న్యూఢిల్లీ: నాణ్యతపరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించి అత్యుత్తమ అక్రెడిటేషన్ వ్యవస్థలు ఉన్న టాప్ అయిదు దేశాల జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. 184 దేశాల లిస్టులో అయిదో స్థానంలో నిల్చింది. గ్లోబల్ క్వాలిటీ ఇన్‌ఫ్రా ఇండెక్స్ (జీక్యూఐఐ) 2021 ర్యాంకింగ్‌లు ఇటీవల విడుదలయ్యాయి. సూచీ ప్రకారం ప్రామాణీకరణలో భారత్ తొమ్మిదో స్థానంలో, మెట్రాలజీ విషయంలో 21వ ర్యాంకులోనూ ఉంది.
ఈ జాబితాలో జర్మనీ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా, చైనా, ఇటలీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టాప్ అయిదు అక్రెడిటింగ్ వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌కు గుర్తింపు లభించడంపై భారతీయ నాణ్యతా మండలి (క్యూసీఐ) హర్షం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో నాణ్యతపరమైన మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాణాల అమలుకు తోడ్పడే సంస్థలను నియమించేందుకు జాతీయ అక్రెడిటేషన్ సంస్థ పాటించే ప్రక్రియను అక్రెడిటేషన్‌గా వ్యవహరిస్తారు.
నిర్దిష్ట సంవత్సరం ఆఖరు వరకూ ఉన్న డేటాను ఆ తదుపరి సంవత్సరంలో సేకరించి, విశ్లేషించి, ఏడాది ఆఖరున ర్యాంకింగ్‌లు విడుదల చేస్తారు. డిసెంబర్ 2021 ఆఖరు వరకు గల డేటాను 2022లో ఆసాంతం సేకరించి, విశ్లేషించి, 2021 ర్యాంకింగ్‌లు ఇచ్చారు. స్వతంత్ర కన్సల్టింగ్ సంస్థలు మెసోపార్ట్‌నర్, అనలిటికర్ ఈ జీక్యూఐఐ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment