'టాప్' గేర్లో ముర్రే
మాడ్రిడ్: గత కొంతకాలంగా ప్రపంచ పురుషుల టెన్నిస్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే తన టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. సోమవారం ఏటీపీ ప్రకటించిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో ముర్రే అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. మరొకవైపు ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్(సెర్బియా)ను ఓడించిన జ్వెరావ్(జర్మనీ) టాప్ టెన్ లోకి ప్రవేశించాడు.
ప్రస్తుతం ముర్రే (10,370 పాయింట్లు)టాప్ లో కొనసాగుతుండగా, జొకోవిచ్ (7,445) రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దర మధ్య 2925 పాయింట్ల తేడా ఉండటం ముర్రే ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తుంది. ఇక స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), రఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) వరుసగా ఆ తరువాత స్థానాల్లో కొనసాగుతున్నారు. మరోవైపు మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ రెండో ర్యాంకులో నిలిచింది.