యువరాజ్ తండ్రి చెప్పిన షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ షాకింగ్ న్యూస్ చెప్పారు. నవంబర్ 30న పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారాలో జరగనున్న యువరాజ్ వివాహానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సంప్రదాయ బద్ధంగా జరుగుతున్న తన కుమారుడు యువరాజ్ సింగ్ పెళ్లికి రానని యువరాజ్ తల్లికి ముందే చెప్పానని వివరించారు. ఇది తన దురదృష్టమనీ యోగరాజ్ వ్యాఖ్యానించారు. తనకు దేవుడి మీద భక్తి ఉన్నప్పటికీ, మత గురువుల మీద నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు. అందుకే వెళ్లడం లేదని విధి అలావుందని చెప్పారు. కానీ, యువరాజ్ కోరిక మేరకు నవంబరు 29 న హోటల్ లలిత్ వద్ద జరిగే మెహిందీ ఫంక్షన్ కు హాజరవుతానని చెప్పారు.
అయితే యువరాజ్ కాబోయే భార్య హాజెల్ ను మాత్రం ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె దేవతలాంటిదన్నారు. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగినా సంప్రదాయ విలువలకు, పద్ధతులకు ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. తమ ఆమె కుటుంబంలో సానుకూల మార్పులు తీసుకొస్తుందని నమ్ముతున్నానన్నారు. ఇతర సోదరీ మణులును ఒక చోటుకి చేరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే యువరాజ్ , హాజెల్ దంపతులు కుటుంబంలోని మిగిలిన పిల్లలకు తల్లిదండ్రుల్లా వ్యవహరించాలని కోరుకుంటున్నానంటూ ముగించారు. అందరూ చట్టబద్ధ వివాహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విలాసవంతమైన వివాహాలకు స్వస్తి పలకాలని సూచించారు. పెళ్లళ్లలో కోట్లాది రూపాయల వృధా ఖర్చులకు అందరూ దూరంగా ఉండాలని యోగరాజ్ సింగ్ కోరారు.
కాగా టీమిండియా డాషింగ్ ఆల్రౌండర్ యువీ, బాలీవుడ్ నటి హజెల్ కీచ్ను ఈ నెలాఖరున వివాహం చేసుకోబోతున్నాడు. యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్, తండ్రి యోగరాజ్ కొన్ని సంవత్సరాల క్రితమే విడిపోయారు. తల్లి దగ్గరే యువరాజ్ పెరిగిన సంగతి తెలిసిందే.