చెలరేగిన ఓపెనర్‌.. సౌతాఫ్రికా ఘన విజయం | SA vs IRE: South Africa Crushes Ireland By 139 Runs In 1st ODI | Sakshi
Sakshi News home page

SA vs IRE: చెలరేగిన ఓపెనర్‌.. సౌతాఫ్రికా ఘన విజయం

Published Thu, Oct 3 2024 1:08 PM | Last Updated on Thu, Oct 3 2024 5:04 PM

SA vs IRE: South Africa Crushes Ireland By 139 Runs In 1st ODI

ఐర్లాండ్‌తో తొలి వన్డేలో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పాల్‌ స్టిర్లింగ్‌ బృందాన్ని ఏకంగా 139 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికగా సౌతాఫ్రికా.. ఐర్లాండ్‌తో తొలుత రెండు టీ20లు ఆడింది.

పొట్టి సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ప్రొటిస్‌ జట్టు గెలుపొందగా.. రెండో టీ20లో అనూహ్య రీతిలో ఐర్లాండ్‌ పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం వన్డే సిరీస్‌ మొదలైంది. అబుదాబి వేదికగా జరిగిన మొదటి వన్డేలో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసింది.

చెలరేగిన ఓపెనర్‌
ఓపెనర్‌ రియాన్‌ రికెల్టన్‌.. 102 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 91 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌ టోనీ డి జోర్జీ(12), కెప్టెన్‌ తెంబా బవుమా(4), వాన్‌ డెర్‌ డసెన్‌(0) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో ఐదో నంబర్‌ బ్యాటర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ రికెల్టన్‌తో కలిసి ప్రొటిస్‌ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. 86 బంతుల్లో 79 పరుగులు చేశాడు.

మిగతా వాళ్లలో జోర్న్‌ ఫార్చూన్‌ 28, లుంగి ఎంగిడి 20(నాటౌట్‌) పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. ఐరిష్‌ బౌలర్లలో మార్క్‌ అదేర్‌ నాలుగు, క్రెయిగ్‌ యంగ్‌ మూడు వికెట్లు కూల్చగా.. హ్యూమ్‌, ఆండీ మెక్‌బ్రిన్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

132 పరుగులకు ఆలౌట్‌
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను సౌతాఫ్రికా బౌలర్లు ఆది నుంచే బెంబేలెత్తించారు. ఏ దశలోనూ ఐరిష్‌ బ్యాటర్లను కోలుకోనివ్వలేదు. ఫలితంగా 31.5 ఓవర్లకే 132 పరుగులు చేసి ఐర్లాండ్‌ జట్టు కుప్పకూలింది. ప్రొటిస్‌ పేసర్లలో లిజాడ్‌ విలియమ్స్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీశాడు. ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌, వియాన్‌ ముల్దర్‌ ఒక్కో వికెట్‌ కూల్చారు. స్పిన్నర్‌ జోర్న్‌ ఫార్చున్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఐర్లాండ్ బ్యాటర్లలో జార్జ్‌ డాక్‌రెల్‌ 21 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన రియాన్‌ రెకెల్టన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం(అక్టోబరు 4) రెండో వన్డే జరుగనుంది.

చదవండి: న్యూజిలాండ్‌ టెస్టు కెప్టెన్సీకి సౌథీ గుడ్‌బై.. కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement