
తండ్రి దిగ్గజ క్రికెటర్.. అంతర్జాతీయ స్థాయిలో వంద శతకాలు సాధించిన ఏకైక ఆటగాడు.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటలు లిఖించుకున్న లెజెండ్.. కానీ ఆయన కుమారుడు మాత్రం క్రికెటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాడు.
ఆ తండ్రి స్పెషలిస్టు బ్యాటర్.. అయితే, కుమారుడు మాత్రం ఆల్‌రౌండర్. ఇప్పటికే ఆ తండ్రీకుమారులు ఎవరో అర్థమైపోయి ఉంటుంది...! అవును సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)- అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) గురించే ఈ పరిచయ వ్యాఖ్యాలు. సచిన్ తనయుడిగా మాత్రమే లోకానికి సుపరిచితమైన అర్జున్.. మేటి క్రికెటర్‌గా ఎదగాలంటే ఒక్కటే మార్గం ఉందంటున్నాడు యోగ్‌రాజ్ సింగ్.
రాసి పెట్టుకోండి..
‘‘అర్జున్ బౌలింగ్‌పై తక్కువగా బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి సారించాలి. సచిన్, యువరాజ్ సింగ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇదైతే రాసి పెట్టుకోండి.. ఒకవేళ యువీ గనుక సచిన్ కుమారుడిని తన వద్దకు రప్పించుకుని.. మూడు నెలల పాటు శిక్షణ ఇస్తే.. అర్జున్ మరో క్రిస్ గేల్ అవుతాడు.
ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న అర్జున్ ఒకవేళ తీవ్రంగా గాయపడితే కెరీర్‌కు ప్రమాదం. ముందుగా చెప్పినట్లు అర్జున్ ఒక్కసారి యువరాజ్ దగ్గర శిక్షణ తీసుకుంటే మాత్రం అతడు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు’’ అని యోగ్‌రాజ్ సింగ్ క్రిక్‌నెక్ట్స్ తో పేర్కొన్నాడు. కాగా అర్జున్ ఒకప్పుడు తన దగ్గర శిక్షణ తీసుకున్నట్లు యోగ్‌రాజ్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.
బౌలింగ్ ఆల్‌రౌండర్
కాగా 25 ఏళ్ల అర్జున్ టెండుల్కర్ బౌలింగ్ ఆల్‌రౌండర్. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ అయిన అతడు.. ఎడమచేతి వాటం బ్యాటర్. దేశవాళీ క్రికెట్‌లో గోవాకు ఆడుతున్న ఈ ముంబై కుర్రాడు.. 2024-25 సీజన్‌లో పూర్తిగా నిరాశపరిచాడు.
దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో రెండు ఇన్నింగ్స్ ఆడి కేవలం 40 పరుగులు చేశాడు. అదే విధంగా మూడు మ్యాచ్‌లలో కలిపి నాలుగు వికెట్లు తీశాడు. ఇక రంజీ ట్రోఫీలో మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 51 పరుగులు చేసిన అర్జున్.. బౌలర్‌గా మాత్రం ఆకట్టుకున్నాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడి పదహారు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉండటం విశేషం.
ఇక దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 2024-25 సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి 21 పరుగులు చేసిన అర్జున్.. ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ జట్టుతో ఉన్నాడు. మెగా వేలం-2025లో అర్జున్‌ను ముంబై రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.
చదవండి: IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా?