సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైద్యరంగంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ డయాగ్నాస్టిక్స్‌పై నేషనల్ హెల్త్ మినిస్ట్రీ నుంచి ప్రశంసలు అందినట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా ఆరోగ్య శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. పల్లె దవాఖానాల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వ పనితీరును కేంద్రం ప్రశంసించింది. ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 3వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. బీజేపీ అధికారంలో ఉన్న యూపీ చివరి స్థానంలో ఉంది. కేసీఆర్ కిట్ ద్వారా 13.91 లక్షల మందికి ప్రయోజనం కలిగింది. 2014 నాటికి రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39 కాగా.. ప్రస్తుతానికి 21కి తగ్గిందని వెల్లడించారు.
వైద్య రంగానికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి టెలి కన్సల్టెన్సీ సేవలు అందించాము. టీబీ నియంత్రణ, నిర్మూలనలో తెలంగాణకు అవార్డు దక్కింది. నిమ్స్‌లో బెడ్ల సంఖ్యను 1489 నుంచి 3489కి పెంచాము. తెలంగాణలో ప్రస్తుతం 22 జిల్లాల్లో డయాగ్నోస్టిక్స్ హబ్స్ ఉన్నాయి. గత ఏడాది రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి.
మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు విద్యతో పాటు వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది. వరంగల్‌లో రూ.11వందల కోట్లతో 2వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నాము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. పేద మహిళలకు న్యూట్రీషన్ కిట్స్ కూడా అందజేస్తున్నామని తెలిపారు. వసతులు పెంచడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఎన్‌సీడీసీ స్క్రీనింగ్ ద్వారా ఇంటి వద్దకు వెళ్లి పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment