స్టిర్లింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఐర్లాండ్
సౌతాఫ్రికాతో మూడో వన్డేల్లో ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. సఫారీ జట్టును 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వన్డేల్లో సౌతాఫ్రికాపై ఐరిష్ టీమ్‌కు ఇది రెండో గెలుపు కావడం విశేషం. కాగా యూఏఈ వేదికగా ఐర్లాండ్- సౌతాఫ్రికా మధ్య అబుదాబి వేదికగా పరిమిత ఓవర్ల సిరీస్ జరిగింది.
రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరుజట్లు చెరో విజయంతో 1-1తో ట్రోఫీని పంచుకున్నాయి. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి రెండింటిలో సౌతాఫ్రికా వరుసగా 139, 174 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ క్రమంలో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ప్రొటిస్ జట్టుకు ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది.
పాల్ స్టిర్లింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో బల్బిర్నీ 45 పరుగులతో రాణించగా.. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ 88 రన్స్‌తో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ కర్టిస్ కాంఫర్(34) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హ్యారీ టెక్టార్ 60 పరుగులు చేశాడు.
ఇక వికెట్ కీపర్ లోర్కాన్ టకర్ 26 పరుగులు చేయగా.. లోయర్ ఆర్డర్ సింగిల్ డిజట్ స్కోర్లకే పరిమితమైంది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐర్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆది నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. ఐరిష్ బౌలర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది.
జేసన్ స్మిత్ పోరాటం వృథా
ఓపెనర్లు రియాన్ రెకెల్టన్(4), రీజా హెండ్రిక్స్(1), వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(3) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో కైలీ వెరెన్నె 38, ట్రిస్టన్ స్టబ్స్ 20 పరుగులు చేయగా.. ఆరోస్థానంలో వచ్చిన జేసన్ స్మిత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 93 బంతుల్లో 91 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే, ఐరిష్ బౌలర్ల ధాటికి మిగతా వాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో స్మిత్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. 46.1 ఓవర్లలో 215 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ కావడంతో ఐర్లాండ్ విజయం ఖరారైంది. 69 పరుగుల తేడాతో ప్రొటిస్ జట్టుపై గెలుపొందింది.
ఐర్లాండ్ బౌలర్లలో గ్రాహం హ్యూమ్, క్రెయిగ్ యంగ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. మార్క్ అడేర్ రెండు, ఫియాన్ హ్యాండ్, మాథ్యూ హంఫ్రేస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మూడో వన్డేకు ముందే... సిరీస్ కోల్పోయినా సౌతాఫ్రికా ఆధిక్యాన్ని ఐర్లాండ్ 2-1కు తగ్గించగలిగింది. ఐరిష్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment