ఐర్లాండ్ యువ క్రికెటర్ హ్యారీ టెక్టార్ చరిత్ర సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తన దేశం తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు (722) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐర్లాండ్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఘనత పాల్ స్టిర్లింగ్ పేరిట ఉండేది. 2021 జూన్‌లో స్టిర్లింగ్ 697 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఈ రేటింగ్ పాయింట్లే చాలాకాలం పాటు ఐర్లాండ్ తరఫున అత్యధికంగా కొనసాగాయి.
మే 12న బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో (113 బంతుల్లో 140; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) శతక్కొట్టడం ద్వారా స్టిర్లింగ్ రికార్డును బద్దలుకొట్టిన టెక్టార్.. తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి (7వ ర్యాంక్) కూడా చేరాడు. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. సౌతాఫ్రికా రస్సీ వాన్‌డెర్ డస్సెన్, పాక్ ఫఖర్ జమాన్, పాక్‌కే చెందిన ఇమామ్ ఉల్ హాక్, ఇండియా శుభ్‌మన్ గిల్, ఆసీస్ డేవిడ్ వార్నర్, ఐర్లాండ్ హ్యారీ టెక్టార్, టీమిండియా విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా డికాక్, టీమిండియా రోహిత్ శర్మ టాప్-10లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఇటీవలే బంగ్లాదేశ్‌తో ముగిసిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఐర్లాండ్ 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే ఫలితం తేలకపోగా.. హ్యారీ టెక్టార్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో, మూడో వన్డేలో ఐర్లాండ్ ఓటమిపాలైంది. ఐర్లాండ్.. జూన్, జులై నెలల్లో జింబాబ్వేలో జరిగే వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్‌తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, శ్రీలంక, యుఎస్‌ఏ, యూఏఈ, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ 10 జట్లలోని రెండు జట్లు అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి.
చదవండి: శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు
Comments
Please login to add a commentAdd a comment