
న్యూఢిల్లీ: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు గురువారం మరో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి తొలిసారి ఐదుగురు క్రీడాకారులు టాప్–20లో నిలిచారు. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 9వ స్థానంలో, హెచ్‌ఎస్ ప్రణయ్ 15వ స్థానంలో, సాయిప్రణీత్ 17వ స్థానంలో, సమీర్ వర్మ 19వ స్థానంలో, అజయ్ జయరామ్ 20వ స్థానంలో ఉన్నారు.
మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో పీవీ సింధు రెండో స్థానంలో, సైనా నెహ్వాల్ 12వ స్థానంలో కొనసాగుతున్నారు. గతవారం జపాన్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 17వ ర్యాంక్‌కు చేరుకుంది. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 23వ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.