MPLADS
-
కరోనాపై పోరుకు ‘టాటా’ విరాళం 1,500కోట్లు..
కరోనాపై యుద్ధానికి టాటా గ్రూప్ శనివారం భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది. న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారిపై యుద్ధానికి టాటా గ్రూప్ శనివారం భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది. కరోనా వైరస్ పీడితులకు అవసరమైన వెంటిలేటర్లను సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వాటిని తయారు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. దేశంలో.. ప్రపంచంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేగవంతమైన నివారణ చర్యలు అవసరమన్నారు. కరోనా నివారణకు టాటా ట్రస్టుతో కలిసి పని చేస్తామన్నారు. కరోనా నివారణతోపాటు సహాయక కార్యకలాపాలకు రూ.500 కోట్ల విరాళాన్ని టాటా ట్రస్టు ప్రకటించింది. తాము ఇవ్వనున్న రూ.1,000 కోట్లతో డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు, కరోనా టెస్టింగ్ కిట్లు అందజేయనున్నట్లు టాటా సన్స్ తెలిపింది. కరోనాను అరికట్టే విషయంలో తక్షణమే స్పందించాల్సిన సమయం వచ్చిందని టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. మానవ జాతి ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లలో కరోనా కూడా ఒకటని తెలిపారు. రూ.కోటి చొప్పున బీజేపీ ఎంపీల ఎంపీల్యాడ్స్ కరోనాపై పోరులో ప్రభుత్వానికి సాయపడేందుకు తమ పార్టీ ఎంపీలు రూ.1 కోటి చొప్పున ఎంపీల్యాడ్స్ కేటాయించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఒక నెల వేతనం విరాళంగా అందిస్తారని తెలిపారు. దీంతోపాటు తమ పార్టీ కార్యకర్తలు లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడే 5 కోట్ల నిరుపేదలకు 21 రోజులపాటు అన్నదానం చేస్తుందన్నారు. బీజేపీకి లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 386 మంది సభ్యులున్నారు. ఒక్కో ఎంపీకి ఎంపీల్యాడ్స్ కింద ఏడాదికి రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసే వీలుంది. కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు తన ఒక నెల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఎంపీలంతా తమ ఎంపీల్యాడ్స్ నుంచి రూ.కోటి విరాళంగా అందించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులను కోరారు. సన్‌ఫార్మా రూ.25 కోట్లు: కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సన్ ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. కరోనా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు రూ.25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ తదితర మం దులు, శానిటైజర్లను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. అత్యాధునిక వెంటిలేటర్లు అందిస్తాం: హ్యుండయ్ కరోనాపై పోరుకు దక్షిణ కొరియాలో వినియోగిస్తున్న అత్యాధునిక పరీక్ష కిట్లను అందించనున్న హ్యుండయ్ మోటార్స్ ప్రకటించింది. ఇవి 25 వేల మందికి ఉపయోగపడతాయని తెలిపింది. ఒకరోజు వేతనం ఇవ్వండి: జీఎస్ఐ కరోనాపై పోరులో సర్కారుకు బాసటగా నిలిచేందుకు ప్రధానమంత్రి సహాయ నిధికి ఒక రోజు వేతనం విరాళంగా ఇవ్వాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) తన ఉద్యోగులను కోరింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆరు జోన్ల అధిపతులకు వినతులు పంపినట్లు జీఎస్ఐ డీజీ శ్రీధర్ తెలిపారు. కావాలంటే వెంటిలేటర్లు సరఫరా చేస్తాం: ట్రంప్ కరోనాపై పోరులో మిత్ర దేశాలకు సాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకు వచ్చారు. వెంటిలేటర్లు, ఇతర వైద్య సామగ్రి ఉత్పత్తిని దేశీయంగా పెంచడంతోపాటు అవసరమైన దేశాలకు వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కరోనా బారినపడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపిన ట్రంప్.. వెంటిలేటర్లు పంపించాలన్న ఒకే ఒక కోరికను బోరిస్ ఈ సందర్భంగా వెల్లడించారని వ్యాఖ్యానించారు. రానున్న 100 రోజుల్లో తమ కంపెనీలు లక్ష వెంటిలేటర్లను ఉత్పత్తి చేయనున్నాయన్నారు. -
‘చెప్పుకోలేని బాధకు’..చలించిపోయారు..
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అక్కడ ఉన్న ఒకే టాయిలెట్‌తో ఇక్కట్లు పడుతున్న అంశం ప్రజాప్రతినిధులను కదిలించింది. ఈ ఇబ్బందిపై ‘చెప్పుకోలేని బాధ’శీర్షికతో శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి వారు చలించారు. రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందిస్తూ విద్యార్థినులు టాయిలెట్ కోసం చాంతాడంత క్యూలైన్ పాటించాల్సిన దుస్థితి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణ చర్యల్లో భాగంగా తన ఎంపీ నిధుల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులను విడుదల చేస్తానని ప్రకటిస్తూ ‘సాక్షి’కథనాన్ని ట్వీట్ చేశారు. టాయిలెట్ల నిర్మాణానికి తాను బాధ్యత తీసుకుని పూర్తి చేయిస్తానని, ఈ మేరకు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్లరామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఆ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.1.75లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏటీఆర్ కోరిన కేంద్రమంత్రి.. టాయిలెట్ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు. సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) తనకు సమర్పించాలని సూచించారు. అన్ని స్కూళ్లలో అవసరమైనన్ని టాయిలెట్లు : మంత్రి సబితారెడ్డి గూడూరు పాఠశాలలోని టాయిలెట్ల సమస్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆ జిల్లా కలెక్టర్‌తో ఫోనులో మాట్లాడారు. పాఠశాలలో అదనంగా మరికొన్ని మరుగుదొడ్లు నిర్మించి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గా మరుగుదొడ్లను నిర్మించాలని, ఈమేరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.మరోవైపు శనివారం ఆ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బృందం సందర్శించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది. వాళ్లది చెప్పుకోలేని బాధ... ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్నా...ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా గూడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 130మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అయితే వీరందరికీ ఒకే టాయ్‌లెట్ (మూత్రశాల) ఉంది. అలాగే ప్రాథమిక పాఠశాలలో 80మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఉపాధ్యాయులకు కలుపుకుని ఇక్కడ కూడా ఒకే టాయ్‌లెట్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లోనూ చాంతాడంత క్యూ కట్టాల్సిందే. ఏళ్ల తరబడి ఈ దుస్థితి ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు టాయ్లెట్ల నిర్మాణానికి నిధుల మంజూరుకు ముందుకు వచ్చారు. Sad to see this. Sufficient funds will be sanctioned from MPLAD Scheme to address this issue immediately . @SakshiNewsPaper@TNewstg @trspartyonline pic.twitter.com/zDMp0AuW3A — Santosh Kumar J (@MPsantoshtrs) October 26, 2019 -
సోనియా, రాహుల్ అంతంతే!
న్యూఢిల్లీ: 16వ లోక్‌సభ కాలపరిమితి త్వరలో ముగిసిపోనుంది. ప్రస్తుతం వివిధ దశల్లో జరుగుతున్న ఎన్నికలు ముగిస్తే మరికొద్ది రోజుల్లోనే 17వ లోక్‌సభ కొలువుకానుంది. ఈ నేపథ్యంలో 16వ లోక్‌సభలో కష్టపడి పని చేసిందెవరు? కాలక్షేపం చేసిందెవరు? ఎవరు ఉత్తములు? అట్టడుగున ఉన్నదెవరు? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇండియాటుడే. ఇందుకోసం ఇండియాటుడే ‘డేటా ఇంటెలిజెన్స్ యూనిట్’ కొన్ని ప్రామాణికాలను రూపొందించింది. అవి. వారు పార్లమెంటుకు హాజరైన రోజులు, అడిగిన ప్రశ్నల సంఖ్య, ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుల సంఖ్య, ఎంపీల్యాడ్స్ వినియోగం, వారిపై ఆయా నియోజకవర్గాల ప్రజల అభిప్రాయం అనే ఐదు అంశాలు. వీటి ప్రకారం ఎంపీల పనితీరుపై చేసిన విశ్లేషణలో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అందులో ప్రధానంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా చివరి స్థానాల్లో నిలవగా బీజేపీకి చెందిన బిహార్ బీజేపీ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రివాల్ అన్ని పరామితుల్లోనూ అగ్రగామిగా నిలిచి మొదటి ర్యాంకు, ఏ ప్లస్ గ్రేడ్ పొందారు. టాప్ టెన్‌లో ఉన్న ప్రముఖుల్లో బీజేపీకి చెందిన మీనాక్షి లేఖి 7వ, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే 10వ ర్యాంకులు పొందారు. కాగా, ఇండియాటుడే ‘డేటా ఇంటెలిజెన్స్ యూనిట్’ మొత్తం 543 ఎన్నిౖMðన సభ్యుల్లో 416 మందిని మాత్రమే ర్యాంకింగ్స్‌లో లెక్కలోకి తీసుకుంది. 2014 మే 18వ తేదీన ఎన్నికైన రోజు నుంచి వారి పనితీరును పరిగణనలోకి తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభలో సమావేశాలకు 52 శాతం హాజరయ్యారు. అదేవిధంగా, ఎంపీల్యాడ్స్ కింద ఐదేళ్లలో కేటాయించిన రూ.25 కోట్లలో రూ.19.6 కోట్లు తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఖర్చుపెట్టారు. దీంతో రాహుల్‌కు 387వ ర్యాంకు దక్కగా రాహుల్ కంటే కొద్దిగా మెరుగ్గా 60 శాతం హాజరు శాతం ఉన్న సోనియాకు 381వ ర్యాంకులో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన 39 మంది ఎంపీల్లో 11 మందికి అత్యల్ప డీ, డీ ప్లస్ గ్రేడులు రాగా బీజేపీకి చెందిన 195 మంది ఎంపీల్లో 33 మందికి డీ, డీ ప్లస్ గ్రేడులు వచ్చాయి. బీజేపీకి చెందిన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ హాజరు పట్టికలో సంతకాలు చేయనవసరం ఉండదు కాబట్టి, వారి హాజరు వివరాలు వెల్లడికాలేదు. పూర్తి స్థాయి సమాచారం లేనందున వారిని ర్యాంకుల ప్రక్రియ నుంచి మినహాయించింది. దీంతో రెండు ప్రధాన జాతీయ పార్టీల అగ్రనేతల పనితీరు అంచనా వేయలేదు. రాహుల్ గాంధీ తనదైన శైలిలో సభా చర్చలను కొన్ని సందర్భాల్లో ముందుండి నడిపారు. కానీ, ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలేవీ అడగలేదు. ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టలేదు. దీంతో ర్యాంకింగ్ ప్రక్రియలో ఆయన వెనుకబడ్డారని ఇండియా టుడే పేర్కొంది. చివరి స్థానాల్లో టీడీపీ ఎంపీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై టీడీపీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి 416వ ర్యాంకుతో అట్టడుగున ఉండగా, బుట్టా రేణుక 337వ ర్యాంకు పొందారు. అలాగే, టీడీపీ ఎంపీలు మాగంటి వెంకటేశ్వరరావు 323వ ర్యాంకుతో డీప్లస్ గ్రేడ్, కేశినేని శ్రీనివాస్ 348వ ర్యాంకు డీప్లస్ గ్రేడ్, జేసీ దివాకర్‌రెడ్డి 401వ ర్యాంకు డీ గ్రేడ్ పొందారు. జనార్దన్ సింగ్ సిగ్రివాల్, ఎస్పీవై రెడ్డి, మీనాక్షి లేఖి, సుప్రియా సూలే -
ముంబైపై ప్రేమను చూపిన సచిన్
సాక్షి, ముంబై : సెప్టెంబర్‌లో 23 మంది మరణానికి కారణమైన ఎల్ఫిన్ స్టోన్ బ్రిడ్జి నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి రూ. 2 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందుకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు సచిన్ టెండూల్కర్ ఒక లేఖ రాశారు. ముంబై సబర్బన్ రైల్వే ఆధునీకరణ, ప్రయాణికులకు మరింత భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకారమందిస్తానని ఆయన తెలిపారు. ముంబై సబర్బన్ రైల్వే.. అనేది ముంబై సిటీకి గుండెలాంటిదని ఆయన పేర్కొన్నారు. వందల మంది రైల్వే ఉద్యోగులు ప్రజలకోసం అనుక్షణం పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ముంబై రైల్వేని అభివృద్ధి చేసేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నించాలని రైల్వే మంత్రిని సచిన్ టెండూల్కర్ కోరారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనను అభివృద్ధి చేయడం, ప్రయాణికుల భద్రత కోసం మరిన్ని రక్షణాత్మక సౌకర్యాలను మెరుగుపరచడం చేయాలని సూచించారు. భవిష్యత్‌లో మరో ఎల్ఫిన్‌స్టోన్ వంటి దుర్ఘటనలు జరగకుండా రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని సచిన్ తన లేఖలో రైల్వే మంత్రిని కోరారు. -
'ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశమే'
-
'ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశమే'
ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల ఎంపీ ల్యాడ్స్ విషయంలో టీడీపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై వి సుబ్బారెడ్డి ఆరోపించారు. శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంపీ వై వి సుబ్బారెడ్డి మాట్లాడారు. ఎంపీలు నిధులు మంజూరు చేసినా రాజకీయ ఒత్తిళ్లతో అధికార యంత్రాంగం పనులను గ్రౌండింగ్ చేయడం లేదని విమర్శించారు. ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైఎస్ఆర్ సీపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇదే రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు. ఎంపీ ల్యాడ్స్ ప్రజలకు చేరకుండా మోకాలడ్డుతుందని ఈ సందర్భంగా టీడీపీపై వై వి సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి సమగ్రమైన దర్యాప్తు కోరతానని ఆయన వెల్లడించారు. -
ఎంపీ ల్యాడ్స్.. ఏమిటీ ల్యాప్స్!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి నిధులు(ఎంపీ ల్యాడ్స్) రూ.కోట్లు విడుదలవుతున్నా ఖర్చుకావడం లేదు. ఎంపీలు ప్రతిపాదించిన పనులు, నిధుల విభజన, కేటాయింపుల్లో సమతూకం లేక పనులు అసంపూర్తిగా మిగులుతున్నాయి. ఐదేళ్లలో విడుదలైన నిధులు, పనులకు పొంతన కుదరడం లేదు. పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కేటాయించిన పనులు పూర్తయ్యాయా? లేదా? పర్యవేక్షణ జరపకుండా కొత్త పనులకు నిధులు వెచ్చిస్తున్నారు. 2009-10, 2010-11లలో ఏటా రూ.2 కోట్ల చొప్పున ఎంపీ నిధులు విడుదల కాగా ఈ తర్వాత రూ.5 కోట్లకు పెంచారు. ఎంపీలుగాృ ఎన్నికై ఇప్పటికే నాలుగున్నరేళ్లు పూర్తి కాగా ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ కోటా రూ.19 కోట్లకు, రూ.15.58 కోట్లు విడుదల కాగా రూ.11.43 కోట్లు ఖర్చు చేశారు. పెద్దపల్లి డాక్టర్ వివేక్ జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగేళ్లలో తన కోటా కింద రూ.4.37 కోట్లు కేటాయించగా రూ.2.83 కోట్లు ఖర్చు చేశారు. మరో ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా ఎంపీ కోటా కింద విడుదలయ్యే నిధులు ఎలా ఖర్చు చేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ నిధుల లెక్క.. ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ ఐదేళ్లలో రూ.19 కోట్లు ఎంపీ ల్యాడ్స్ కింద విడుదలవుతాయన్న అంచనా మేరకు ఆయన 1,157 పనులకు ప్రతిపాదనలు చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. 2009-10లో రూ.2 కోట్లకు 284 పనులు ఆయన ప్రతిపాదించగా, ఆ సంవత్సరంలో రూ.1.80 కోట్ల విలువ చేసే 168 పనులు పూర్తయ్యాయి. 2010-11లో 138 పనులకు రూ.1.68 కోట్లు ఖర్చు చేశారు. 2011-12 నుంచి ఎంపీ కోటా రూ.5 కోట్లకు పెరగగా ఆ యేడు 356 పనులను ఆయన ప్రతిపాదించారు. అందులో రూ.4.22 కోట్లు ఖర్చు చేస్తే 213 పనులే పూర్తయ్యాయి. 2012-13లో రూ.5 కోట్లకు 298 పనులు ప్రతిపాదన చేయగా, రూ.3.73 కోట్లు ఖర్చు చేసి 160 పనులు పూర్తి చేశారు. అయితే 2013-14 సంవత్సరం కోటా మొదటి విడతలో రూ.1.54 కోట్లతో 117 పనులకు ప్రతిపాదించారు. ఎంపీగా ఆయన పదవీ కాలంలో విడుదలైన నిధులు, చేపట్టిన, పూర్తయిన పనుల వివరాలు చూస్తే ఏటా అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా ఆదిలాబాద్ ఎంపీ కోటా కింద విడుదలయ్యే రూ.19 కోట్లకు ప్రతిపాదించిన పనులు 1,157 కాగా, ఇప్పటి వరకు 619 పనులు మాత్రమే పూర్తయ్యాయి. పెండింగ్‌లో ఉన్న 538 పనులకు ఎప్పుడు నిధులు కేటాయిస్తారు? ఎప్పుడు ప్రారంభిస్తారు? అవెప్పుడు పూర్తవుతాయనేది చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి ఎంపీ కోటా కింద రూ.4.37 కోట్లు పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ ఆయన పార్లమెంట్ నియోజకవర్గం పరిధికి వచ్చే జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు నాలుగేళ్లలో రూ.4.37 కోట్లతో 316 అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. అందులో 100 పనుల కోసం రూ.2.83 కోట్లు ఖర్చు కాగా... 2013-14 సంవత్సరానికి సంబంధించిన నిధుల నుంచి ఇంకా జిల్లాకు వాటా కేటాయించలేదు. 2009-10లో 106 పనుల కోసం రూ.84.15 లక్షలు కేటాయించగా 39 పనులు పూర్తి చేశారు. 2010-11లో రూ.83.78 లక్షలు 47 పనులకు కేటాయిస్తే 19 పనులే చేపట్టారు. 2011-12లో పెరిగిన కోటా ప్రకారం 108 పనుల కోసం రూ.1.68 కోట్లు కేటాయించగా రూ.1.16 కోట్లు ఖర్చు చేసి 42 పనులు పూర్తి చేశారు. 2012-13లో రూ.1.02 కోట్లతో 55 పనులు ప్రతిపాదించగా... కొత్త పనులు చేపట్టకపోగా, గతంలో పెండింగ్ పనులకు రూ.48.50 లక్షలు చెల్లించినట్లు రికార్డులు చెప్తున్నాయి. 2013-14 సంవత్సరానికి విడుదలయ్యే ఎంపీ నిధుల కోటాలో ఇంకా జిల్లాలోని మూడు సెగ్మెంట్లకు ప్రతిపాదనలు చేసినట్లు ఇటీవల అధికారులు వెల్లడించిన ఎంపీ కోటా నిధులు, పనుల జాబితాలో లేదు. ఇదిలా వుండగా ఎంపీ కోటా కింద విడుదలయ్యే నిధుల కింద చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణలో అధికారుల కూడ పారదర్శకంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఎంపీలు సైతం వీలైనంత వరకు అసంపూర్తి పనులు లేకుండా చూసిన తర్వాతే... కొత్త పనులకు నిధులు కేటాయిస్తే బాగుంటుందంటున్నారు.