
ఢాకా: ఇటీవల ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ ను 4-1తో కైవసం చేసుకున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ర్యాంకింగ్స్ లో కూడా టాప్ కు చేరిన సంగతి తెలిసిందే. ఆసీస్ తో వన్డే సిరీస్ లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచిన టీమిండియా.. దక్షిణాఫ్రికాను వెనక్కునెట్టి ప్రథమ స్థానానికి చేరింది. అయితే టీమిండియా ర్యాంకును నిలబెట్టుకునే క్రమంలో మరొకసారి దక్షిణాఫ్రికా నుంచి ఆసక్తికర పోటీ ఎదురుకానుంది.
ప్రస్తుతం విరాట్ సేన 120 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా, బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ సిద్ధమవుతున్న సఫారీలు నంబర్ వన్ ర్యాంకుపై గురి పెట్టారు. బంగ్లాతో వన్డే సిరీస్ ను దక్షిణాఫ్రికా 3-0తో సాధించిన పక్షంలో 121 పాయింట్లతో టాప్ ర్యాంకుకు చేరుతుంది. ఈ సిరీస్ లో 2-0తో సఫారీలు ఆధిక్యంలోకి దూసుకెళితే డెసిమల్ పాయింట్ల తేడాలో భారత్ తన ర్యాంకును కోల్పోతుంది. కాగా, దక్షిణాఫ్రికా సిరీస్ ను 2-1 తో గెలిచిన పక్షంలో టీమిండియా తాజా ర్యాంకుకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే దక్షిణాఫ్రికా తన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆఖరి వన్డేను అక్టోబర్ 22వ తేదీన బంగ్లాదేశ్ తో ఆడనుంది.అదే సమయంలో న్యూజిలాండ్ తో భారత్ తన తొలి వన్డే పోరుకు సిద్దమవుతుంది. ఇక్కడ కివీస్ తో తొలి వన్డేను భారత్ గెలవకుండా ఉన్న పక్షంలోనే సఫారీలు తమ ర్యాంకును కాపాడుకునే అవకాశం ఉంది. కివీస్ తో తొలి మ్యాచ్ ను భారత్ గెలిస్తే మాత్రం సఫారీలు టాప్ ర్యాంకును సాధించిన కొద్ది క్షణాల్లోనే దాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
ఇటీవల జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను దక్షిణాఫ్రికా 2-0తో గెలిచింది. సఫారీలకు ఏమాత్రం పోటీ ఇవ్వలేని బంగ్లాదేశ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఆదివారం నుంచి దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment