
ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం పడిపోయిన భారత పురుషుల జట్టు
లుసానే (స్విట్జర్లాండ్): ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయి మ్యాచ్‌ల్లో ఆశించిన ఫలితాలు సాధించడంలో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు విఫలమవుతోంది. ఈ నిరాశాజనక ప్రదర్శన ప్రభావం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత జట్టుపై పడింది. గురువారం విడుదల చేసిన ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 127వ స్థానానికి చేరుకుంది. క్రితంసారి భారత జట్టు 126వ స్థానంలో ఉంది. షిల్లాంగ్‌లో ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’ చేసుకుంది.
తమకంటే మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టుతో మ్యాచ్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకోవడం బంగ్లాదేశ్ జట్టుకు కలిసొచ్చిoది. ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి 183 ర్యాంక్‌లో నిలిచింది. గత ఏడాది జూన్‌లో భారత స్టార్ ప్లేయర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సునీల్ ఛెత్రి గుడ్‌బై చెప్పాక భారత ప్రదర్శన తీసికట్టుగా మారింది. దాంతో గత నెలలో సునీల్ ఛెత్రి రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకొని మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో, అంతకుముందు మాల్దీవులుతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత జట్టుకు సునీల్ ఛెత్రి నాయకత్వం వహించాడు. కొత్త కోచ్ మనోలో మార్క్వెజ్ వచ్చాక భారత జట్టు ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. భారత్ తమ అత్యుత్తమ ర్యాంక్ 94ను 1996లో సాధించింది. ఆ తర్వాత టీమిండియా తమ అత్యుత్తమ ర్యాంక్‌ను అధిగమించడంలో విఫలమవుతోంది. వరుసగా మూడోసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు గ్రూప్ ‘సి’లో తమ తదుపరి మ్యాచ్‌ను జూన్ 10న హాంకాంగ్‌తో ఆడుతుంది.
మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత విశ్వవిజేత అర్జెంటీనా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... స్పెయిన్ ఒక స్థానం మెరుగుపర్చుకొని రెండో ర్యాంక్‌కు చేరుకోగా... ఫ్రాన్స్ ఒక స్థానం పడిపోయి మూడో ర్యాంక్‌లో నిలిచింది. ఇప్పటికే 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన ఆసియా దేశాలు జపాన్ 15వ స్థానంలో, ఇరాన్ 18వ స్థానంలో ఉన్నాయి.