
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ వెల్లడించిన ఆరోగ్యకరమైన రాష్ట్రాల ర్యాంకింగ్‌లో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సలహా సంస్థ అయిన నీతి ఆయోగ్ ప్రకటించిన రెండో రౌండ్ ఆరోగ్య సూచీలో కేరళ ప్రథమ స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం ఆరోగ్యపరంగా అత్యంత నాసిరకమైన ప్రమాణాలతో ఉత్తరప్రదేశ్ చివరి స్థానానికి పరిమితమైంది. 23 ఆరోగ్య అంశాల ఆధారంగా పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనే మూడు భాగాలుగా విభజించి.. నీతి ఆయోగ్ ఈ ఆరోగ్య సూచీని రూపొందించింది.
2015-16 (ప్రాతిపదిక సంవత్సరం) 2017-18 (రిఫరెన్స్ ఇయర్) మధ్యకాలానికి ఈ సూచీని రూపొందించింది. ఆరోగ్య సౌకర్యాల కల్పనకు సంబంధించి వార్షిక పెరుగుదల విషయంలో జార్ఖండ్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని, మొత్తంగా ఆరోగ్యరంగం పనితీరు ప్రకారం చూసుకుంటే.. కేరళ, పంజాబ్, తమిళనాడు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని ప్రకటించింది. ఇక, చిన్న రాష్ట్రాలలో వార్షికంగా ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడంలో మిజోరాం మొదటి స్థానంలో ఉండగా, మణిపూర్, గోవా వార్షిక పనితీరు పరంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఫిబ్రవరి, 2018లో నీతి ఆయోగ్ మొదటిరౌండ్ ఆరోగ్య సూచీని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014-15 నుంచి 2015-16 మధ్యకాలానికి మొదటిరౌండ్ సూచీని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment