదటి ర్యాంకు సాధించగా తరువాతి స్థానాల్లో వరుసగా పుణే, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై టాప్–10లో నిలిచాయి. ఏపీ నుంచి విజయవాడ 41వ స్థానంలో నిలిచింది. నాలుగో ర్యాంకు సాధించిన కాకినాడ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పది లక్షల లోపు జనాభా గల నగరాల కేటగిరీలో మొదటి స్థానంలో సిమ్లా నిలవగా, తరువాతి స్థానాల్లో వరుసగా భువనేశ్వర్, సిల్వాస, కాకినాడ, సేలం, వెల్లూర్, గాంధీనగర్, గురుగ్రామ్, దావన్‌గెరె, తిరుచిరాపల్లి టాప్–10 స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ నుంచి వరంగల్ 19వ స్థానంలో, కరీంనగర్ 22వ స్థానాల్లో నిలిచాయి. ఏపీ నుంచి తిరుపతి 46వ స్థానంలో నిలిచింది. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఇలా.. దేశంలో తొలిసారిగా మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ రూపొందించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఒక సూచిక యొక్క ఫలితాన్ని నిర్దేశిస్తుండగా.. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఆ ఫలితానికి గల కారణాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. సేవల డెలివరీ, ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన ప్రక్రియల్లో సమర్థవంతమైన స్థానిక పాలనను నిరోధించే అంశాలను గుర్తించేందుకు ఈ ఇండెక్స్ దోహదపడుతుంది. సేవలు, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ప్రణాళిక, పరిపాలన అన్న ఐదు అంశాల ప్రాతిపదికన 20 రంగాల్లోని 100 సూచికలను ర్యాంకులకు ప్రాతిపదికగా తీసుకున్నారు. విశాఖ –9.. తిరుపతి–2..! మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్‌లో 10 లక్షలకు పైబడిన జనాభా కేటగిరీలో ఇండోర్ మొదటి స్థానం దక్కించుకుంది. తరువాత వరుసగా సూరత్, భోపాల్, పింప్రీ చించ్వాడ్, పుణే, అహ్మదాబాద్, రాయ్‌పూర్, గ్రేటర్ ముంబై, విశాఖపట్నం, వడోదర టాప్–10లో నిలిచాయి. ఇక, తెలంగాణ నుంచి హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచింది. ఏపీ నుంచి విజయవాడ 27వ స్థానంలో నిలిచింది. 10 లక్షల లోపు కేటగిరీలో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలిచింది. తిరుపతి రెండోస్థానంలో నిలిచింది. తరువాత వరసగా గాంధీనగర్, కర్నాల్, సేలం, తిరుప్పూర్, బిలాస్పూర్, ఉదయ్‌పూర్, ఝాన్సీ, తిరునల్వేలి నిలిచాయి. ఏపీ నుంచి కాకినాడ 11వ స్థానంలో నిలిచింది. -
‘టాప్’ ర్యాంక్‌లోనే విరాట్ కోహ్లి
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. బ్యాట్స్‌మెన్ విభాగంలో భారత కెప్టెన్ కోహ్లి 928 పాయింట్లతో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతుండగా.... 17 పాయింట్లు తేడాతో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఇతర భారత బ్యాట్స్మెన్లలో చతేశ్వర్ పుజారా (6), అజింక్య రహనే (9) తమ స్థానాలను కాపాడుకున్నారు. మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలు ఒక్కో స్థానాన్ని మెరుగుపర్చుకుని వరుసగా 12, 13వ స్థానాల్లో నిలిచారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆరో స్థానంలో ఉండగా... స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిది, పేసర్ షమీ తొమ్మిదో స్థానాల్లో నిలిచారు. ఈ విభాగంలో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. -
శాంతిభద్రతలను గాడిలో పెట్టాం: డీజీపీ
నల్లగొండ: తెలంగాణ పోలీస్ దేశంలోనే గొప్ప పోలీస్ వ్యవస్దగా, అత్యంత నాణ్యతా ప్రమాణాలు కల్గిన వ్యవస్దగా పేరు గడించిందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను గాడిలో పెట్టామని, ఇకపై ప్రపంచంలోనే గొప్ప పటిష్టమైన వ్యవస్దగా రూపుదిద్దుతామని చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు నెలకొల్పి మన పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలన్నదే పోలీస్ వ్యవస్ద తాపత్రయమని వివరించారు. జిల్లా పర్యటనకు వచ్చిన డీజీపీకి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సాదరంగా స్వాగతం పలికారు. హెడ్‌క్వార్టర్స్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో నేరం చేస్తే వెంటనే దొరికిపోతాం.. శిక్ష పడుతుంది అన్న భయాన్ని నేరగాళ్ళలో కల్గించే విధంగా పోలీస్ వ్యవస్దను తీర్చిదిద్దామని చెప్పారు. విదేశాల్లో అంత్యంత పటిష్టమైన పోలీస్ వ్యవస్ద ఉంది కాబట్టే మన పిల్లల్ని చదువుల కోసం అక్కడికి నిర్భయంగా పంపిస్తాం.. అలాగే తెలంగాణలో ఉన్న అక్కడివారు, స్థానికులు నిర్భయంగా జీవించేందుకు కావాల్సిన వాతావరణాన్ని తీసుకొస్తున్నామని, 2018 టాస్క్‌ను ఏర్పాటు చేసుకుని పోలీస్ వ్యవస్దను నెంబర్ వన్ వ్యవస్దగా తీర్చిదిద్దుతున్నామని డీజీపీ తెలిపారు. -
మోస్ట్ డిజైరబుల్.. మహేష్‌బాబు
నెంబర్ 1.. కేవలం సినిమా పేరు మాత్రమే కాదు, దేశవాసులు అత్యంత ఎక్కువగా కోరుకునే (మోస్ట్ డిజైరబుల్) జాబితాలో కూడా నెంబర్ 1 ఎవరో కాదు.. ప్రిన్స్ మహేష్ బాబు!! భారతదేశంలో మొత్తం 50 మంది పేర్లు చెప్పి.. వాళ్లలో ఎక్కువగా ఎవరిని కోరుకుంటారని టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ పోల్ నిర్వహించగా, మొత్తం 7.34 లక్షల మంది ఓట్లు వేశారు. గత రెండేళ్లుగా టాప్ 5 స్థానాల్లో నిలుస్తూ వచ్చిన మహేష్ బాబు.. ఈసారి ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ రెండో స్థానం మాత్రమే పొందగలిగాడు. 2011లో ఐదో స్థానంలోను, 2012లో రెండో స్థానంలోను ఉన్న మహేష్.. ఈసారి నేరుగా అగ్రపీఠాన్ని అందుకున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఏడు లక్షల మంది ఓట్లు వేస్తే వాటిలో ఎక్కువగా మహేష్‌కే వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సోనమ్ కపూర్ కూడా తాము ఎక్కువగా కోరుకునేది మహేష్ బాబునేనని, ఒక అవకాశం దొరికితే అతడితో కలిసి నటించాలనుకుంటున్నామని చెప్పారు!! గతంలో శ్రీనువైట్లతో దూకుడు తీసి బ్రహ్మాండమైన హిట్ సాధించిన మహేష్‌కు వాస్తవానికి 1.. నేనొక్కడినే సినిమా కలెక్షన్ల పరంగా కాస్త నిరాశనే మిగిల్చింది. అయితే, ఇప్పుడు మళ్లీ శ్రీనువైట్లతోనే 'ఆగడు' సినిమా తీస్తూ.. మళ్లీ పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్రతో మరో బంపర్ హిట్ సాధించేందుకు మహేష్ సిద్ధమవుతున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే దేశవాసులు ఎక్కువగా కోరుకునే నటుడిగా నెంబర్ 1 స్థానం దక్కడం మహేష్‌బాబుకు మంచి ఊపునిచ్చింది. తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మహేష్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతిసినిమాలోనూ కష్టపడి అభిమానులను సంతోషపెట్టాలన్నదే తన ఉద్దేశమని ఈ సందర్భంగా అన్నాడు. ఇలా నెంబర్ 1 స్థానం రావడం వెనక తన అభిమానుల అండదండలు ఉన్నాయని, వాళ్లవల్లే తాను ఇక్కడ ఉన్నానని చెప్పాడు. -
ఐటమ్ నం.1
స్టార్ హీరోల సినిమా అంటే... కథ, కథనం, నిర్మాణ విలువలు, సాంకేతిక హంగులు ఇవి మాత్రమే కాదు. వాటితో పాటు కాస్త మసాలా ఐటమ్స్ కూడా తోడవ్వాలి. ఆ మాత్రం ఘాటు లేకపోతే మాస్ ఇష్టపడరు. దర్శకుడు సుకుమార్‌కి ఆ విషయం బాగా తెలుసు. యువతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం పడాల్సిన శ్రమంతా పడతారాయన. సుకుమార్ సినిమాల్లోని రొమాంటిక్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఫన్, ఐటమ్ నంబర్లు విపరీతంగా పేలతాయంటే కారణం అదే. ప్రస్తుతం మహేష్‌తో ఆయన ‘1’ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఫైనల్‌గా మిగిలివున్న ఐటమ్ సాంగ్‌ని ముంబయ్‌లో చిత్రీకరిస్తున్నారు సుకుమార్. ఐటమ్‌సాంగ్స్ చిత్రీకరణలో సుకుమార్‌ది ఓ ప్రత్యేక శైలి. ‘ఆర్య’లోని ‘అ అంటే అమలాపురం’, ‘ఆర్య-2’లోని ‘రింగ రింగ’, ‘100%లవ్’లోని ‘పిల్లా నీ బావనిస్తవా’... ఇలా ఆయన ఐటమ్‌సాంగ్స్ అన్నీ బంపర్హిట్లే. వాటిని తలదన్నేలా ఈ ఐటమ్ నంబర్ని దేవిశ్రీప్రసాద్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ పాటలో సూపర్‌స్టార్‌తో జతకట్టే అవకాశాన్ని సోఫీ చౌదరి కొట్టేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. మహేష్ తనయుడు గౌతమ్ బాలనటునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కీర్తి సనన్ కథానాయిక. నాజర్, సయాజీ షిండే, కెల్లీ డోర్జీ, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: పీటర్హెయిన్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్.