టీమిండియా దిగ్గజ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనిలపై మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కపిల్ వల్ల తన కెరీర్ సజావుగా సాగలేదన్న యోగ్‌రాజ్.. తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్‌ను ధోని నాశనం చేశాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో యువీ గతంలో తన తండ్రి యోగ్‌రాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
‘‘మా నాన్నకు మానసిక సమస్యలు ఉన్నాయి. కానీ ఆయన ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అదే ఆయనకున్న అతి పెద్ద సమస్య. ఇది ఆయనకు తెలిసినా మారేందుకు సిద్ధంగా లేరు’’ అంటూ యువరాజ్ సింగ్ గతేడాది నవంబరులో రణ్‌వీర్ అల్హాబ్దియా పాడ్‌కాస్ట్‌లో యోగ్‌రాజ్ గురించి చెప్పుకొచ్చాడు.
ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా.. ధోని అభిమానులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ధోని వంటి టాప్ క్రికెటర్‌ను టార్గెట్ చేయడం ద్వారా యోగ్‌రాజ్ వార్తల్లో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నాడని.. అయితే, ఇప్పుడు ఇలాంటి చవకబారు మాటలను ఎవరూ పట్టించుకోరని కామెంట్లు చేస్తున్నారు. యువీ తన తండ్రి గురించి చెప్పింది వందకు వంద శాతం నిజమని పేర్కొంటున్నారు. యోగ్‌రాజ్ ఇలాగే మాట్లాడితే యువరాజ్‌కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని.. ఇకనైనా ఆయన తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
కాగా టీమిండియా తరఫున 1980-81 మధ్య కాలంలో ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడాడు యోగ్‌రాజ్. అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ వల్లే తనకు అవకాశాలు కరువయ్యాయని గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్న అతడు.. తన కుమారుడిని విజయవంతమైన క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని భావించాడు. తండ్రి ఆశయాలకు తగ్గట్లుగానే మేటి ఆల్‌రౌండర్‌గా ఎదిగిన యువీ.. క్యాన్సర్‌ను జయించి మరీ ఆటను కొనసాగించాడు.
అయితే, 2015 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యువీకి ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లాయి. ఫలితంగా 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే నాడు ధోని కెప్టెన్‌గా ఉండటం గమనార్హం. అంతేకాదు.. యువీ-ధోని అండర్-19 క్రికెట్‌లోనూ సమకాలీకులే. ఇద్దరు ప్రతిభావంతులే అయినా ధోని తన అసాధారణ నైపుణ్యాలతో కెప్టెన్‌గా ఎదిగాడు.
ఈ నేపథ్యంలో ధోని గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘నేను ధోనిని ఎన్నటికీ క్షమించను. ఒకసారి అతడు అద్దంలో తన ముఖం చూసుకోవాలి. అతడొక పెద్ద క్రికెటరే కావొచ్చు. కానీ నా కుమారుడి విషయంలో అతడేం చేశాడు? నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడు. అతడు కనీసం మరో నాలుగేళ్లపాటు ఆడేవాడు.
కానీ ధోని వల్లే ఇదంతా జరిగింది. యువరాజ్ వంటి కొడుకును ప్రతి ఒక్కరు కనాలి’’ అని యోగ్‌రాజ్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా కపిల్ దేవ్ గురించి ప్రస్తావిస్తూ.. కపిల్ కంటే తన కొడుకు యువీనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అని చెప్పుకొచ్చాడు. అయితే, యువీ ఇంత వరకు తన తండ్రి వ్యాఖ్యలపై స్పందించలేదు.
My Father has mental issues : Yuvraj #MSDhoni pic.twitter.com/KpSSd4vDzA
— Chakri Dhoni (@ChakriDhonii) September 2, 2024
Comments
Please login to add a commentAdd a comment