భారత బ్యాటర్ల సెంచరీల మోత
చివరి టి20లో భారత్ ఘన విజయం
135 పరుగులతో దక్షిణాఫ్రికా చిత్తు
3–1తో సిరీస్ టీమిండియా సొంతం
వాండరర్స్‌లో బౌండరీల వర్షం... సిరీస్‌లో తొలి మ్యాచ్ సెంచరీ హీరో, మూడో మ్యాచ్ శతక వీరుడు ఈసారి జత కలిసి సాగించిన పరుగుల ప్రవాహానికి పలు రికార్డులు కొట్టుకుపోయాయి. తిలక్ వర్మ, సంజు సామ్సన్ ఒకరితో మరొకరు పోటీ పడుతూ బాదిన సెంచరీలతో జొహన్నెస్‌బర్గ్ మైదానం అదిరింది. వీరిద్దరి జోరును నిలువరించలేక, ఏం చేయాలో అర్థం కాక దక్షిణాఫ్రికా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు.
టీమిండియా ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 23 సిక్సర్లు ఉండగా... బౌండరీల ద్వారానే 206 పరుగులు వచ్చాయి. అనంతరం మైదానంలోకి దిగక ముందే ఓటమిని అంగీకరించినట్లు కనిపించిన సఫారీ టీమ్ 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. 3 ఓవర్లు ముగిసేసరికి 10/4 వద్ద నిలిచిన ఆ జట్టు మళ్లీ కోలుకోలేదు.
జొహన్నెస్‌బర్గ్: సఫారీ పర్యటనను భారత టి20 జట్టు అద్భుతంగా ముగించింది. అన్ని రంగాల్లో తమ ఆధిపత్యం కొనసాగిస్తూ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరి పోరులో భారత్ 135 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ (47 బంతుల్లో 120 నాటౌట్; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు), సంజు సామ్సన్ (56 బంతుల్లో 109 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీలతో విధ్వంసం సృష్టించారు.
తిలక్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా... వరుసగా రెండు డకౌట్‌ల తర్వాత సామ్సన్‌కు ఈ సిరీస్‌లో ఇది రెండో శతకం కావడం విశేషం. వీరిద్దరు రెండో వికెట్‌కు 86 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది.
ధనాధన్ జోడీ...
పవర్‌ప్లేలో 73 పరుగులు... 10 ఓవర్లు ముగిసేసరికి 129... 15 ఓవర్లలో 219... చివరి 5 ఓవర్లలో 64... ఇదీ భారత్ స్కోరింగ్ జోరు! గత కొన్ని మ్యాచ్‌లలో వరుసగా విఫలమైన అభిõÙక్ శర్మ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఈసారి కాస్త మెరుగైన ఆటతో దూకుడు ప్రదర్శించాడు.
అభిషేక్ అవుట య్యాక సామ్సన్, తిలక్ జత కలిసిన తర్వాత అసలు వినోదం మొదలైంది. ప్రతీ బౌలర్‌పై వీరిద్దరు విరుచుకుపడి పరుగులు సాధించారు. మహరాజ్ ఓవర్లో తిలక్ రెండు వరుస సిక్స్‌లు కొట్టగా... స్టబ్స్ ఓవర్లో సామ్సన్ అదే పని చేశాడు. సిపామ్లా ఓవర్లో ఇద్దరూ కలిసి 3 సిక్సర్లతో 20 పరుగులు రాబట్టారు.
కెప్టెన్ మార్క్‌రమ్ ఓవర్లో తిలక్ మరింత రెచ్చిపోతూ వరుసగా 4, 6, 6, 4 బాదాడు. సామ్సన్ స్కోరు 27 వద్ద ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ ఒకదశలో అతడిని దాటేసి సెంచరీకి చేరువయ్యాడు. అయితే ముందుగా 51 బంతుల్లోనే సామ్సన్ శతకం పూర్తి చేసుకోగా... తర్వాతి ఓవర్లోనే తిలక్ 41 బంతుల్లో ఆ మార్క్‌ను అందుకున్నాడు.
టపటపా...
భారీ ఛేదనను చెత్త ఆటతో మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా గెలుపు గురించి ఆలోచించే అవకాశమే లేకపోయింది. తొలి రెండు ఓవర్లలో హెన్‌డ్రిక్స్ (0), రికెల్‌టన్ (1) వెనుదిరగ్గా... మూడో ఓవర్లో అర్ష్ దీప్ వరుస బంతుల్లో మార్క్‌రమ్ (8), క్లాసెన్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత స్టబ్స్, మిల్లర్... చివర్లో జాన్సెన్ (29; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కొద్దిసేపు నిలబడినా లాభం లేకపోయింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (నాటౌట్) 109; అభిషేక్ (సి) క్లాసెన్ (బి) సిపామ్లా 36; తిలక్ వర్మ (నాటౌట్) 120; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టానికి) 283. వికెట్ల పతనం: 1–73. బౌలింగ్: జాన్సెన్ 4–0–42–0, కొయెట్జీ 3–0–43–0, సిపామ్లా 4–0–58–1, సిమ్‌లేన్ 3–0–47–0, మహరాజ్ 3–0–42–0, మార్క్‌రమ్ 2–0–30–0, స్టబ్స్ 1–0–21–0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్‌టన్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 1; హెన్‌డ్రిక్స్ (బి) అర్ష్ దీప్ 0; మార్క్‌రమ్ (సి) బిష్ణోయ్ (బి) అర్ష్ దీప్ 8; స్టబ్స్ (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 43; క్లాసెన్ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; మిల్లర్ (సి) తిలక్ (బి) వరుణ్ 36; జాన్సెన్ (నాటౌట్) 29; సిమ్‌లేన్ (సి) బిష్ణోయ్ (బి) వరుణ్ 2; కొయెట్జీ (సి) సామ్సన్ (బి) అక్షర్ 12; మహరాజ్ (సి) తిలక్ (బి) అక్షర్ 6; సిపామ్లా (సి) అక్షర్ (బి) రమణ్‌దీప్ 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 148. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–10, 4–10, 5–96, 6–96, 7–105, 8–131, 9–141, 10–148. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–20–3, పాండ్యా 3–1–8–1, రమణ్‌దీప్ 3.2–0–42–1, వరుణ్ 4–0–42–2, బిష్ణోయ్ 3–0–28–1, అక్షర్ 2–0–6–2.
283 టి20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. గత నెలలో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 297 పరుగులు చేసింది.
210 సామ్సన్, తిలక్ జోడించిన పరుగులు. ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. రోహిత్, రింకూ (190; అఫ్గానిస్తాన్‌పై 2024లో) రికార్డు కనుమరుగైంది.
5 అంతర్జాతీయ టి20ల్లో వరుసగా రెండు శతకాలు చేసిన ఐదో బ్యాటర్ తిలక్ వర్మ. భారత్ తరఫున సామ్సన్ ఇదే సిరీస్‌లో ఆ రికార్డు నమోదు చేయగా... గతంలో మరో ముగ్గురు గుస్తావ్ మెక్‌కియాన్, ఫిల్ సాల్ట్, రిలీ రోసో ఈ ఘనత సాధించారు.
3 ఒకే మ్యాచ్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో చెక్ రిపబ్లిక్, జపాన్ బ్యాటర్లు ఈ ఫీట్ నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment