న్యూఢిల్లీ: 16వ లోక్‌సభ కాలపరిమితి త్వరలో ముగిసిపోనుంది. ప్రస్తుతం వివిధ దశల్లో జరుగుతున్న ఎన్నికలు ముగిస్తే మరికొద్ది రోజుల్లోనే 17వ లోక్‌సభ కొలువుకానుంది. ఈ నేపథ్యంలో 16వ లోక్‌సభలో కష్టపడి పని చేసిందెవరు? కాలక్షేపం చేసిందెవరు? ఎవరు ఉత్తములు? అట్టడుగున ఉన్నదెవరు? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇండియాటుడే. ఇందుకోసం ఇండియాటుడే ‘డేటా ఇంటెలిజెన్స్ యూనిట్’ కొన్ని ప్రామాణికాలను రూపొందించింది. అవి. వారు పార్లమెంటుకు హాజరైన రోజులు, అడిగిన ప్రశ్నల సంఖ్య, ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుల సంఖ్య, ఎంపీల్యాడ్స్ వినియోగం, వారిపై ఆయా నియోజకవర్గాల ప్రజల అభిప్రాయం అనే ఐదు అంశాలు. వీటి ప్రకారం ఎంపీల పనితీరుపై చేసిన విశ్లేషణలో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అందులో ప్రధానంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా చివరి స్థానాల్లో నిలవగా బీజేపీకి చెందిన బిహార్ బీజేపీ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రివాల్ అన్ని పరామితుల్లోనూ అగ్రగామిగా నిలిచి మొదటి ర్యాంకు, ఏ ప్లస్ గ్రేడ్ పొందారు. టాప్ టెన్‌లో ఉన్న ప్రముఖుల్లో బీజేపీకి చెందిన మీనాక్షి లేఖి 7వ, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే 10వ ర్యాంకులు పొందారు.
కాగా, ఇండియాటుడే ‘డేటా ఇంటెలిజెన్స్ యూనిట్’ మొత్తం 543 ఎన్నిౖMðన సభ్యుల్లో 416 మందిని మాత్రమే ర్యాంకింగ్స్‌లో లెక్కలోకి తీసుకుంది. 2014 మే 18వ తేదీన ఎన్నికైన రోజు నుంచి వారి పనితీరును పరిగణనలోకి తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభలో సమావేశాలకు 52 శాతం హాజరయ్యారు. అదేవిధంగా, ఎంపీల్యాడ్స్ కింద ఐదేళ్లలో కేటాయించిన రూ.25 కోట్లలో రూ.19.6 కోట్లు తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఖర్చుపెట్టారు. దీంతో రాహుల్‌కు 387వ ర్యాంకు దక్కగా రాహుల్ కంటే కొద్దిగా మెరుగ్గా 60 శాతం హాజరు శాతం ఉన్న సోనియాకు 381వ ర్యాంకులో ఉన్నారు.
కాంగ్రెస్‌కు చెందిన 39 మంది ఎంపీల్లో 11 మందికి అత్యల్ప డీ, డీ ప్లస్ గ్రేడులు రాగా బీజేపీకి చెందిన 195 మంది ఎంపీల్లో 33 మందికి డీ, డీ ప్లస్ గ్రేడులు వచ్చాయి. బీజేపీకి చెందిన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ హాజరు పట్టికలో సంతకాలు చేయనవసరం ఉండదు కాబట్టి, వారి హాజరు వివరాలు వెల్లడికాలేదు. పూర్తి స్థాయి సమాచారం లేనందున వారిని ర్యాంకుల ప్రక్రియ నుంచి మినహాయించింది. దీంతో రెండు ప్రధాన జాతీయ పార్టీల అగ్రనేతల పనితీరు అంచనా వేయలేదు. రాహుల్ గాంధీ తనదైన శైలిలో సభా చర్చలను కొన్ని సందర్భాల్లో ముందుండి నడిపారు. కానీ, ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలేవీ అడగలేదు. ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టలేదు. దీంతో ర్యాంకింగ్ ప్రక్రియలో ఆయన వెనుకబడ్డారని ఇండియా టుడే పేర్కొంది.
చివరి స్థానాల్లో టీడీపీ ఎంపీలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై టీడీపీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి 416వ ర్యాంకుతో అట్టడుగున ఉండగా, బుట్టా రేణుక 337వ ర్యాంకు పొందారు. అలాగే, టీడీపీ ఎంపీలు మాగంటి వెంకటేశ్వరరావు 323వ ర్యాంకుతో డీప్లస్ గ్రేడ్, కేశినేని శ్రీనివాస్ 348వ ర్యాంకు డీప్లస్ గ్రేడ్, జేసీ దివాకర్‌రెడ్డి 401వ ర్యాంకు డీ గ్రేడ్ పొందారు.
జనార్దన్ సింగ్ సిగ్రివాల్, ఎస్పీవై రెడ్డి, మీనాక్షి లేఖి, సుప్రియా సూలే
Comments
Please login to add a commentAdd a comment