
సాక్షి, ముంబై : సెప్టెంబర్‌లో 23 మంది మరణానికి కారణమైన ఎల్ఫిన్ స్టోన్ బ్రిడ్జి నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి రూ. 2 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందుకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు సచిన్ టెండూల్కర్ ఒక లేఖ రాశారు. ముంబై సబర్బన్ రైల్వే ఆధునీకరణ, ప్రయాణికులకు మరింత భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకారమందిస్తానని ఆయన తెలిపారు. ముంబై సబర్బన్ రైల్వే.. అనేది ముంబై సిటీకి గుండెలాంటిదని ఆయన పేర్కొన్నారు. వందల మంది రైల్వే ఉద్యోగులు ప్రజలకోసం అనుక్షణం పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు.
ముంబై రైల్వేని అభివృద్ధి చేసేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నించాలని రైల్వే మంత్రిని సచిన్ టెండూల్కర్ కోరారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనను అభివృద్ధి చేయడం, ప్రయాణికుల భద్రత కోసం మరిన్ని రక్షణాత్మక సౌకర్యాలను మెరుగుపరచడం చేయాలని సూచించారు. భవిష్యత్‌లో మరో ఎల్ఫిన్‌స్టోన్ వంటి దుర్ఘటనలు జరగకుండా రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని సచిన్ తన లేఖలో రైల్వే మంత్రిని కోరారు.

