ధోని వల్లే యువీకి చోటు దక్కలేదు
యోగ్‌రాజ్ సింగ్ ఆరోపణ
న్యూఢిల్లీ: యువరాజ్ సింగ్‌కు భారత ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కకపోవడానికి కెప్టెన్ ధోనియే కారణమని... యువీ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ ఆరోపించారు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో యువీకి రికార్డు స్థాయిలో రూ.16 కోట్లు పలికిన అనంతరం ఆయన తన మనసులోని మాటను వెళ్లగక్కారు. ‘ప్రపంచకప్ జట్టులో యువీ లేడనే విషయం తెలిసి నేను షాక్‌కు గురయ్యాను. యువీ అవసరం జట్టుకు లేదని సెలక్టర్లకు ధోని చెప్పాడు.
ఒకవేళ ధోనికి మా అబ్బాయితో వ్యక్తిగత విరోధముంటే నేనేమీ చేయలేను. భగవంతుడే తగిన న్యాయం చేస్తాడు. తాత్కాలికంగా కష్టకాలంలో ఉన్న సీనియర్లను అతడు ప్రోత్సహించాలి. గత 15 ఏళ్లుగా జట్టుకోసం యువీ ఎంతో కష్టపడ్డాడు. భారత్‌కు 90 శాతం విజయాలు అందించాడు. ఓవైపు క్యాన్సర్‌తో బాధపడుతున్నా దేశానికి 28 ఏళ్ల అనంతరం ప్రపంచకప్‌ను అందించాడు. ఒకవేళ తాను ఈ వ్యాధితో మరణించినా దేశం కోసం ఆడాలనే తపన చెరిగిపోదని అన్నాడు. అందుకే ఏమైనా సరే అని టోర్నీలో ఆడాడు. అలాంటి ఆటగాడికి ఇప్పుడిలాంటి సత్కారం జరిగింది’ అని యోగ్‌రాజ్ ఆవేదనగా అన్నారు.
తల్లిదండ్రులకు హితవు
మరోవైపు ఈ విషయంలో కెప్టెన్ ధోనికి, అతడి తల్లిదండ్రులకు కూడా యోగ్‌రాజ్ హితవు చెప్పారు. ‘ధోనికి నేనో సంగతి చెబుదామనుకుంటున్నాను. నిజమైన విద్య, విలువలు అనేవి తోటి దేశస్థుడు కిందపడితే సహాయం చేయాలనే జ్ఞానాన్ని బోధిస్తాయి. అతడు నడవగలిగే పరిస్థితి లేకపోతే తన భుజాల మీద ఎత్తుకుని ముందుకు తీసుకెళ్లాలి. అలాగే ధోని తల్లిదండ్రులకు కూడా ఓ విషయం చెప్పదలుచుకున్నాను. రేపు యువరాజ్, ధోని ఆడకపోవచ్చు. కానీ అతడు యువీకి ఎలాంటి నష్టం చేశాడో జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను, యువీ... ధోనికి శత్రువులం కాదు. దేవుడే తగిన శాస్తి చేస్తాడు’ అని యోగ్‌రాజ్ తీవ్రంగా స్పందించారు.
తోసిపుచ్చిన యువీ
అయితే ఈ వివాదానికి యువరాజ్ సింగ్ ముగింపు పలికే ప్రయత్నం చేశాడు. ‘అందరి తల్లిదండ్రుల్లాగే మా నాన్న కూడా నన్ను ప్రపంచకప్ జట్టులో చూడాలనుకున్నారు. ధోని కెప్టెన్సీలో ఆడటాన్ని నేను ఆస్వాదించాను. భవిష్యత్‌లో కూడా ఇది కొనసాగుతుంది’ అని యువీ ట్వీట్ చేశాడు.