yograj singh
-
మా నాన్నకు ఆ సమస్య ఉంది: యువీ కామెంట్స్ వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనిలపై మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కపిల్ వల్ల తన కెరీర్ సజావుగా సాగలేదన్న యోగ్రాజ్.. తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్‌ను ధోని నాశనం చేశాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో యువీ గతంలో తన తండ్రి యోగ్రాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.‘‘మా నాన్నకు మానసిక సమస్యలు ఉన్నాయి. కానీ ఆయన ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అదే ఆయనకున్న అతి పెద్ద సమస్య. ఇది ఆయనకు తెలిసినా మారేందుకు సిద్ధంగా లేరు’’ అంటూ యువరాజ్ సింగ్ గతేడాది నవంబరులో రణ్వీర్ అల్హాబ్దియా పాడ్‌కాస్ట్‌లో యోగ్రాజ్ గురించి చెప్పుకొచ్చాడు.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా.. ధోని అభిమానులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ధోని వంటి టాప్ క్రికెటర్‌ను టార్గెట్ చేయడం ద్వారా యోగ్రాజ్ వార్తల్లో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నాడని.. అయితే, ఇప్పుడు ఇలాంటి చవకబారు మాటలను ఎవరూ పట్టించుకోరని కామెంట్లు చేస్తున్నారు. యువీ తన తండ్రి గురించి చెప్పింది వందకు వంద శాతం నిజమని పేర్కొంటున్నారు. యోగ్రాజ్ ఇలాగే మాట్లాడితే యువరాజ్‌కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని.. ఇకనైనా ఆయన తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.కాగా టీమిండియా తరఫున 1980-81 మధ్య కాలంలో ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడాడు యోగ్రాజ్. అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ వల్లే తనకు అవకాశాలు కరువయ్యాయని గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్న అతడు.. తన కుమారుడిని విజయవంతమైన క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని భావించాడు. తండ్రి ఆశయాలకు తగ్గట్లుగానే మేటి ఆల్‌రౌండర్‌గా ఎదిగిన యువీ.. క్యాన్సర్‌ను జయించి మరీ ఆటను కొనసాగించాడు.అయితే, 2015 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యువీకి ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లాయి. ఫలితంగా 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే నాడు ధోని కెప్టెన్‌గా ఉండటం గమనార్హం. అంతేకాదు.. యువీ-ధోని అండర్-19 క్రికెట్లోనూ సమకాలీకులే. ఇద్దరు ప్రతిభావంతులే అయినా ధోని తన అసాధారణ నైపుణ్యాలతో కెప్టెన్‌గా ఎదిగాడు.ఈ నేపథ్యంలో ధోని గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘నేను ధోనిని ఎన్నటికీ క్షమించను. ఒకసారి అతడు అద్దంలో తన ముఖం చూసుకోవాలి. అతడొక పెద్ద క్రికెటరే కావొచ్చు. కానీ నా కుమారుడి విషయంలో అతడేం చేశాడు? నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడు. అతడు కనీసం మరో నాలుగేళ్లపాటు ఆడేవాడు.కానీ ధోని వల్లే ఇదంతా జరిగింది. యువరాజ్ వంటి కొడుకును ప్రతి ఒక్కరు కనాలి’’ అని యోగ్రాజ్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా కపిల్ దేవ్ గురించి ప్రస్తావిస్తూ.. కపిల్ కంటే తన కొడుకు యువీనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అని చెప్పుకొచ్చాడు. అయితే, యువీ ఇంత వరకు తన తండ్రి వ్యాఖ్యలపై స్పందించలేదు. My Father has mental issues : Yuvraj #MSDhoni pic.twitter.com/KpSSd4vDzA— Chakri Dhoni (@ChakriDhonii) September 2, 2024 -
కోహ్లి కాదు!.. అతడు 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో ఏదీ కలిసి రావడం లేదు. టీ20 ప్రపంచకప్-2022 సెమీస్‌లోనే భారత జట్టు నిష్క్రమించిన తర్వాత.. సుదీర్ఘకాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్నాడు హిట్‌మ్యాన్.ప్లే ఆఫ్స్ చేర్చినాగతేడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ బ్యాటర్‌గా స్థాయికి తగ్గట్లు రాణించలేదు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 16 మ్యాచ్‌లలో కలిపి 332 పరుగులు మాత్రమే చేశాడు. ఇక జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సారథిగా సఫలమైనా.. ముంబై ఫ్రాంఛైజీ అతడిపై ఈసారి వేటు వేసింది.గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫ్రాంఛైజీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫోకస్ చేయలేకఇక పాండ్యా ప్రవర్తనతో విసిగిపోయిన రోహిత్ బ్యాటింగ్‌పై కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నాడని గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఐపీఎల్-2024లో ఇప్పటి దాకా 13 మ్యాచ్‌లు ఆడి 349 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తర్వాత టీమిండియా జూన్ 1నుంచి మొదలుకానున్న ప్రపంచకప్-2024కు సన్నద్ధంకానుంది. ఇందుకోసం ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలో బీసీసీఐ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది.అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత 37 ఏళ్ల రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. వయసు, ఫిట్నెస్ రీత్యా రెండు ఫార్మాట్లకు కూడా గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజం కాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ రోహిత్ శర్మ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. "అసలు వయసు గురించి ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.40, 42.. 45 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్తో ఉండి.. బాగా ఆడుతుంటే.. ఆ ఆటగాడి రిటైర్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మన దేశంలో చాలా మంది 40 ఏళ్ల వయసు వచ్చిందంటే.. పిల్లల పెంపకం గురించి ఆలోచిస్తూ కాలం గడిపేయాలనే ఆలోచనతో ఉంటారు. వయసు అయిపోయిందని.. ఆటకు పనికిరామని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడుటీమిండియా తొలిసారి వరల్డ్ కప్ గెలిచినపుడు మొహిందర్ అమర్నాథ్ వయసు 38 ఏళ్లు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే. అసలు ఏజ్ గురించి టీమిండియాలో చర్చ అనవసరం అంటాను.రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి గొప్ప ప్లేయర్లు ఫిట్నెస్ గురించి పెద్దగా అవసరం లేదు. ఒకవేళ రోహిత్ ఆడాలనుకుంటే 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు" అని యోగ్రాజ్ సింగ్ అని స్పోర్ట్స్18తో చెప్పుకొచ్చాడు.కాగా ఫిట్‌నెస్‌కు మారుపేరైన విరాట్ కోహ్లి కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగించగలడన్న విశ్లేషణల నేపథ్యంలో అతడి పేరు ఎత్తకుండా యోగ్రాజ్ కేవలం రోహిత్, వీరూ పేర్లు చెప్పడం విశేషం.చదవండి: T20 WC: హార్దిక్‌ను సెలక్ట్ చేయడం రోహిత్‌కు ఇష్టం లేదు.. కానీ! -
అఫీషియల్: కమల్‌హాసన్ మూవీలో స్టార్ క్రికెటర్ తండ్రి.. పోస్ట్ వైరల్
విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇండియన్-2'. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చిది. ఇవాళ చెన్నైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో పంజాబ్‌కు చెందిన ప్రముఖ నటుడు కనిపించనున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన మేకప్ వేసుకుంటున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. యోగ్ రాజ్.. తన ఇన్‌స్టాలో రాస్తూ...' ఈ చిత్రంలోని నటీనటులందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఇంత అందంగా తయారు చేస్తున్న మేకప్ మ్యాన్‌కు థ్యాంక్స్. కమల్ హాసన్ ఇండియన్-2 సినిమాలో నటించేందుకు పంజాబ్ సింహం సిద్ధంగా ఉంది.' అంటూ రాసుకొచ్చారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇప్పటికే తిరుపతిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింత్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. View this post on Instagram A post shared by Yograj Singh (@yograjofficial) -
'నా తండ్రి వ్యాఖ్యలు నన్ను బాధించాయి'
ముంబై : టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. నేడు 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా యువీ ట్విటర్ వేదికగా ఎమోషనల్ అయ్యాడు. 'ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. దేశానికి రాజుగా అభివర్ణించే రైతు ఈరోజు నిరసనలు చేయడం బాధగా ఉంది. పుట్టినరోజులనేవి వస్తుంటాయి.. పోతుంటాయి.రైతులు దేశానికి వెన్నముక అన్న మాట నిజం.. వారు చేస్తున్న ఆందోళన త్వరలోనే సమసిపోవాలని.. కేంద్రంతో చర్చలు శాంతియుత వాతావరణంలో జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. (చదవండి : నెటిజన్ కామెంట్‌కు గబ్బర్ ధీటైన కౌంటర్) రైతుల చేస్తున్న ఆందోళనకు నా తండ్రి యోగరాజ్ మద్దతు పలికారు. వారి ఆందోళన సరైనదేనని.. వెంటనే రైతుల డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రానికి తెలిపారు. అంతేగాక రైతుల ఆందోళనకు మద్దతుగా కొందరు క్రీడాకారులు తమ అవార్డులను కూడా వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇలా చేస్తున్నారంటే రైతుల ఉద్యమంలో నిజం ఉందని ..అందుకే వారి సమస్యలు తీర్చాలని నా తండ్రి పేర్కొనడం బాధ కలిగించింది. ఆయన ఆలోచన విధానాలతో నేను సరితూగలేను.ఎవరి ఐడియాలజీ వారికి ఉంటుంది. ఆయన వ్యాఖ్యలను నేను తప్పుబట్టలేను.. అలా అని సమర్థించలేను.అంతేకాదు కోవిడ్ -19 మహమ్మారి ఇంకా ముగియలేదు. కరోనా వైరస్ పై పోరాడటానికి జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరుతున్నా. జై జవాన్, జై కిసాన్! జై హింద్' అంటూ ఉద్వేగంతో ముగించాడు. (చదవండి : బీకేర్ ఫుల్.. మరిన్ని బౌన్సర్లు దూసుకొస్తాయి) pic.twitter.com/MOUj65QtDs — Yuvraj Singh (@YUVSTRONG12) December 11, 2020 ఇక 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న యువరాజ్ సింగ్ 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అనతికాలంలోనే డాషింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన యువీ 304 వన్డేల్లో 8701, 40 టెస్టుల్లో 1900, 58 టీ20ల్లో 1177 పరుగులు చేశాడు. ఇందులో వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్ సెంచరీలు, టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వన్డేల్లో 120 వికెట్లు.. టెస్టుల్లో 10 వికెట్లు తీశాడు. 2007టీ 20, 2011 వన్డే ప్రపంచకప్‌లు టీమిండియా గెలవడంలో యూవీ కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. టీమిండియా తరపున టీ20ల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ అతని పేరిట ఉండడం మరో రికార్డుగా చెప్పవచ్చు. -
‘ధోని, కోహ్లిలు వెన్నుపోటు పొడిచారు’
హైదరాబాద్: టీమిండియా ప్రస్తుత సారథి విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిలపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. యువీ కెరీర్ కష్టకాలంలో ఉన్నప్పుడు వీరిద్దరు అండగా నిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్రాజ్ మాట్లాడుతూ.. ‘యువరాజ్‌ను ఎంతో మంది వెన్నుపోటు పొడిచారు. అందులో ధోని, కోహ్లిలు కూడా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. సెలక్టర్ శరణ్‌దీప్ కూడా యూవీని జట్టు నుంచి తప్పించాలని చూశాడు’అంటూ షాకింగ్స్ కామెంట్స్ చేశాడు. ధోని, కోహ్లిలపై యోగ్రాజ్ ఇలాంటి ఆరోపణలు చేయడం కొత్తేంకాదు. వన్డే ప్రపంచకప్-2011 సమయంలో యువీని తప్పించి రైనాను జట్టులోకి తీసుకోవాలని ధోని ప్రయత్నించాడని గతంలో ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. తన కొడుకు రాణిస్తే తమకు పేరు రాదనే ఉద్దేశంతోనే ధోని, కోహ్లిలు యువీ పట్ల వివక్ష చూపించేవారని యోగ్రాజ్ విమర్శించేవాడు. ఇక యువీ సైతం తన కెరీర్లో సౌరవ్ గంగూలీ నుంచి వచ్చిన మద్దతు మరెవరి నుంచి రాలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: 'అందుకే రైనాను పక్కన పెట్టాం' శిఖర్ ధావన్‌ను చూడగానే ఏడ్చేశాను.. -
తలైవాతో తలపడుతున్నారు
అవును తలైవా (నాయకుడు) రజనీకాంత్‌తో తలపడుతున్నారట యోగ్రాజ్ సింగ్. ఇంతకీ ఎవరీ యోగ్రాజ్ సింగ్? అంటే క్రికెట్‌ను ఫాలో అయ్యేవాళ్లకు ఈ పేరు సుపరిచితమే. ఇండియన్ క్రికెట్ టీమ్ తరపున కొన్ని మ్యాచులు ఆడటంతో పాటు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ అని చాలామందికి తెలుసు. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత పంజాబీ ఇండస్ట్రీలో యాక్టర్‌గా సినిమాలు చేస్తున్నారాయన. ఇప్పుడు రజనీకాంత్ తాజా చిత్రంలో నటిస్తున్నారని తెలిసింది. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. 25 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో రజనీ పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఇందులో యోగ్రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్‌లో రజనీ, యోగ్రాజ్ తలపడనున్నారని తెలిసింది. యోగ్రాజ్ ఇది వరకు ‘సింగ్ ఈజ్ కింగ్, భాగ్ మిల్కా భాగ్’ వంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించారు. ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
అతడిని ఎప్పటికీ క్షమించను: యువీ తండ్రి
చండీగఢ్: యువరాజ్ సింగ్‌కు చిన్నతనంలో క్రికెట్ అంటే ఇష్టముండేది కాదని అతడి తండ్రి యోగ్రాజ్ సింగ్ తెలిపారు. క్రికెట్ మీద తనకు ఉన్న ఇష్టంతోనే కొడుకుతో బ్యాట్ పట్టించానని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. (చదవండి: యువరాజ్ గుడ్‌బై) ‘ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడే యువీకి క్రికెట్ బ్యాట్ కొనిచ్చాను. వాడికి ఫస్ట్ బౌలర్ మా అమ్మ గుర్నమ్ కౌర్. మెల్లగా బంతి విసిరి వాడికి ఆట నేర్పేది. ఇప్పటికీ ఈ ఫొటో మా దగ్గర ఉంది. వయసు పెరిగేకొద్ది స్కేటింగ్, టెన్నిస్ ఆడటం మొదలుపెట్టాడు. క్రికెట్‌కు దూరమైపోతాడన్న భయంతో స్కేటింగ్ కిట్‌ను బయటకు విసిరేసి, టెన్నిస్ రాకెట్‌ను విరగొట్టేశాడు. అప్పుడు యువీ బాగా ఏడ్చాడు. నా మీద కోపంతో సెక్టార్ 11లో ఉన్న మా ఇంటిని జైలు అని, నన్ను డ్రాగన్ సింగ్ అంటూ పిలిచేవాడు. తర్వాత మెల్లగా వాడి దృష్టిని క్రికెట్‌వైపు మళ్లించాను. ఆరేళ్ల ప్రాయంలో యూవీని సెక్టార్ 16లోని స్టేడియంలోని పేస్ బౌలింగ్ అకాడమీకి తీసుకెళ్లాను. హెల్మెట్ లేకుండా ప్రాక్టీస్ చేయమని వాడికి చెప్పాను. శిక్షణలో భాగంగా రోజూ గంటన్నరపాటు స్టేడియంలో పరుగెత్తేవాడు. నాకు బాగా గుర్తుంది. యువీకి కఠిన శిక్షణ ఇప్పించడం చూసి మరణశయ్యపై ఉన్న మా అమ్మ ఒకసారి నన్ను మందలించింది. వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నానని మండిపడింది. ఈ ఒక్క విషయంలోనే నా కుమారుడి పట్ల కఠినంగా ఉన్నందుకు బాధ పడ్డాను. మొదట్లో క్రికెట్‌ను యువీ ద్వేషించాడు. కానీ క్రికెట్‌ను అతడు ప్రేమించేలా చేశాను. క్రికెట్లో అతడు ఏం సాధించాడో ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి తెలుసున’ని యోగ్రాజ్ ఒకింత గర్వంగా అన్నారు. ఒంటరిగా కూర్చుని ఏడ్చాను తన కుమారుడికి క్యాన్సర్ సోకిందని తెలియగానే అంతులేని బాధ కలిగిందని యోగ్రాజ్ సింగ్ తెలిపారు. క్యాన్సర్‌తో యువీ కథ ముగియకూడదని దేవుడిని ప్రార్థించాను. తానేప్పుడు యువీ ఎదుట బాధ పడలేదని, గదిలో ఒంటరిగా ఏడ్చేవాడినని వెల్లడించారు. క్యాన్సర్‌తో తాను చనిపోతే.. తన చేతిలో వరల్డ్‌కప్ ట్రోఫినీ ప్రపంచమంతా చూడాలని తనతో యువీ చెప్పినట్టు గుర్తుచేసుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటనకు ముందు చండీగఢ్‌లో రెండు రోజుల పాటు యువీ సంతోషంగా గడిపాడని చెప్పారు. (చదవండి: మైదానంలో ‘మహరాజు’) చాపెల్‌ను క్షమించను యువీ కెరీర్‌ను భారత క్రికెట్ మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ నాశనం చేశాడని యోగ్రాజ్ సింగ్ మండిపడ్డారు.‘చాపెల్ కోచ్‌గా ఉన్నప్పుడు ఖోఖో ఆడుతుండగా యువీ మోకాలికి గాయమైంది. ఇది అతడి క్రీడాజీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. గాయపడకుంటే వన్డే, టీ20ల్లో అంతర్జాయతీయ రికార్డులన్నిటినీ యువీ బద్దలుకొట్టేవాడు. కోచ్‌గా ఉన్నప్పుడు నెట్ ప్రాస్టీస్‌కు ముందు ఖోఖో లాంటి దేశీయ ఆటలను చాపెల్ ఆడించేవాడు. ఇలా ఆడుతున్నపుడే యువీ గాయపడ్డాడు. నా కుమారుడి క్రీడా జీవితాన్ని నాశనం చేసినందుకు చాపెల్‌ను ఎన్నటికీ క్షమించలేన’ని యోగ్రాజ్ అన్నారు. -
క్రికెట్ ఎంత ఇష్టమో.. అంత అయిష్టం: యువీ
ముంబై : క్రికెట్ తనకు ఎంత ఇష్టమో అంతే అయిష్టమని టీమిండియా తాజా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. నిలకడలేమి ఆటతో జట్టుకు దూరమైన యువీ అనూహ్యంగా సోమవారం వీడ్కోలు పలికాడు. ముంబైలోని ఓ హోటల్లో మీడియాతో సమావేశమైన యువీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అయితే మీడియా సమావేశంలో యువీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘క్రికెట్‌తో నేను చాలా నేర్చుకున్నాను. జీవితంలో ఎలా పోరాడాలో ఆటనే నేర్పింది. అందుకే నాకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అయితే చాలా సమయాల్లో మానసికంగా చాలా ఒత్తిడికి గురిచేసింది. అందుకే అయిష్టం(నవ్వుతూ). నా తండ్రి యోగ్రాజ్ సింగ్ నాకు తొలి గురువు. మా ఇద్దరి రిలేషన్ షిప్ చాలా వెరైటీగా ఉండేది. పదేళ్ల వయసులోనే 16 ఏళ్ల పిల్లవాడిలా పరిగెత్తించేవాడు. కష్ట సమయాల్లో నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు’అంటూ యువీ భావోద్వేగానికి గురయ్యాడు. యువీ ఆటను చూస్తే వారు గుర్తొచ్చేవారు.. యువరాజ్ సింగ్ ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం అతడి తండ్రి యోగ్రాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘యువరాజ్ ఆటను చూస్తే నాకు గ్యారీఫీల్డ్ సొబెర్స్, వీవీ రిచర్డ్స్‌లు గుర్తొచ్చేవారు. కచ్చితమైన షాట్లు, టైమింగ్‌తో యువీ ఎన్నో సార్లు నన్ను ఆశ్చర్యపరిచాడు. భవిష్యత్‌లో యువీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అని పేర్కొన్నాడు. ఇక యోగ్రాజ్ కూడా క్రికెటరే అన్న విషయం తెలిసిందే. టీమిండియా తరుపున అతడు ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడాడు. చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్ సింగ్ ‘క్రికెట్లో ఒక శకం ముగిసింది’ -
దేవుడా.. ధోనీని క్షమించి, కాపాడు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై గతంలో పలుమార్లు ఘాటైన విమర్శలు చేసిన ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ మనసు మార్చుకున్నాడు. భారత జట్టులో యువరాజ్ చోటు కోల్పోవడానికి ధోనీయే కారణమని గతంలో నిందించిన యోగ్రాజ్.. ఇప్పుడు అతన్ని క్షమిస్తున్నట్టు చెప్పాడు. అంతేగాక ధోనీని దేవుడు క్షమించి, కాపాడాలని కోరాడు. ‘ధోనీని దేవుడు కాపాడాలి. కటక్ వన్డేలో అతను సెంచరీ చేయాలని కోరుకున్నా. నేను ధోనీని క్షమించాను. నా కొడుకు యువరాజ్‌కు చెడు చేసినందుకు ధోనీ క్షమించాల్సిందిగా దేవుణ్ని ప్రార్థిస్తున్నా. దేవుడు అతని వెన్నంటే ఉండి మంచి చేయాలని కోరుకుంటున్నా. యువీ మూడేళ్ల సమయాన్ని ధోనీ వృథా చేశాడు. అతను ఈ విషయాన్ని గ్రహించి దేవుడికి క్షమాపణలు చెప్పాలి. నాకు, నా పిల్లలకు చెడు చేసినవారిని నేను క్షమిస్తాను. అంతర్జాతీయ క్రికెట్లో మళ్లీ రాణించడం కోసం యువీ ఎంతో కష్టపడ్డాడు. యువీ కోసం ఎప్పుడూ దేవుణ్ని ప్రార్థిస్తుంటా. యువీకి నిత్యం అండగా ఉంటున్న నా కోడలు హజెల్ కీచ్‌కు అభినందనలు. యువీ, హజెల్ ఎప్పుడూ ఇలాగే కలసి ఉండాలని ఆశిస్తున్నా’ అని యోగ్రాజ్ అన్నాడు. కటక్ వన్డేలో యువీ, ధోనీ సూపర్ సెంచరీలతో విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే. -
ధోనీపై యువరాజ్ తండ్రి సంచలన ఆరోపణ
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ మంచి స్నేహితులు అయ్యారని కథనాలు వెలువడుతుండగా ఎంఎస్ ధోనీపై యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కెప్టెన్ ధోనీ కాదు కాబట్టే తన కుమారుడు యువరాజ్ సింగ్ మళ్లీ టీమిండియా వన్డే జట్టులోకి వచ్చాడని అన్నారు. బుధవారం సాయంత్రం మహారాష్ట్ర టైమ్స్‌తో మాట్లాడిన ఆయన ఇలాంటిది రెండేళ్ల కిందటే జరగాల్సిందని, కానీ తాజాగా జరిగిందని చెప్పారు. చదవండి..(ధోనీ, యువరాజ్ ఫ్రెండ్స్ అయ్యారా..!) తనను టీంకు ఎంపిక చేసినా చేయకపోయినా యువరాజ్ సింగ్ మాత్రం ఎప్పుడూ తన అసంతృప్తిని ధోనీపై వెళ్లగక్కలేదు. పరోక్షంగా చేసినా అది అంటిముట్టనట్లుగా అరుదుగా ఏదో ఒక కామెంట్ చేసేవాడు. అది కాకుండా ధోనీ నాయకత్వాన్ని ఎక్కువసార్లు యువరాజ్ పొగిడిన సందర్భాలే ఎక్కువ. కానీ, యువరాజ్ తండ్రి యోగరాజ్ మాత్రం ధోనీ విషయంలో కాస్తంత దూకుడుగానే విమర్శలు చేసేవారు. టీమిండియా జట్టు ఎంపిక సమయంలో తన కుమారుడు యువరాజ్ పట్ల ధోనీ ప్రవర్తన సరిగా ఉండదని యోగరాజ్ ఆరోపించేవారు. ఏదో ఒక కామెంట్‌తో వార్తల్లో నిలిచేవారు. తాజాగా నేరుగా ధోనీపై ఇలాంటి ఆరోపణ చేసి ఆయన మరోసారి అందరిని అవాక్కయ్యేలా చేశారు. గతవారమే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్ బాధ్యతలు వహిస్తున్న కోహ్లీనే ఇక నుంచి మూడు ఫార్మాట్లకు నాయకత్వం వహించనున్నాడు. -
యువరాజ్ తండ్రి చెప్పిన షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ షాకింగ్ న్యూస్ చెప్పారు. నవంబర్ 30న పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారాలో జరగనున్న యువరాజ్ వివాహానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సంప్రదాయ బద్ధంగా జరుగుతున్న తన కుమారుడు యువరాజ్ సింగ్ పెళ్లికి రానని యువరాజ్ తల్లికి ముందే చెప్పానని వివరించారు. ఇది తన దురదృష్టమనీ యోగరాజ్ వ్యాఖ్యానించారు. తనకు దేవుడి మీద భక్తి ఉన్నప్పటికీ, మత గురువుల మీద నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు. అందుకే వెళ్లడం లేదని విధి అలావుందని చెప్పారు. కానీ, యువరాజ్ కోరిక మేరకు నవంబరు 29 న హోటల్ లలిత్ వద్ద జరిగే మెహిందీ ఫంక్షన్ కు హాజరవుతానని చెప్పారు. అయితే యువరాజ్ కాబోయే భార్య హాజెల్ ను మాత్రం ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె దేవతలాంటిదన్నారు. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగినా సంప్రదాయ విలువలకు, పద్ధతులకు ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. తమ ఆమె కుటుంబంలో సానుకూల మార్పులు తీసుకొస్తుందని నమ్ముతున్నానన్నారు. ఇతర సోదరీ మణులును ఒక చోటుకి చేరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే యువరాజ్ , హాజెల్ దంపతులు కుటుంబంలోని మిగిలిన పిల్లలకు తల్లిదండ్రుల్లా వ్యవహరించాలని కోరుకుంటున్నానంటూ ముగించారు. అందరూ చట్టబద్ధ వివాహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విలాసవంతమైన వివాహాలకు స్వస్తి పలకాలని సూచించారు. పెళ్లళ్లలో కోట్లాది రూపాయల వృధా ఖర్చులకు అందరూ దూరంగా ఉండాలని యోగరాజ్ సింగ్ కోరారు. కాగా టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువీ, బాలీవుడ్ నటి హజెల్ కీచ్‌ను ఈ నెలాఖరున వివాహం చేసుకోబోతున్నాడు. యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్, తండ్రి యోగరాజ్ కొన్ని సంవత్సరాల క్రితమే విడిపోయారు. తల్లి దగ్గరే యువరాజ్ పెరిగిన సంగతి తెలిసిందే. -
'రావణుడిలాగే ధోనీ మూల్యం చెల్లిస్తాడు'
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్.. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ధోనీ దురంహకారని విమర్శించారు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో యువరాజ్‌కు భారత జట్టులో చోటు దక్కని సంగతి తెలిసిందే. యువీకి స్థానం దక్కకపోవడానికి ధోనీయే కారణమని ఆరోపించిన యోగరాజ్ మరోసారి ధోనీపై మండిపడ్డారు. 'ధోనీ చేసిందేమీ లేదు. మీడియా వల్లే ధోనీ క్రికెట్ దేవుడయ్యాడు. మీడియా ధోనీని గొప్పగా చిత్రీకరించింది. ఇందుకు అతను అనర్హుడు' అని యోగ్రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యోగ్రాజ్.. ధోనీని రావణుడితో పోల్చారు. 'ధోనీ దురహంకారి. ఇలాగే అహంకారంతో విర్రవీగిన రావణుడి కథ ముగిసింది. ధోనీ కూడా ఏదో ఒక రోజు మూల్యం చెల్లిస్తాడు. రావణుడి కంటే గొప్పవాడని ధోనీ భావిస్తున్నాడు. 2011 ప్రపంచ కప్‌లో ధోనీ యువరాజ్‌ను ఆపి బ్యాటింగ్‌కు వెళ్లి హీరో అయ్యాడు. 2015 ప్రపంచ కప్ సెమీస్‌లో ధోనీ నాలుగో స్థానంలో ఎందుకు బ్యాటింగ్‌కు దిగలేదు' అని యోగరాజ్ విమర్శించారు. -
ధోని వల్లే యువీకి చోటు దక్కలేదు
యోగ్రాజ్ సింగ్ ఆరోపణ న్యూఢిల్లీ: యువరాజ్ సింగ్‌కు భారత ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కకపోవడానికి కెప్టెన్ ధోనియే కారణమని... యువీ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ ఆరోపించారు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో యువీకి రికార్డు స్థాయిలో రూ.16 కోట్లు పలికిన అనంతరం ఆయన తన మనసులోని మాటను వెళ్లగక్కారు. ‘ప్రపంచకప్ జట్టులో యువీ లేడనే విషయం తెలిసి నేను షాక్‌కు గురయ్యాను. యువీ అవసరం జట్టుకు లేదని సెలక్టర్లకు ధోని చెప్పాడు. ఒకవేళ ధోనికి మా అబ్బాయితో వ్యక్తిగత విరోధముంటే నేనేమీ చేయలేను. భగవంతుడే తగిన న్యాయం చేస్తాడు. తాత్కాలికంగా కష్టకాలంలో ఉన్న సీనియర్లను అతడు ప్రోత్సహించాలి. గత 15 ఏళ్లుగా జట్టుకోసం యువీ ఎంతో కష్టపడ్డాడు. భారత్‌కు 90 శాతం విజయాలు అందించాడు. ఓవైపు క్యాన్సర్‌తో బాధపడుతున్నా దేశానికి 28 ఏళ్ల అనంతరం ప్రపంచకప్‌ను అందించాడు. ఒకవేళ తాను ఈ వ్యాధితో మరణించినా దేశం కోసం ఆడాలనే తపన చెరిగిపోదని అన్నాడు. అందుకే ఏమైనా సరే అని టోర్నీలో ఆడాడు. అలాంటి ఆటగాడికి ఇప్పుడిలాంటి సత్కారం జరిగింది’ అని యోగ్రాజ్ ఆవేదనగా అన్నారు. తల్లిదండ్రులకు హితవు మరోవైపు ఈ విషయంలో కెప్టెన్ ధోనికి, అతడి తల్లిదండ్రులకు కూడా యోగ్రాజ్ హితవు చెప్పారు. ‘ధోనికి నేనో సంగతి చెబుదామనుకుంటున్నాను. నిజమైన విద్య, విలువలు అనేవి తోటి దేశస్థుడు కిందపడితే సహాయం చేయాలనే జ్ఞానాన్ని బోధిస్తాయి. అతడు నడవగలిగే పరిస్థితి లేకపోతే తన భుజాల మీద ఎత్తుకుని ముందుకు తీసుకెళ్లాలి. అలాగే ధోని తల్లిదండ్రులకు కూడా ఓ విషయం చెప్పదలుచుకున్నాను. రేపు యువరాజ్, ధోని ఆడకపోవచ్చు. కానీ అతడు యువీకి ఎలాంటి నష్టం చేశాడో జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను, యువీ... ధోనికి శత్రువులం కాదు. దేవుడే తగిన శాస్తి చేస్తాడు’ అని యోగ్రాజ్ తీవ్రంగా స్పందించారు. తోసిపుచ్చిన యువీ అయితే ఈ వివాదానికి యువరాజ్ సింగ్ ముగింపు పలికే ప్రయత్నం చేశాడు. ‘అందరి తల్లిదండ్రుల్లాగే మా నాన్న కూడా నన్ను ప్రపంచకప్ జట్టులో చూడాలనుకున్నారు. ధోని కెప్టెన్సీలో ఆడటాన్ని నేను ఆస్వాదించాను. భవిష్యత్‌లో కూడా ఇది కొనసాగుతుంది’ అని యువీ ట్వీట్ చేశాడు. -
క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి అరెస్ట్!
చంఢీఘడ్: మాజీ టెస్ట్ క్రికెటర్, భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. చండీఘడ్ సమీపంలోని పంచకులలో గొడవ దిగిన యోగరాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. యోగరాజ్ తోపాటు మరో వ్యక్తిని కూడ ఈ ఘటనలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పంచకులలోని సెక్టర్ 2లో ఆదివారం రాత్రి జన్మదిన వేడుకలకు యోగరాజ్ సింగ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వేడుకలు ముగిసిన తర్వాత తిరిగి వెళుతుండగా కారు పార్కింగ్ వద్ద ఓ రిటైర్డ్ డీఎస్పీ కుమారుడికి యోగరాజ్ సింగ్ కు గొడవ జరిగింది. ఈ గొడవలో మాజీ డీఎస్పీ కుమారుడిపై దాడి చేసినట్టు ఫిర్యాదు అందిందని పంచకుల డీసీపీ రాహుల్ శర్మ తెలిపారు. బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు యోగరాజ్ సింగ్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. -
యువరాజ్ తండ్రికి కూడా క్యాన్సర్
కష్టాలు సిక్సర్ ధీరుడు యువరాజ్ ను వదలడం లేదు. ప్రాణాంతక క్యాన్సర్ ను జయించిన యువరాజ్ సింగ్ కి ఇప్పుడు మరో షాక్ ఎదురైంది. ఆయన తండ్రి, మాజీ టెస్ట్ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్ కి క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. ఆయన గొంతు క్యాన్సర్ ఉన్నట్టు తేలడంతో ఆయన ప్రస్తుతం అమెరికాలో గొంతు క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు. యోగ్ రాజ్ సింగ్ తనకు క్యాన్సర్ ఉన్న విషయాన్ని భార్య సత్వీర్ కౌర్ కి చెప్పలేదు. చివరికి పరీక్షల్లో అది బయటపడింది. అయితే ఆయన యువరాజ్ చికిత్స పొందిన ఆస్పత్రికి పోకుండా వేరే ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయన గొంతు నుంచి ఒక కణితిని తీసేశారు. ప్రస్తుతం మాట్లాడకుండా ఉండమని డాక్టర్లు సలహా ఇచ్చారు. యువరాజ్ యోగరాజ్ మొదటి భార్య షబ్నమ్ కౌర్ ద్వారా జన్మించారు. ఆ తరువాత యోగ్ రాజ్, షబ్నమ్ లు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత యోగరాజ్ సత్వీర్ కౌర్ ను పెళ్లాడారు.