cricket-world cup-2015
-
సెమీస్ లో న్యూజిలాండ్
-
ఐసీసీ అధ్యక్షుడి రాజీనామా
ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం ఉదయం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు అద్భుతమైన ఫామ్‌ను కనబరిచి క్వార్టర్స్ వరకు వెళ్లింది. అయితే క్వార్టర్స్‌లో టీమిండియా చేతిలో చిత్తయిన విషయం తెలిసిందే. ఐదోసారి విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కు వరల్డ్ కప్ ట్రోఫీని ఎవరు ఇవ్వాలన్న విషయంలో వివాదం రేగింది. తనను కనీసం ఆహ్వానించకపోవడంతో కమల్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఐసీసీ రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించారని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని, ఇందులో రెండో ఆలోచనకు తావులేదని ఆయన మీడియాకు స్పష్టం చేశారు. ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ కు, ముస్తాఫా కమల్ కు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. మెల్ బోర్న్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసన్ తానే స్వయంగా ట్రోఫీని ఆస్ట్రేలియా కెప్టెన్ కు అందించారు. భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో అంపైరింగ్ లోపాల వల్లే బంగ్లా ఓడిందన్న వ్యాఖ్యలు కూడా కమల్ చేసినట్లు వినవచ్చింది. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసన్.. నిబంధనలను తోసిరాజని.. ట్రోఫీని అందించే కార్యక్రమానికి తానే వెళ్లారు. ఇదే ముస్తఫా కమల్ మనస్తాపానికి కారణమైందని చెబుతున్నారు. -
వెటోరి బాటలో మరో బౌలర్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పేస్ బౌలర్ కైల్ మిల్స్ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం ప్రకటించారు. ప్రపంచకప్ ముగిసిన రోజునే కివీస్ ఆల్ రౌండర్ డానియల్ వెటోరి క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పేసర్ అదే బాట పడ్డారు. మిల్స్ టాప్ - 10 వన్డే బౌలర్ల జాబితాలో.. నెంబర్ వన్ ర్యాంకులో చాలాకాలం పాటు కొనసాగారు. 'క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. నా 36 ఏళ్ల జీవితంలో 14 ఏళ్ల పాటు క్రికెట్లోనే ఉన్నాను. ఇన్నాళ్లు క్రికెట్ జీవితాన్ని గడిపిన నాకు సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నాననే అనిపిస్తోంది. ఇకనుంచి ఎక్కువ సమయాన్ని నా కుటుంబ సభ్యులతో ఉండటానికి కేటాయిస్తాను' అని మిల్స్ అన్నారు. మిల్స్ న్యూజిలాండ్ జట్టులో 170 వన్డేలు ఆడి 240 వికెట్లు పడగొట్టాడు. మూడు ప్రపంచకప్ టోర్నీల్లో ఆడాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో వెటోరి (297) తర్వాత స్థానం మిల్స్దే. కెరీర్లో 42 టీ20లు, 19 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. టెస్టు కెరీర్లో 13 ఓవర్లలో 4/16, వన్డే కెరీర్లో 5/25 మిల్స్ బౌలింగ్‌లోని అత్యుత్తమ గణాంకాలు. ఇంగ్లండ్‌తో 2008లో హామిల్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో మిల్స్ ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్, కెవిన్ పీటర్సన్, మైకేల్ వాన్, ఆండ్రూ స్ట్రాస్‌లను పెవిలియన్‌కు పంపించి జట్టుకు ఘన విజయాన్ని అందించడంలో మిల్స్ ప్రతిభ చిరకాలం గుర్తుండి పోతుంది. -
వాళ్లు కప్ గెలిచారు... వీళ్లు మనసులు గెలిచారు!
ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడి క్రికెట్ ప్రపంచకప్ గెలిచింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆటకు సంబంధించి వాళ్లకు ఫుల్ మార్కులు ఇచ్చేశాం. కానీ వాళ్ల ప్రవర్తన సంగతేంటి? ఫైనల్లో కంగారూల వెకిలి ప్రవర్తన ఇప్పుడు వాళ్ల దేశంలోనే చర్చగా మారింది. ఫైనల్లో మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో గప్టిల్ అవుట్ కాగానే హాడిన్ బ్యాట్స్‌మన్ మొహం మీదే గ్లౌవ్స్‌తో చప్పట్లు కొట్టాడు. ఆ తర్వాత వెటోరి, ఇలియట్ అవుటైన సందర్భాల్లో ఆస్ట్రేలియన్లు నోరు అదుపు చేసుకోలేకపోయారు. ఈ ఇద్దరిని దారుణంగా తిట్టారట. ఇలాంటి సంఘటనలు ప్రపంచకప్‌లో జరగకుండా చూస్తామని ఐసీసీ మాట ఇచ్చింది. కానీ ఆస్ట్రేలియన్లకు ఇది పట్టలేదు. అయినా ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు... ఆసీస్ ప్రపంచకప్ గెలిచిందనా? గెలిచిన వాళ్లకు శిక్ష ఉండకూడదనా? ఈ విషయంలో క్లార్క్ తెలివిగా వ్యవహరించానని అనుకుంటున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే... ‘నేను చూడలేదు’, ‘లైన్ క్రాస్ చేయలేదు’, ‘ఆస్ట్రేలియన్లు క్రికెట్ ఆడే విధానం’ అనే పాత మాటలనే వల్లె వేశాడు. ఒక పెద్ద మ్యాచ్‌లో తమ ప్రవర్తనతో ప్రత్యర్థి దేశ మద్దతుదారులను ఎంత గాయపరుస్తున్నామో ఆస్ట్రేలియా క్రికెటర్లు అర్థం చేసుకోలేకపోయారు. కేవలం తాము మాత్రమే దేశం కోసం ఆడతామని ఆస్ట్రేలియన్లు భావిస్తున్నట్లున్నారు. ప్రత్యర్థి క్రికెటర్లు కూడా ఓ దేశం కోసమే ఆడుతున్నారని, వాళ్లని గౌరవించాలని ఎందుకు అనుకోలేదో అర్థం కాలేదు. ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ కంటే తపనతో ఆడిన జట్టు లేదు. కానీ వాళ్ల ఆటలో ఎక్కడా ఈ ‘రోత’ లేదు. దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో గెలిచాక మెకల్లమ్ ఓ మాట అన్నాడు. ‘తిట్టడం మా ఆటలో ఎప్పుడూ భాగం కాదు. దాని మీద ఎప్పుడూ దృష్టిపెట్టం కూడా’ అని చెప్పాడు. ఆ సెమీఫైనల్లో ఇలియట్ సిక్సర్ కొట్టగానే దక్షిణాఫ్రికా గుండె పగిలింది. స్టెయిన్ నేల మీద పడుకుండిపోయాడు. ఇలియట్ వచ్చి స్టెయిన్‌ను పైకి లేపి ఓదార్చిన తర్వాతే సహచరుల దగ్గరకు సంబరాలకు వెళ్లాడు. ఫైనల్లో క్లార్క్ అవుటయ్యే సమయానికి న్యూజిలాండ్ మ్యాచ్ దాదాపుగా ఓడిపోయింది. ఆ సమయంలోనూ నలుగురు న్యూజిలాండ్ క్రికెటర్లు క్లార్క్ దగ్గరకు వచ్చి అభినందించి వెళ్లారు. 18 ఏళ్ల పాటు న్యూజిలాండ్ క్రికెట్‌కు సేవలు అందించిన వెటోరిని ఏ ఒక్క ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా అభినందించాడా? లేదు. నిజానికి దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ గెలిచిన మ్యాచ్‌లో అక్కడ కివీస్ బదులు ఆసీస్ ఆటగాళ్లు ఉండి ఉంటే... ఇలియట్ తరహాలో ఎవరైనా ప్రత్యర్థిని ఓదార్చేవారా? కచ్చితంగా లేదు. ఆస్ట్రేలియన్ల మనస్తత్వం అది కాదు. న్యూజిలాండ్ ఆటగాళ్లు చాలా మృదుస్వభావులు. ఇదే ప్రపంచకప్‌లో ఆక్లాండ్‌లో లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆ సమయంలో కివీ ఆటగాళ్లు తమ సహజ శైలిలో ప్రత్యర్థి బాగా ఆడినందుకు అభినందించారు. కానీ దీనిని కంగారూలు జీర్ణించుకోలేకపోయారట. ‘ఆ మ్యాచ్‌లో మేం ఓడిపోయాక వాళ్లు చూపించిన మంచితనం మమ్మల్ని హర్ట్ చేసింది. ఫైనల్లో గెలిచినా వాళ్లు అంతే పొందికగా వచ్చి మమ్మల్ని అభినందిస్తారు. దానిని తట్టుకోవడం మా వల్ల కాదు. అందుకే ఫైనల్‌కు ముందు టీమ్ మీటింగ్‌లో నేను ఓ విషయం స్పష్టం చేశా. ‘మనం వాళ్లపై ఎంత దారుణంగా మాటల యుద్ధం చేస్తే అంత మంచిది’ అని సూచించా’ అని కప్ గెలిచాక హాడిన్ చెప్పడం ఆస్ట్రేలియన్ల మనస్తత్వాన్ని సూచిస్తోంది. ఫైనల్లో మెకల్లమ్ స్ట్రయికింగ్‌కు రాగానే హాడిన్ వచ్చి తిట్టి వెళ్లాడు. ఫైనల్ ముగిశాక మీడియా సమావేశంలో మెకల్లమ్‌ను... మీరు రిటైర్ అవుతున్నారా? అని మీడియా ప్రశ్నించింది. దీనికి మెకల్లమ్ చెప్పిన సమాధానం... ‘ఈ రోజు ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడి కప్ గెలిచింది. ప్రతి దేశంలో ఇదే హెడ్లైన్ కావాలి. నా రిటైర్మెంట్ లాంటి వార్త గురించి ఈ సందర్భంలో రాయడం అనవసరం. దయచేసి ఇది రెండు రోజుల తర్వాత మాట్లాడుకుందాం’ అని చెప్పాడు. ఆస్ట్రేలియా కప్ గెలిచి ఉండొచ్చు. కానీ న్యూజిలాండ్ తమ ప్రవర్తనతో అభిమానుల మనసులు గెలిచింది. - సాక్షి క్రీడావిభాగం -
వరల్డ్ కప్ హీరోలకు షాక్
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గట్టి షాక్ ఇచ్చింది. ఫైనల్లో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గెలుకున్న ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్, విధ్వంసకర ఇన్నింగ్స్ లో సెంచరీ బాదిన మ్యాక్స్ వెల్ ను జట్టు నుంచి సాగనంపింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటన కోసం 17 మంది ఆటగాళ్లతో ఎంపిక చేసిన టీమ్ లో వీరికి చోటు ఇవ్వలేదు. తాజాగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఫాల్కనర్ 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక మ్యాక్స్ వెల్ శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్ లో 51 బంతుల్లో సెంచరీ కొట్టి ప్రపంచకప్ లో రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన లెగ్ స్పిన్నర్ ఫవద్ అహ్మద్, బ్యాట్స్ మన్ ఆడమ్ వొగ్స్, వికెట్ కీపర్ పీటర్ నెవిల్ ను జట్టులోకి తీసుకున్నారు. గాయం కారణంగా జేమ్స్ పాటిస్సన్ ను ఎంపిక చేయలేదు. జూన్ 5 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టెస్టులు ఆడుతుంది. జూలై 8 నుంచి ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. రియాన్ హారిస్ ను ఒక్క యాషెస్ సిరిస్ కే ఎంపిక చేశారు. -
చిరకాలం... మదిలో మెదిలేలా...
ప్రపంచకప్-2015 జ్ఞాపకాలు నాలుగేళ్ల క్రితం ముంబై వాంఖడే మైదానంలో ఆఖరి బంతికి ధోని కొట్టిన సిక్సర్ ప్రతీ భారత అభిమాని గుండెల్లో నిలిచిపోయింది. కొన్ని వందల సార్లు టీవీల్లో, ఇంటర్నెట్లో, వార్తా చర్చల్లో ఎక్కడ అది కనిపించినా మన మనసు ఆనందంతో ఉప్పొంగేది. ఈసారి టోర్నీలో మన ‘హెలికాప్టర్’ అనుకున్నంత ఎత్తుకు ఎగరలేదు. అయితే గప్టిల్, గేల్ ‘డబుల్’ మోతల నుంచి స్టార్క్, సౌతీ వికెట్ల పండగ వరకు... తొలి మ్యాచ్‌ను గెలిచిన అఫ్ఘన్ల సంబరం... ఎదురులేని శతకాల సంగక్కర వరకు... వహ్వా అనిపించుకున్న వహాబ్ నుంచి ఇలియట్ సిక్సర్ వరకు... ఇలా 2015 ప్రపంచకప్ ఎన్నో జ్ఞాపకాలను పంచింది. విజేతలు, పరాజితులు ఎవరైనా కొన్ని క్షణాలు మాత్రం సగటు క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా ప్రపంచ కప్ అనగానే మదిలో మెదిలే కొన్ని అపురూప ఘట్టాలను గుర్తు చేసుకుంటే... డబుల్ ‘డబుల్’ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రపంచకప్ రెండు వ్యక్తిగత డబుల్ సెంచరీలను చూసే అవకాశం కల్పించింది. ముందుగా క్రిస్ గేల్ జింబాబ్వేపై చెలరేగితే, ఆ తర్వాత గప్టిల్, అదే విండీస్‌ను చావబాదాడు. విధ్వంసక ఆటగాడు గేల్ విశ్వరూపం ఎవరినీ ఆశ్చర్యపరచకపోయినా, గప్టిల్ మాత్రం తన డబుల్‌తో అందరికీ షాక్ ఇచ్చాడు. 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో గేల్ 215 పరుగులు చేయగా... 163 బంతుల్లో 24 ఫోర్లు, 11 సిక్సర్లతో 237 పరుగులు చేసి గప్టిల్ నాటౌట్‌గా నిలిచాడు. సూపర్ బౌలింగ్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కివీస్ బౌలర్ టిమ్ సౌతీ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. 33 పరుగులకే 7 వికెట్లు పడగొట్టిన సౌతీ, ఈ క్రమంలో కివీస్ తరఫున పలు కొత్త రికార్డులు నమోదు చేశాడు. ఇక కివీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగాడు. కేవలం 152 పరుగుల లక్ష్యంతో ఆడుతున్న కివీస్‌ను అతని బౌలింగ్ బెంబేలెత్తించింది. ఆసీస్ ఒక వికెట్‌తో మ్యాచ్ ఓడినా స్టార్క్ (6/28) సూపర్ బౌలింగ్ చిరస్మరణీయం. రియాజ్ x వాట్సన్ ఆసాంతం బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించిన ఈ ప్రపంచకప్‌లో ఒక బౌలర్, బ్యాట్స్‌మన్‌కు దడ పుట్టించడం ఏ అభిమానీ మరిచిపోలేడు. ప్రతీ బంతి దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో విసురుతూ నాలుగు ఓవర్ల పాటు పాకిస్తాన్ పేసర్ వహాబ్ రియాజ్, ఆసీస్‌ను అల్లాడించాడు. అర గంట పాటు సాగిన ఈ పోరులో వార్నర్, క్లార్క్ పెవిలియన్ చేరగా... వాట్సన్ బిత్తరపోయాడు. సగం బంతులు అతని శరీరాన్ని ఎక్కడో ఒక చోట తాకాయి. ఒక పేసర్ ముందు ఆసీస్ బ్యాట్స్‌మన్ ఇలా భీతిల్లడం అనూహ్యం. చివరకు వాట్సన్ ఎలాగో కోలుకున్నా... టోర్నీ మొత్తానికే ఇది హైలైట్ స్పెల్. శతకాల నాదం ప్రపంచకప్‌లో ఒక్క సెంచరీ చేస్తే చాలు చాలా మంది బ్యాట్స్‌మెన్ తమ జన్మ ధన్యమైనట్లుగా భావి స్తారు. కానీ ఒకటి కాదు రెండు కాదు వరుసగా 4 శతకాలు బాది ఔరా అనిపిం చాడు శ్రీలంక దిగ్గజం సంగక్కర. ఇది ప్రపంచకప్‌లోనే కాకుండా వన్డేల్లోనే కొత్త రికార్డు కావడం విశేషం. బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్లపై సంగ వరుసగా 105 నాటౌట్, 117 నాటౌట్, 104, 124 పరుగులు చేశాడు. లంక క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించినా సంగక్కర ఘనత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కన్నీటి సంద్రం ఆటలో గెలుపోటములు సహజమే అని వారు సరిపెట్టుకోలేదు. కన్నీళ్లను దాచుకుంటూ లేని గాంభీ ర్యాన్ని ప్రదర్శించి ‘హార్డ్ లక్’ అంటూ సర్దుకుపోలేదు. పరాజయం ఎంత బాధిస్తుందో దక్షిణాఫ్రికా క్రికెటర్లకు తప్ప మరొకరికి తెలీదు. న్యూజిలాండ్‌తో సెమీస్ మ్యాచ్ ఓడిన క్షణాన జట్టు మొత్తం విషాదంలో మునిగింది. తమ భావోద్వేగాలు నియంత్రించుకోకుండా అందరి ముందే సఫారీలు ఏడవటం ప్రత్యర్థులకు కూడా అయ్యో అనిపించింది. ముఖ్యంగా మోర్నీ మోర్కెల్ రోదనను ఏ క్రికెట్ అభిమాని కూడా మరచిపోలేడు. ఇలియట్ షాట్ సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు గ్రాంట్ ఇలియట్ కొట్టిన సిక్సర్ అపురూపం. ఈ టోర్నీ మొత్తానికి నిస్సందేహంగా ఇదే బెస్ట్ షాట్. ఆక్లాండ్ మైదానంలో 45 వేల మందితో హోరెత్తించిన ఈ షాట్, అటు దక్షిణాఫ్రికా గుండెలు ముక్కలు చేసిం ది. విజయానికి రెండు బంతుల్లో 5 పరుగులు కావాల్సిన దశలో స్టెయిన్ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని ఇలియట్ వైడ్ లాంగాన్ మీదుగా అద్భుతంగా ఆడాడు. ఏడేళ్ల కెరీర్లో ఎన్నడూ తనకంటూ గుర్తింపు తెచ్చుకోని ఇలియట్‌ను ఈ సిక్సర్ ఒక్కసారిగా హీరోను చేసింది. బంగ్లా భళా... ప్రతీ ప్రపంచకప్‌లో ఏదో ఒక సంచలన సాధించడం అలవాటుగా పెట్టుకున్న బంగ్లాదేశ్ ఈ సారి కూడా అదే చేసింది. మూడు సార్లు ఫైనలిస్ట్, క్రికెట్ పుట్టిల్లుగా చెప్పుకునే ఇంగ్లండ్ పుట్టి ముంచింది. లీగ్ మ్యాచ్‌లో 15 పరుగులతో ఇంగ్లండ్‌ను ఓడించి బంగ్లా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా ఇంగ్లండ్ అవమానకరంగా టోర్నీనుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. తాజా ఫలితంతో ఇంగ్లండ్‌కు అసలు వన్డే స్థాయి కానీ అర్హత లేదని అన్ని వైపులనుంచి విమర్శలు వచ్చాయి. మరో వైపు ఐర్లాండ్ కూడా వెస్టిండీస్‌పై విజయం సాధించినా, అది టోర్నీపై పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆనంద బాష్పాలు నిత్యం సమరాల నీడలో బతుకుతూ క్రికెట్లో తమ ముద్ర కోసం తపించిన అఫ్ఘానిస్థాన్ ఒక అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. ప్రపంచప్‌లో ఒక్క విజయం ఆటగాళ్లను, ఆ దేశాన్ని ఊపేసింది. స్కాట్లాండ్పై అఫ్ఘానిస్థాన్ ఒక వికెట్‌తో గెలిచిన క్షణాన అన్ని బాధలను మరచిపోయారు. అప్పుడు ప్రపంచమంతా అఫ్ఘని విజయాన్ని కాంక్షించిందనడం అతిశయోక్తి కాదు. 211 పరుగుల లక్ష్య ఛేదనలో 96 పరుగులతో సమీయుల్లా షెన్వారి చేసిన పోరాటం ఎవరూ మర్చిపోలేరు. మెకల్లమ్ ‘బౌల్డ్’ మైదానంలో దాదాపు లక్ష మంది ప్రేక్షకులు... ప్రపం చ కప్ ఫైనల్ మ్యాచ్... ఐదో బంతికే అద్భుతం జరిగింది. కివీస్ ఆశలను తుం చేస్తూ స్టార్క్ వేసిన ఆ బంతి మెకల్లమ్ స్టంప్స్‌ను గిరాటేసింది. తొలిసారి ఫైనల్ చేరి ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సమరానికి అక్కడే అడ్డుకట్ట పడింది. టోర్నీ ఆసాంతం స్ఫూర్తిదాయకంగా ఆడిన కివీస్ ప్రదర్శన గురించి ఎంత గొప్పగా చెప్పినా...ఆ వికెట్ మాత్రం సగటు అభిమానిని జీవితాంతం వెంటాడుతుంది. నేను కాదు మనం... డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సెమీస్‌లోనే ఓడినా... భారత జట్టు కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే కొన్ని తీపి జ్ఞాపకాలను మనకు అందించింది. ముఖ్యంగా వరుసగా ఏడు విజయాలు అభిమానులకు ఆనందాన్ని పంచాయి. పాక్‌పై అజేయ రికార్డు, దక్షిణాఫ్రికాపై తొలి విజయం, ధావన్ రెండు సెంచరీలు, రైనా, రోహిత్ శతకాలు, మన బౌలర్ల ప్రదర్శన, ఫీల్డింగ్ గుర్తుంచుకునేలా చేశాయి. ధోని సిక్సర్లాంటి క్షణాలు లేకున్నా విమర్శలు తావు లేని రీతిలో టీమిండియా సంతృప్తికర ప్రదర్శన కనబర్చింది. సరిగ్గా చెప్పాలంటే వ్యక్తిగతంగా చూస్తే ఏ ఒక్కరి ప్రదర్శనో టోర్నీలో హైలైట్ కాలేదు కానీ జట్టుగా మాత్రం అంతా సమష్టితత్వం కనిపించింది. -
ధోనితో గొంతు కలిపిన క్లార్క్
మెల్ బోర్న్: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ గళం కలిపాడు. వన్డేల్లో ప్రస్తుతమున్న 'నలుగురు ఫీల్డర్ల' నిబంధన మార్చాలన్న ధోని అభిప్రాయంతో క్లార్క్ ఏకీభవించాడు. అతడు కూడా ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు ఉంటే బాగుంటుందని, ఫలితంగా బౌలర్లకు మరింత మేలు జరుగుతుందని అన్నాడు. వన్డేలకు గుడ్ బై చెప్పిన క్లార్క్ చివరిసారిగా స్వదేశంలో ఆసీస్ జట్టుకు వరల్డ్ కప్ ఫైనల్లో నాయకత్వం వహించి టైటిల్ సాధించిపెట్టాడు. సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను ఉంచితే స్పిన్నర్లు మరింత రాణించే అవకాశముందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. 'నలుగురు ఫీల్డర్ల' నిబంధన మారిస్తే పరుగుల ప్రవాహం తగ్గుతుందని, బౌలర్లకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నాడు. ఈ నిబంధన మార్చాలని ధోని కూడా అభిప్రాయపడ్డాడు. -
450 సిక్సర్లు.. 2109 ఫోర్లు
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ కప్ 2015లో పరుగుల వర్షం పోటెత్తింది. అత్యధిక సెంచరీలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చిన ఈమెగా ఈవెంట్‌కు మరింత ఆకర్షణ తెచ్చేందుకు పిచ్‌లను బ్యాటింగ్‌కు అనుకూలించేలా రూపొందించారు. దీంతో ఫోర్లు, సిక్సర్లతో అభిమానులు తడిసి ముద్దయ్యారు. వన్డే ప్రపంచ కప్‌లో మొత్తం 21,614 పరుగులు చేశారు. బౌండరీల రూపంలో 11,136 పరుగులు వచ్చాయి. 450 సిక్సర్లు, 2109 ఫోర్లు నమోదయ్యాయి.38 సెంచరీలు, 107 హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ఇక ఈ ఈవెంట్లో 687 వికెట్లు పడగొట్టారు. ఇందులో 497 క్యాచ్‌ల రూపంలో అవుట్ చేశారు. మొత్తానికి వన్డే ప్రపంచ కప్‌లో బ్యాట్స్‌మెన్‌దే హవా. -
ప్రపంచ కప్ జట్టులో టీమిండియా అవుట్
వన్డే ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్లో నిష్ర్కమించిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఐసీసీ ప్రపంచ కప్ 2015 జట్టులో భారత క్రికెటర్లకు ఒక్కరికీ స్థానం దక్కలేదు. ఈ మెగా ఈవెంట్లో రాణించిన భారత బౌలర్లు ఉమేష్ యాదవ్ (18), షమీ (17), అశ్విన్ (13) పేర్లు చర్చకు వచ్చినా జట్టులోకి తీసుకోలేదు. జట్టులో ఎక్కువగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ ఆటగాళ్లున్నారు. ఐసీసీ జట్టు పగ్గాలు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్‌కు అప్పగించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగక్కర, వెటోరిలకు స్థానం దక్కడం విశేషం. లంక వెటరన్ సంగా వరుస సెంచరీలతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. వెటోరిని స్పిన్నర్ కోటాలో ఎంపిక చేశారు. ఇక టాప్ స్కోరర్ మార్టిన్ గప్టిల్‌తో పాటు స్టీవెన్ స్మిత్, డివిల్లీర్స్, మ్యాక్స్‌వెల్, కోరీ ఆండర్సన్‌కు చోటు దక్కింది. బౌలర్ల జాబితాలో టాపర్ స్టార్క్, బౌల్ట్, మోర్నీ మోర్కెల్‌ను ఎంపిక చేశారు. రిటైర్మెంట్ ప్రకటించిన జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్‌ను 12వ సభ్యుడిగా తీసుకున్నారు. ఐసీసీ జట్టు: మెకల్లమ్ (కెప్టెన్), సంగక్కర, గప్టిల్, స్మిత్, డివిల్లీర్స్, మ్యాక్స్‌వెల్, కోరీ ఆండర్సన్, వెటోరి, స్టార్క్, బౌల్ట్, మోర్కెల్, బ్రెండన్ టేలర్ (12వ వ్యక్తి). -
మిస్ యూ ‘పప్’
మైకేల్ క్లార్క్... ఆస్ట్రేలియా క్రికెట్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు. ఆటగాడిగా, నాయకుడిగా, స్నేహితుడిగా మైదానంలో, బయటా కూడా అందరి మనసులు దోచుకున్న వ్యక్తి. మైదానంలో ఈల వేసి సహచరులను సరదాగా పిలుస్తాడు... మైదానం వెలుపల కష్టమొస్తే పెద్దన్నలా అండగా నిలబడతాడు. అందుకే తను ఆటగాళ్లు మెచ్చిన కెప్టెన్ అయ్యాడు. 2011లో పాంటింగ్ రిటైర్మెంట్ తర్వాత సారథిగా బాధ్యతలు తీసుకున్న ‘పప్’... 33 ఏళ్లకే వన్డేలకు వీడ్కోలు చెపుతాడని ఆనాడు ఊహించి ఉండడు. అయితేనేం... తన కల సాకారం చేసుకుని సగర్వంగా వీడ్కోలు పలికాడు. గత రెండేళ్లుగా గాయాలతో సతమతమవుతూ, వన్డేల్లో తమ జట్టులోనే పెరిగిన పోటీలో అడపాదడపా వెనకబడుతున్నాడనే విమర్శలను మోస్తూ... అతి కష్టమ్మీద ప్రపంచకప్ ఆడాడు. నిజానికి ఈ టోర్నీకి ముందు తను బరిలోకి దిగుతాడో లేదో తెలియని సందిగ్దం. భారత్‌తో తొలి టెస్టు తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. ప్రపంచకప్ సమయానికి కోలుకుంటానని హామీ ఇచ్చి జట్టు సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. అయినా టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే ఎలాగైనా ప్రపంచకప్ ఆడాలి, స్వదేశంలో టైటిల్ గెలవాలనే తపనతోనే చాలా వేగంగా గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగాడు. భారత్‌తో సెమీస్ ముగియగానే తాను వన్డేలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. తన శరీరం అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సహకరించడం లేదని, టెస్టుల్లో ఎక్కువ కాలం ఆడాలనే కోరికతో వన్డేల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. దీంతో ఫైనల్‌కు ముందే సహచరుల్లో పట్టుదల పెంచాడు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా తన కెప్టెన్సీ ముద్రను స్పష్టంగా చూపించాడు. ప్రతి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌కు ఎలాంటి ఫీల్డింగ్ ఉండాలో సిద్ధమై వచ్చాడు. అలాగే తన వనరులను అత్యంత సమర్థంగా వాడుకుని తానెందుకు అద్భుతమైన కెప్టెనో మరోసారి నిరూపించాడు. -సాక్షి క్రీడా విభాగం -
ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా
ఫైనల్లో కివీస్‌పై ఏడు వికెట్ల విజయం ఠ ఐదోసారి ట్రోఫీ నెగ్గిన కంగారూలు బాణం వేసేవాడి బొటనవేలు... ట్రిగ్గర్ నొక్కేవాడి చూపుడువేలు తీసేస్తే... ఇక దేనికీ పనికిరారుప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా కూడా ఇదే చేసింది. కివీస్ బలం, బలహీనత కూడా అయిన మెకల్లమ్‌ను ముందే మడతపెట్టింది. ఎదురెళ్లి యుద్ధం చేసే సైనికుల్లా... వెంటాడి చంపే చిరుతల్లా చెలరేగిన క్లార్క్ సైన్యం అలవోకగా ప్రపంచకప్ ఫైనల్లో గెలిచింది. మెల్బోర్న్: పోరాటాలు అనుభవాన్నిస్తాయి.. పరాజయాలు పాఠాలను నేర్పుతాయి. లీగ్ దశలో న్యూజిలాండ్ చేతిలో ఓటమి నుంచి పాఠం నేర్చుకున్న ఆసీస్... ప్రపంచకప్ ఫైనల్లో విశ్వరూపం చూపించింది. తొలిసారి తుది సమరానికి వచ్చిన కివీస్ ఆశలపై నీళ్లుజల్లింది. ఆదివారం ఎంసీజీ మైదానంలో జరిగిన ఫైనల్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించి ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 45 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. ఇలియట్ (82 బంతుల్లో 83; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫామ్‌ను కొనసాగించగా, టేలర్ (72 బంతుల్లో 40; 2 ఫోర్లు) సమయోచితంగా ఆడాడు. తర్వాత ఆస్ట్రేలియా 33.1 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ క్లార్క్ (72 బంతుల్లో 74 ; 10 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడగా, స్మిత్ (71 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు), వార్నర్ (46 బంతుల్లో 45; 7 ఫోర్లు) నిలకడగా ఆడారు. ఫాల్క్‌నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’; స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించాయి. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (బి) మ్యాక్స్‌వెల్ 15; మెకల్లమ్ (బి) స్టార్క్ 0; విలియమ్సన్ (సి) అండ్ (బి) జాన్సన్ 12; టేలర్ (సి) హాడిన్ (బి) ఫాల్క్‌నర్ 40; ఇలియట్ (సి) హాడిన్ (బి) ఫాల్క్‌నర్ 83; అండర్సన్ (బి) ఫాల్క్‌నర్ 0; రోంచీ (సి) క్లార్క్ (బి) స్టార్క్ 0; వెటోరి (బి) జాన్సన్ 9; సౌతీ రనౌట్ 11; హెన్రీ (సి) స్టార్క్ (బి) జాన్సన్ 0; బౌల్ట్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (45 ఓవర్లలో ఆలౌట్) 183. వికెట్ల పతనం: 1-1; 2-33; 3-39; 4-150; 5-150; 6-151; 7-167; 8-171; 9-182; 10-183. బౌలింగ్: స్టార్క్ 8-0-20-2; హాజల్‌వుడ్ 8-2-30-0; జాన్సన్ 9-0-30-3; మ్యాక్స్‌వెల్ 7-0-37-1; ఫాల్క్‌నర్ 9-1-36-3; వాట్సన్ 4-0-23-0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) ఇలియట్ (బి) హెన్రీ 45; ఫించ్ (సి) అండ్ (బి) బౌల్ట్ 0; స్మిత్ నాటౌట్ 56; క్లార్క్ (బి) హెన్రీ 74; వాట్సన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (33.1 ఓవర్లలో 3 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1-2; 2-63; 3-175. బౌలింగ్: సౌతీ 8-0-65-0; బౌల్ట్ 10-0-40-1; వెటోరి 5-0-25-0; హెన్రీ 9.1-0-46-2; అండర్సన్ 1-0-7-0. మెకల్లమ్ నిరాశ ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో మెకల్లమ్ (0)ను లక్ష్యంగా చేసుకున్న ఆసీస్ ఇన్నింగ్స్ ఐదో బంతికే అతన్ని అవుట్ చేసింది. పవర్‌ప్లేలో స్టార్క్, హజల్‌వుడ్ స్వింగ్‌కు గప్టిల్ (15), విలియమ్సన్ (12) పరుగులు రాబట్టడంలో బాగా ఇబ్బందులుపడ్డారు. అయితే వరుస ఓవర్లలో ఈ ఇద్దరు అవుట్ కావడంతో కివీస్ 13 ఓవర్లలో 3 వికెట్లకు 41 పరుగులు చేసింది. సూపర్ భాగస్వామ్యం ఈ దశలో టేలర్, ఇలియట్ నిలకడగా ఆడారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్, డబుల్స్‌తో సరిపెట్టుకున్నారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 111 పరుగులు జోడించడంతో 35 ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోరు 150 పరుగులకే చేరుకుంది. ఫాల్క్‌నర్ జోరు నిలకడగా ఆడుతున్న ఈ జోడీని బ్యాటింగ్ పవర్‌ప్లేలో ఫాల్క్‌నర్ విడదీశాడు. 36వ ఓవర్లో మూడు బంతుల వ్యవధిలో టేలర్, అండర్సన్ (0)ను అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్లో రోంచీ (0) కూడా వెనుదిరిగాడు. ఓవరాల్‌గా 8 బంతుల వ్యవధిలో 1 పరుగు తేడాతో ఈ మూడు వికెట్లు పడటంతో కివీస్ కోలుకోలేకపోయింది. 33 పరుగుల తేడాతో చివరి 7 వికెట్లు కోల్పోవడంతో కివీస్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. జాన్సన్, ఫాల్క్‌నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. వార్నర్ విజృంభణ లక్ష్యం చిన్నది కావడంతో రెండో ఓవర్లోనే ఫించ్ (0)ను అవుట్ చేసి బౌల్ట్ ఆశలు రేకేత్తించాడు. కానీ వార్నర్, స్మిత్‌లు వరుసగా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో 56 పరుగులు సమకూరాయి. జోరుమీదున్న వార్నర్‌ను 13వ ఓవర్లో హెన్రీ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. క్లార్క్ దూకుడు కెప్టెన్ క్లార్క్ క్రీజులో కుదురుకున్నాక క్రమంగా బ్యాట్ ఝుళిపించాడు. స్మిత్ కంటే ఎక్కువగా స్ట్రయికింగ్ చేసిన అతను హెన్రీ, సౌతీ ఓవర్లలో ఫోర్లు కొట్టి జోరు పెంచాడు. ఈ జోడీని విడదీసేందుకు వెటోరిని ప్రయోగించినా ప్రయోజనం లేకపోయింది. స్మిత్ బౌండరీ ఇక ఆసీస్ విజయ లక్ష్యం 22 ఓవర్లలో 44 పరుగులు చేయాల్సిన దశలో స్మిత్ కూడా వేగం పెంచాడు. కానీ సౌతీ వేసిన ఇన్నింగ్స్ 31వ ఓవర్లో క్లార్క్ వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. దీంతో లక్ష్యం 19 ఓవర్లు 10 పరుగులుగా మా రింది. ఈ దశలో క్లార్క్ బౌల్డ్ అయ్యా డు. తర్వాత వాట్సన్ (2 నాటౌట్)తో కలిసి స్మిత్ ఫోర్‌తో లాంఛనాన్ని పూర్తి చేశాడు. -
సరిలేరు మీకెవ్వరూ...
ఆసీస్ అంటే ఇదీ... ఏం చెప్పాలి... ఏమని వర్ణించాలి... అమోఘమన్నా...అద్భుతమన్నా... అద్వితీయమన్నా.. తక్కువే మీరు గెలవడానికే పుట్టారేమో... ఒకసారి గెలిస్తే గొప్ప... రెండోసారి గెలిస్తే అదృష్టం... మరీ ఐదుసార్లు గెలవడమంటే... క్రికెట్ ప్రపంచం మీకు దాసోహమైనట్లే. అందుకే మీ కీర్తి అనంతం... మీ ఆట అనితర సాధ్యం... మీ పయనం ఎదురులేని స్వప్నం... ఇక ఈ ఆటకు మీరే రారాజులు.. ఖండమేదైనా... ప్రత్యర్థి ఎవరైనా... మీరే గెలుస్తున్నారంటే... మీకు మీరే సాటి... సరిలేరు మీకెవ్వరూ పోటీ. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు సహజంగానే ఫేవరెట్లలో ఒకటి. కానీ టోర్నీ ఆరంభంలో ఆ జట్టు కాస్త మందగమనంలో కనిపించింది. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసినా...బంగ్లాతో మ్యాచ్ రద్దు కావడంతో, రెండు వారాల దాకా మరో మ్యాచ్ లేకపోవడం ఆ జట్టు అందరి దృష్టినీ ఆకర్షించలేదు. పైగా కివీస్‌తో పరాజయం తర్వాత కొన్ని సమీకరణాలతో చివరి దాకా గ్రూప్‌లో ఏ స్థానమో ఖరారు కాలేదు. కానీ అసలు పోరులో మాత్రం ఆసీస్ గర్జించింది. ఒక్కసారిగా తమ సత్తా ప్రదర్శించి మూడు నాకౌట్ మ్యాచ్‌లలోనూ చెలరేగింది. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడది అసలు సిసలైన ఆస్ట్రేలియా జట్టులా కనిపించింది. ఆస్ట్రేలియా మైదానంలో, అచ్చమైన ఆసీస్ స్టయిల్లో ఐదో సారి విశ్వ విజేతగా నిలిచింది. దీని వెనక ఏడాదిన్నర శ్రమ ఉంది. ఆటగాళ్లు, కోచ్‌లే కాదు అనేక మంది మాజీలు, దిగ్గజాలు సూచనలు, ప్రేరణ ఉన్నాయి. క్లార్క్ నాయకత్వ ప్రతిభ జట్టును అద్భుతంగా నడిపించింది. అక్కడే మొదలు... 2013 జూన్... చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ విజేతగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కనీసం సెమీఫైనల్ కూడా చేరలేకపోయింది. తమ గ్రూప్‌లో ఆ జట్టు ఇంగ్లండ్, శ్రీలంక, న్యూజిలాండ్ తర్వాత చివరి స్థానంలో నిలిచింది. వన్డేల్లో రారాజుగా వరుసగా మూడు ప్రపంచకప్‌లు గెలుచుకున్న ఆసీస్ జట్టు ఇదేనా అనిపించింది. ఆ సమయంలో డారెన్ లీమన్ కోచ్‌గా వచ్చారు. ఆ తర్వాత ఆసీస్ అదృష్టం మారింది. కొత్త తరాన్ని, కుర్రాళ్లను ప్రోత్సహిస్తూ అప్పుడే లీమన్ ‘మిషన్ 2015 ప్రపంచకప్’ మొదలు పెట్టారు. అదే ఈ రోజు ఆ జట్టును మరోసారి శిఖరాన నిలబెట్టింది. అడుగడుగునా ప్రొఫెషనలిజం గుర్తు చేస్తూనే ఆటగాళ్లకు కావాల్సిన స్వేచ్ఛనిచ్చారు. అడ్డమైన నిబంధనలతో వారికి అడ్డంకులు సృష్టించకుండా ఆటపై దృష్టి పెట్టేలా చేయగలిగారు. చాంపియన్స్ ట్రోఫీలో విఫలమైన మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్, స్టార్క్, ఫించ్, మిషెల్ మార్ష్ ఇప్పుడు అదే జట్టును చాంపియన్‌గా నిలబెట్టారు ఒకరిని మించి మరొకరు ఆసీస్ విజయంలో అన్నింటికంటే పెద్ద పాత్ర పేస్ బౌలింగ్‌దే. ఇతర జట్లతో పోలిస్తే తిరుగులేని లైనప్‌తో పాటు సొంత మైదానాల్లో బౌలర్లు చెలరేగారు. స్పిన్ పిచ్ అంటూ వినిపించిన చోట కూడా ఒక్కసారిగా ప్రణాళికలు మార్చుకోలేదు. తమ బలాన్ని నమ్ముకొనే బరిలోకి దిగింది. ముఖ్యంగా మిషెల్ స్టార్క్ అత్యుత్తమ స్వింగ్ బౌలర్‌గా ఎదిగాడు. ఫైనల్లో మెకల్లమ్‌ను అతను అవుట్ చేసిన బంతి ప్రపంచ క్రికెట్లో చిరకాలం గుర్తుండిపోతుంది. బ్యాటింగ్‌లో ఒకరు విఫలమైన చోట మరొకరు బ్యాటన్‌ను అందుకున్నారు. వ్యూహాలు, తుది జట్టు ఎంపిక విషయంలో ఆసీస్ మొహమాటాలకు పోలేదు. పక్కా ప్రొఫెషనలిజంను ప్రదర్శించింది. జట్టు కోసం కొందరు ‘త్యాగాలు’ చేయాల్సి వచ్చినా తప్పలేదు. స్టార్క్ కోసం జాన్సన్‌ను కొత్త బంతినుంచి దూరంగా ఉంచారు. దానికి తగినట్లుగా అతను మధ్య ఓవర్లలో తన స్థాయి బౌలింగ్‌ను ప్రదర్శించాడు. వరుసగా విఫలమవుతున్న వాట్సన్‌ను ఒక మ్యాచ్‌నుంచి తప్పించి హెచ్చరించారు. దాంతో అతను తర్వాతి మ్యాచ్‌లలో ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడాడు. కెప్టెన్‌గా ఒక మ్యాచ్ ఆడి అర్ధ సెంచరీ చేసినా... క్లార్క్ కోసం బెయిలీ పక్కన కూర్చోవాల్సి వచ్చింది.స్మిత్‌ను మిడిలార్డర్ నుంచి మూడో స్థానానికి ప్రమోట్ చేశారు. యువ పేసర్లు హాజల్‌వుడ్, కమిన్స్‌లను మ్యాచ్‌కు అనుగుణంగా మారుస్తూ సమర్థంగా వాడుకోగా... ఆల్రౌండర్లుగా మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్ తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. మొత్తంమీద ఆసీస్ ఏం చేసినా కలిసొచ్చింది... కప్ నడిచొచ్చింది..! -సాక్షి క్రీడా విభాగం -
కంగారూలకు అభినందనల వెల్లువ
మెల్బోర్న్: ఐదోసారి ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియాకు అభినందనలు వెల్లువెత్తాయి. పలు దేశాధినేతలు, క్రికెటర్లు, మాజీలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ కంగారూలను అభినందించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆసీస్ 7 వికెట్లతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. ఆసీస్నుఏ అభినందించిన వారిలో క్రిస్ గేల్, లారా, మెక్ గ్రాత్, లక్ష్మణ్, కలిస్, అఫ్రీది, మైకేల్ వాన్, యువరాజ్ సింగ్ తదితరులు ఉన్నారు. -
హ్యూస్కు ప్రపంచ కప్ అంకితం
మెల్బోర్న్: దేశవాళీ మ్యాచ్ సందర్భంగా గాయపడి ఆకస్మికంగా మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్కు ప్రపంచ కప్‌ను అంకితం చేశారు. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయానంతరం ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్.. కప్‌ను హ్యూస్కు అంకితమిచ్చారు. బౌన్సర్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డ హ్యూస్ గతేడాది నవంబర్ 27న మరణించాడు. -
ఫైనల్ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో హాజరు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య ఆదివారం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ పోరును తిలకించేందుకు రికార్డు స్థాయిలో అభిమానులు హాజరయ్యారు. మ్యాచ్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియానికి 93,013 మంది అభిమానులు తరలివచ్చారు. క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా అత్యధికమంది చూడటం ఇదే రికార్డు. ఇదే వేదికపై 15 నెలల క్రితం 91,112 మంది బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆటను వీక్షించారు. తాజాగా ఈ రికార్డు కనుమరుగైంది. వన్డే క్రికెట్లో అయితే పాకిస్థాన్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన 1992 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను 87,182 మంది తిలకించారు. ఈ రికార్డు కూడా మెల్బోర్న్లో బ్రేక్ అయింది. -
కంగారులకు కప్ కామన్!
క్రికెట్ వరల్డ్ కప్.. ప్రపంచానికి అత్యంత ఆసక్తి. క్రికెట్ వరల్డ్ కప్ వచ్చిందంటే అభిమానులకు పండుగ. ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకు దక్కినంత వన్డే వరల్డ్ కప్ ఆనందం మిగతా ఏ దేశాభిమానికి దక్కి ఉండకపోవచ్చు. అయితే క్రికెట్ చూసే సగటు ప్రేక్షకుడికి ఆస్ట్రేలియాకు కప్ రావడం సర్వ సాధారణమే అనే అభిప్రాయానికి రాకమానడు. ఇప్పటికే పలు దేశాలు వరల్డ్ కప్ ను ఒక్కసారైనా ముద్దాడాలని చూస్తుంటే.. ఆస్ట్రేలియా మాత్రం కప్ లను చేజిక్కించుకుంటూనే ఉంది. ఏడు సార్లు ఫైనల్ కు చేరిన ఆసీస్.. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ గా అవతరించి క్రికెట్ లో తమ సత్తాను రుజువు చేస్తూనే ఉంది. 1987 లో మొదలైన ఆసీస్ ప్రపంచకప్ విజయప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆస్ట్రేలియా ఎన్నిసార్లు కప్ గెలిచినా పెద్దగా సందడి ఏమీ ఉండదు. వన్డే వరల్డ్ కప్ 2015లో భాగంగా సొంతగడ్డపై జరిగిన ఫైనల్ మ్యాచ్ ను చూడటానికి క్రికెట్ ప్రేమికులు మాత్రమే వచ్చారు. కానీ ఆసీస్ కు చెందిన ప్రముఖ వ్యక్తులు ఎవరూ స్టేడియంలో కనిపించలేదు. స్వదేశంలో జరిగే మ్యాచ్ కాబట్టి నేటి మ్యాచ్ కు ఆసీస్ ప్రధాని టోనీ అబాట్ వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన మ్యాచ్ ను వీక్షించేందుకు రాలేదు. మరే ఏ దేశంలో అయినా వరల్డ్ కప్ జరిగిన ఫైనల్ మ్యాచ్ లకు ఆ దేశ ప్రధానులు రావడం ఇప్పటి వరకూ చాలానే చూశాం. ఇంత వరకూ ఎందుకు?టీమిండియాతో సిడ్నీలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 70 శాతం భారత్ అభిమానులతో స్టేడియం నిండిపోతే.. ఆసీస్ కు అభిమానులు మాత్రం 30 శాతంగా ఉంది. అసలు జట్టుపై నమ్మకం ఉన్నప్పుడు స్టేడియంకు వచ్చి సందడి చేయాల్సిన అవసరం లేదనేది వారిని చూస్తే అర్ధం అవుతుంది కదా! -
తిరుగులేని ఆసీస్
-
విశ్వ విజేత ఆస్ట్రేలియానే
-
మెల్బోర్న్లో సచిన్ సందడి
గత ప్రపంచ కప్ విజేత టీమిండియాలో సభ్యుడిగా ఉన్న బ్యాటింగ్ దిగ్గజం సచిన్ మెల్బోర్న్లో స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. తాజా ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మాస్టర్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించాడు. ఆస్ట్రేలియా విజయానంతరం అవార్డుల ప్రదానోత్సవంలో సచిన్ అతిథిగా పాల్గొన్నాడు. సచిన్ పేరు ప్రస్తావించినప్పుడల్లా మెల్బోర్న్ స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు. మాస్టర్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఫాల్కనర్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', స్టార్క్‌కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులను అందజేశాడు. -
ప్రపంచ కప్ విజేతలు వీరే
1975లో వన్డే ప్రపంచ కప్‌నకు అంకురార్పణ జరిగాక.. నేటి వరకు 11 ఈవెంట్లు జరిగాయి. ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవగా.. వెస్టిండీస్, భారత్ చెరో రెండు సార్లు కప్ సొంతం చేసుకున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక ఒక్కోసారి జగజ్జేతలయ్యారు. ఈ ఐదు జట్లు మినహా ఇతర జట్లు ఒక్కసారి కూడా ప్రపంచ కప్ నెగ్గలేదు. తాజా ఈవెంట్లో న్యూజిలాండ్ కొత్త చాంపియన్ అవుతుందని ఆశించనా.. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇక క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ కూడా వన్డే ప్రపంచ కప్ కల నెరవేరలేదు. ఇప్పటి వరకు జరిగిన 11 వన్డే ప్రపంచ కప్‌లలో ఎవరెవరు గెలిచారో చూద్దాం.. సంవత్సరం విజేత రన్నరప్ 1975 వెస్టిండీస్ ఆస్ట్రేలియా 1979 వెస్టిండీస్ ఇంగ్లండ్ 1983 భారత్ వెస్టిండీస్ 1987 ఆస్ట్రేలియా ఇంగ్లండ్ 1992 పాకిస్థాన్ ఇంగ్లండ్ 1996 శ్రీలంక ఆస్ట్రేలియా 1999 ఆస్ట్రేలియా పాకిస్థాన్ 2003 ఆస్ట్రేలియా భారత్ 2007 ఆస్ట్రేలియా శ్రీలంక 2011 భారత్ శ్రీలంక 2015 ఆస్ట్రేలియా న్యూజిలాండ్ -
వచ్చే ప్రపంచ కప్ ఇంగ్లండ్‌లో..
దాదాపు నెలన్నర రోజుల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన 11వ వన్డే ప్రపంచ కప్ ముగిసింది. క్రిస్ గేల్ డబుల్ సెంచరీ.. గప్టిల్ ప్రపంచ కప్ రికార్డు వ్యక్తిగత స్కోరు.. సంగక్కర వరుస సెంచరీల చరిత్ర.. టోర్నీలో అత్యధిక సెంచరీలు.. సరికొత్త రికార్డులు.. ధోనీసేన అత్యధిక వరుస విజయాలు.. న్యూజిలాండ్ జైత్రయాత్ర.. దిగ్గజాల వీడ్కోలు.. ఇలా ఎన్నో చిరస్మరణీయ జ్ఞాపకాలను మిగిల్చింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమి.. ఆఖరి మెట్టుపై న్యూజిలాండ్ నిష్ర్కమణ వంటి గుండెల్ని పిండే క్షణాలు.. ఆసీస్ ఐదోసారి ప్రపంచ కప్ అందుకోవడం అభిమానులకు గుర్తుండిపోతాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2015 ప్రపంచ కప్ అభిమానులకు ఎన్నో చేదు, మధుర స్మృతులను మిగిల్చింది. ఫిబ్రవరి 14న ఆరంభమైన ఈ మెగా ఈవెంట్ మార్చి 29న గ్రాండ్ ఫైనల్‌తో విజయవంతంగా ముగిసింది. వచ్చే వన్డే ప్రపంచ కప్ 2019లో ఇంగ్లండ్, వేల్స్ లో జరగనుంది. మరో వన్డే క్రికెట్ పండుగ కోసం అప్పటి దాకా ఎదురు చూద్దాం. -
టాపర్లను ఓడించి.. కప్ కొట్టేశారు
ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, దక్షిణాఫ్రికా టైటిల్ ఫేవరెట్లు. ఈ నాలుగు జట్లే సెమీస్ చేరాయి. ఆసీస్ ప్రపంచ చాంపియన్ కావడానికి, మిగిలిన మూడు జట్లు బోల్తాపడటానికి ఒకటే కారణం. కంగారూలు పోరాటపటిమతో ఒత్తిడిని జయించగా.. ఇతర మూడు జట్లు ఒత్తిడికి చిత్తయ్యాయి. కంగారూలు సొంతగడ్డపై టైటిల్ ఫేవరెట్లను, టాపర్లను మట్టికరిపించి ప్రపంచ చాంపియన్లు కాగా.. తొలిసారి ప్రపంచ కప్ సాధించాలని ఆశించిన మరో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. లీగ్ దశలో కివీస్ చేతిలో ఓడిన ఆసీస్.. ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుని ఏకంగా కప్ అందుకుంది. లీగ్ దశలో ఆసీస్ ఓ మ్యాచ్‌లో (కివీస్‌తో) ఓడిపోగా.. భారత్, న్యూజిలాండ్ ఆయా గ్రూపుల్లో టాపర్లుగా నిలిచాయి. నాకౌట్ సమరంలో ఆసీస్‌కు ఈ రెండు జట్లూ ఎదురుపడ్డాయి. సెమీస్‌లో ఆసీస్.. టీమిండియాతో తలపడింది. ధోనీసేన అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగిస్తుందని భావించారు. అయితే కీలక పోరులో ధోనీసేన ఒత్తిడికి గురైంది. కంగారూలు పోరాటపటిమతో భారత్‌పై ఘనవిజయం సాధించారు. తొలుత ఆసీస్ భారీ స్కోరు సాధించగా.. టీమిండియా లక్ష్యఛేదనలో విఫలమైంది. ఇక గ్రాండ్ ఫైనల్లో కంగారూలకు కివీస్ ఎదురైంది. సెమీస్‌లో సఫారీలపై భారీ లక్ష్యం సాధించిన కివీస్‌కు టోర్నీలో ఓటమే లేదు. అలాంటి కివీస్ జట్టు కీలక ఫైనల్ పోరులో చతికిలపడింది. బ్యాటింగ్‌లో బలోపేతంగా కనిపించిన కివీస్ తక్కువ స్కోరుకు ఆలౌటైంది. ఆసీస్ లక్ష్యాన్ని సాధించి ఐదోసారి ప్రపంచ కప్ కొట్టేసింది. -
విశ్వ విజేత ఆస్ట్రేలియానే
మెల్ బోర్న్:మరోసారి ఆస్ట్రేలియా విశ్వ విజేతగా అవతరించింది. క్రికెట్ లో తమకు తిరుగులేదని నిరూపిస్తూ ఆసీస్ ఐదోసారి వరల్డ్ కప్ ను చేజిక్కించుకుంది. ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్ ను కైవశం చేసుకుంది. న్యూజిలాండ్ విసిరిన 184 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆదిలోనే ఓపెనర్ ఆరోన్ ఫించ్ డకౌట్ గా వెనుదిరిగినా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(45)పరుగులతో ఆకట్టుకున్నాడు. వార్నర్ వెనుదిరిగిన అనంతరం స్టీవ్ స్మిత్ కు జత కలిసిన మైకేల్ క్లార్క్ బాధ్యతాయుతంగా ఆడాడు. అయితే విజయానికి మరో 9 పరుగులు కావాల్సిన తరుణంలో క్లార్క్(74) పెవిలియన్ కు చేరాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ మార్కును చేరిన స్మిత్ (56*) మిగతా పనిని పూర్తి చేశాడు. ఆసీస్ టాప్ ఆర్డర్ రాణించడంతో లక్ష్యాన్ని 33.1 ఓవర్లలో చేరుకుని కివీస్ కు షాకిచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీకి రెండు వికెట్లు దక్కగా, బౌల్ట్ కు ఒక వికెట్ లభించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 45.0 ఓవర్లలో 183 పరుగులకే చాప చుట్టేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో గ్రాంట్ ఇలియట్(83), రాస్ టేలర్(40) పరుగులు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఆరుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దుమ్ములేపిన ఆసీస్ పేస్ ఈ మెగా ఈవెంట్ లో ఇరు జట్లు బలబలాలు సమానంగా ఉన్నా.. కీలక పోరుకు వచ్చేసరికి ఆసీస్ ప్రత్యేకంగా తన పేస్ తో కివీస్ దుమ్ముదులిపింది. ఫైనల్ మ్యాచ్ మొదలైన అనంతరం కివీస్ ఆటగాళ్లను కోలుకోనీయకుండా చేసి తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో ఆసీస్ సఫలం అయ్యింది. ప్రధానంగా మిచెల్ జాన్సన్, ఫాల్కనర్, స్టార్క్ లు బౌలింగ్ చెలరేగి కివీస్ పతనాన్ని శాసించారు. ఈ ముగ్గురు కలిసి ఎనిమిది కివీస్ వికెట్ల నేలకూల్చడం గమనార్హం. -
పాపం.. కివీస్ కల చెదిరింది
కల చెదిరింది. ఆశలు ఆవిరయ్యాయి. కోట్లాది అభిమానుల గుండె పగిలింది. వెట్టోరికి విజయంతో వీడ్కోలు పలకాలన్న కోరిక నెరవేరలేదు. జీవిత చరమాంకంలో ఉన్న మార్టిన్ క్రో కోసం గెలవాలన్న ఆకాంక్ష తీరలేదు. పాపం.. న్యూజిలాండ్ మరోసారి ప్రపంచ కప్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కప్ ఊరించి.. చేతుల దాకా వచ్చినా.. కివీస్ ఆఖరి మెట్టుపై చేజార్చుకుంది. మేటి జట్లను మట్టికరిపించిన న్యూజిలాండ్ కీలక ఫైనల్ సమరంలో ఒత్తిడికి చిత్తయ్యింది. లీగ్ దశలో ఆస్ట్రేలియాను ఓడించిన కివీస్.. టైటిల్ పోరులో అదే జట్టు చేతిలో పరాజయం చవిచూసింది. తొలిసారి ప్రపంచ కప్ ముద్దాడాలని కలలు కన్న కివీస్.. చివరకు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ప్రపంచ కప్ కోసం మరో నాలుగేళ్లు ఎదురు చూడకతప్పదు. ఆసీస్ ఐదోసారి జగజ్జేతగా అవతరించింది. ప్రపంచ కప్ చరిత్రలో కివీస్ ఒక్కసారి కూడా కప్ అందుకోలేదు. అసలు ఇంతకుముందు ఫైనల్‌కు చేరనేలేదు. ఈసారి కాకపోతే మరెప్పుడు ప్రపంచ చాంపియన్ అయ్యేది అన్న పట్టుదలతో తాజా ఈవెంట్లో న్యూజిలాండ్ బరిలో దిగింది. సొంతగడ్డపై జైత్రయాత్ర సాగించింది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లో నెగ్గింది. మరో ఆతిథ్య జట్టు ఆసీస్‌నూ కంగారెత్తించి గ్రూపు టాపర్‌గా నిలిచింది. నాకౌట్ సమరంలోనూ అదే జోరు కొనసాగించింది. క్వార్టర్స్‌లో భారీ స్కోరు సాధించి వెస్టిండీస్‌ను చిత్తుచేసింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఉత్కంఠ విజయం సాధించి తొలిసారి ఫైనల్ చేరింది. ప్రపంచ కప్ ఫైనల్ వరకు ఓటమే లేని జట్టు న్యూజిలాండ్ మాత్రమే. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించింది. ప్రపంచ కప్ చరిత్రలో ఆ జట్టుకిదే అత్యుత్తమ ప్రదర్శన. జోరు చూశాక వారి విజయం ఆపడం ఎవరిచేతా కాదనిపించింది. కప్ అందుకోవడమే తరువాయిని భావించారు. తొలిసారి ప్రపంచ చాంపియన్లు కావడం ఖాయమనిపించింది. న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచ కప్ అందుకోవాలని ఆ దేశ ప్రజలేగాక ఇతర దేశాల అభిమానులు కోరుకున్నారు. ఆసీస్ ఇంతకుముందు నాలుగుసార్లు కప్ సొంతం చేసుకుంది కాబట్టి.. ఈసారి కివీస్‌కు రావాలని ఆకాంక్షించారు. అయితే కోట్లాది అభిమానుల కల కలగానే మిగిపోయింది. ఫైనల్ సమరంలో కివీస్ ఓడినా.. అత్యుత్తమ ప్రదర్శనతో అభిమానుల మనసులో విజేతగా నిలిచింది. -
వెట్టోరి, క్లార్క్ గుడ్ బై
మరో ఇద్దరు క్రికెటర్లు వీడ్కోలు పలికారు. న్యూజిలాండ్ దిగ్గజం డానియల్ వెట్టోరి అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ వన్డేల నుంచి వైదొలిగాడు. రిటైర్మెంట్ నిర్ణయం ముందే ప్రకటించిన వెట్టోరి, క్లార్క్‌కు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆఖరిది. కాగా క్లార్క్ టెస్టుల్లో కొనసాగనున్నాడు. 18 ఏళ్లపాటు న్యూజిలాండ్ క్రికెట్‌కు సేవలందించిన 36 ఏళ్ల వెట్టోరి అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. 18 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన వెట్టోరి కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా విశేష సేవలందించాడు. 113 టెస్టులాడిన వెట్టోరి 4531 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 23 అర్ధ శతకాలున్నాయి. టెస్టుల్లో 362 వికెట్లు పడగొట్టాడు. ఇక 295 వన్డేలాడిన కివీస్ మాజీ కెప్టెన్ 2251 పరుగులు చేశాడు. కాగా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. 4 హాఫ్ సెంచరీలు చేయగా, 305 వికెట్లు తీశాడు. 34 టీ-20లు ఆడిన వెట్టోరి 205 పరుగులు చేసి, 38 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ కెప్టెన్, 34 ఏళ్ల క్లార్క్ 12 ఏళ్ల క్రితం వన్డేల్లో అరంగేట్రం చేశాడు. క్లార్క్ తన కెరీర్లో 245 వన్డేలు ఆడాడు. 8 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలతో 7981 పరుగులు సాధించాడు. 108 టెస్టులాడిన క్లార్క్ 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 8432 పరుగులు చేశాడు. దిగ్గాజాల నిష్ర్కమణ: ప్రపంచ కప్‌లో చాలా మంది దిగ్గజాలు వీడ్కోలు పలికారు. శ్రీలంక వెటరన్లు కుమార్ సంగక్కర, మహేల జయవర్దనె.. పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా, మాజీ కెప్టెన్ అఫ్రీది.. జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ రిటైరయిన సంగతి తెలిసిందే. తాజాగా వెట్టోరి, క్లార్క్ వైదొలిగారు. -
క్లార్క్, స్మిత్ అర్థసెంచరీలు
మెల్ బోర్న్: న్యూజిలాండ్ తో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైఖేల్ క్లార్క్, స్మిత్ అర్ధ సెంచరీలు సాధించారు. క్లార్క్ 56 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 58వ అర్థసెంచరీ. స్మిత్ కూడా అర్ధసెంచరీ బాదాడు. 66 బంతుల్లో 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు. వన్డేల్లో స్మిత్ కు ఇది 7వ అర్ధసెంచరీ. ఇప్పటివరకు స్మిత్ అర్ధ సెంచరీ చేసిన మ్యాచులు అన్నింట్లోనూ ఆసీస్ విజయం సాధించింది. -
గెలుపుబాటలో ఆసీస్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలుపు దిశగా దూసుకెళ్తోంది.184 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 25 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. క్లార్క్ 43, స్మిత్ 34 పరుగులతో ఆడుతున్నారు. వార్నర్ 45 పరుగులు చేసి అవుటయ్యాడు. మరో ఓపెనర్ అరోన్ ఫించ్ డకౌట్ అవుటయ్యాడు. -
100 పరుగుల స్కోరు చేసిన ఆసీస్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 184 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 21 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. స్మిత్(26), క్లార్క్(23) క్రీజ్ లో ఉన్నారు. వార్నర్(45) రెండో వికెట్ గా అవుటయ్యాడు. మరో ఓపెనర్ అరోన్ ఫించ్ డకౌట్ అవుటయ్యాడు. -
బంతి వికెట్లను తాకినా.. బెయిల్స్ పడలేదు!
మెల్ బోర్న్:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తృటిలో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 14 ఓవర్ ముగిసిన అనంతరం స్మిత్ బ్యాటింగ్ ఎండ్ లో ఉన్నాడు. ఆ తరుణంలో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ పదిహేనో ఓవర్ లో తొలి బంతిని సంధించాడు. ఆ బంతి స్మిత్ ప్యాడ్ లపై పడి వికెట్లను తాకింది. అయినా బెయిల్స్ పడకపోవడంతో స్మిత్ బతికి బయటపడ్డాడు. ఆ సమయానికి స్మిత్ 16 పరుగులతో క్రీజ్ లో ఉండగా ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇదే తరహా ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మిస్బా-వుల్-హక్ బ్యాటింగ్ చేసే సమయంలో బంతి వికెట్లను తాకి లైట్లు వెలిగినా.. బెయిల్స్ మాత్రం పడలేదు. -
63 పరుగులకు ఓపెనర్ల అవుట్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 184 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 63 పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. వార్నర్(45) రెండో వికెట్ గా అవుటయ్యాడు. మరో ఓపెనర్ అరోన్ ఫించ్ డకౌట్ అవుటయ్యాడు. ఆసీస్ 14 ఓవర్లలో 68/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. స్మిత్(16), క్లార్క్(3) క్రీజ్ లో ఉన్నారు. -
50 పరుగుల స్కోరు చేసిన ఆసీస్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 184 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 9.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసింది. వార్నర్ 35, స్మిత్ 12 పరుగులతో ఆడుతున్నారు. ఓపెనర్ అరోన్ ఫించ్ డకౌట్ అవుటయ్యాడు. -
కివీస్ కకావికలం
-
చెప్పలేం.. 183 పరుగుల టార్గెట్ కాపాడుకోవచ్చు
న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియాకు మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 183 పరుగుల టార్గెట్‌ను కివీస్ కాపాడుకుంటుందనే క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. తామంతా న్యూజిలాండ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నట్లు తెలియజేశారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ ఆస్ట్రేలియా ముందు 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనిని కాపాడుకోగలుగుతుందా అంటూ సాక్షి.. ఫేస్బుక్ ద్వారా క్రికెట్ అభిమానులను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ఈ టార్గెట్‌ను కాపాడుకోలేకపోవచ్చని కూడా మరికొందరు అభిమానులు చెప్పారు. చెప్పలేమని, ఆస్ట్రేలియా గెలుస్తుందని కూడా ఇంకొందరు అభిమానులు అభిప్రాయపడ్డారు. -
2 పరుగులకే తొలి వికెట్ డౌన్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 184 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అరోన్ ఫించ్ డకౌట్ అవుటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆసీస్ 3 ఓవర్లలో 9/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. వార్నర్(9) స్మిత్(0) క్రీజ్ లో ఉన్నారు. -
బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 184 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ ఓపెనర్లుగా వచ్చారు. సౌతీ తొలి ఓవర్ వేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 45 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. -
నాలుగు డకౌట్లు, బౌల్డ్ లు
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో కివీస్ బ్యాట్స్ మెన్ తేలిపోయారు. ఆసీస్ బౌలర్లకు తలవంచారు. తుది సమరంలో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. కంగారూ బౌలర్లు కదం తొక్కడంతో మెక్ కల్లమ్ సేన కకావికలమైంది. పరుగుల వర్షంతో కల్లోలం సృష్టించే మెక్ కల్లమ్ పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరడంతో కివీస్ పతనం ఆరంభమైంది. అతడితో పాటు మరో ముగ్గురు డకౌటయ్యారు. ఆస్ట్రేలియా మొత్తం నలుగురిని డకౌట్ చేశారు. ఆండర్సన్, రోంచి, హెన్రీ ఇలా వచ్చి అలా వెళ్లారు. ఇలియట్, రాస్ టేలర్ కొద్దిసేపు పోరాడినా ఆసీస్ బౌలర్లే పైచేయి సాధించారు. తుది పోరులో కదం తొక్కిన కంగారూ బౌలర్లు నలుగురిని క్లీన్ బౌల్డ్ చేశారు. -
1983 వరల్డ్ కప్ పునరావృతం కానుందా?
మెల్ బోర్న్: హర్యానా హరికేన్ కపిల్ డేవ్ సారథ్యంలో భారత్ తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన సందర్భం గుర్తుందా? భారతీయులకు చిరస్మరణీయమైన వరల్డ్ కప్ అందించిన ఆ ఫైనల్ మ్యాచ్ ను మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం? ఏంటీ ఇప్పడు భారత్ ఫైనల్లో లేకపోయిన ఆ విషయం ఎందుకు అనే సందేహం తప్పక కలుగమానదు. ఆ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 183 పరుగులకే ఆలౌటైంది. అప్పటికే మన ఫైనల్ ప్రత్యర్ధి అయిన వెస్టిండిస్ రెండు వరల్డ్ కప్ లను గెలిచి మంచి ఊపు మీద ఉండటంతో అందరూ ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ మ్యాచ్ లో వెస్టిండీస్ 140 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ తొలి వరల్డ్ కప్ ను సగర్వంగా అందుకుంది. వరల్డ్ కప్ 2015 భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ 183 పరుగులకే చాపచుట్టేసి నాటి ఫైనల్ ను జ్ఞప్తికి తెచ్చింది. మంచి బౌలింగ్ లైనప్ ఉన్న న్యూజిలాండ్ ఆస్ట్రేలియాని 183 లోపే కట్టడి చేస్తే న్యూజిలాండ్ కూడా తొలిసారే వరల్డ్ కప్ సాధించినట్లు అవుతుంది. మరి న్యూజిలాండ్ బౌలర్లు ఏమి చేస్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిందే. -
కివీస్ కకావికలం
మెల్ బోర్న్: కంగారూ బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ కకావికలం అయ్యారు. టైటిల్ పోరులో స్వల్ప స్కోరుకే చాపచుట్టేశారు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 45 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ముందు 184 పరుగుల టార్గెట్ ఉంచింది. ఇలియట్(83), టేలర్(40) మినహా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో కివీస్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్ ఇలియట్, టేలర్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 137 బంతుల్లో 111 పరుగులు జోడించడంతో కివీస్ కోలుకుంది. అయితే 150 స్కోరు వద్ద టేలర్ అవుటవడంతో మ్యాచ్ గతి మారిపోయింది. ఆసీస్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించడంతో కివీస్ ఒక్కసారిగా కుప్పకూలింది. 33 పరుగుల తేడాతో కివీస్ 6 వికెట్లు చేజార్చుకుని చాపచుట్టేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాల్కనర్, జాన్సన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2 వికెట్లు తీశాడు. మ్యాక్స్ వెల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
ఇలియట్ అవుట్.. కివీస్ ఎదురీత
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 171 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఒంటరి పోరాటం చేసిన ఇలియట్ అవుటయ్యాడు. ఇలియట్ 81 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ తో 83 పరుగులు చేశాడు. రాస్ టేలర్ 40, గప్టిల్ 15, విలియమ్సన్ 12 పరుగులు చేసి అవుటయ్యారు. మెక్ కల్లమ్, ఆండర్సన్, రోంచి డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, ఫాల్కనర్, జాన్సన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్ వెల్ ఒక వికెట్ తీశాడు. 43 ఓవర్లలో 178/8 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. -
40 ఓవర్లలో కివీస్ స్కోరు 165/6
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 40 ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇలియట్(78), వెటోరి(9) క్రీజ్ లో ఉన్నారు. రాస్ టేలర్ 40, గప్టిల్ 15, విలియమ్సన్ 12 పరుగులు చేసి అవుటయ్యారు. మెక్ కల్లమ్, ఆండర్సన్, రోంచి డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, ఫాల్కనర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జాన్సన్, మ్యాక్స్ వెల్ చెరో వికెట్ తీశారు. -
ఇలియట్ సెంచరీ చేయొచ్చేమో!
ఆదివారం న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియాకు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ టీంలో క్రికెటర్ ఇలియట్ సెంచరీ చేస్తాడని క్రికెట్ అభిమానులు చెప్పారు. ఇలియట్ 67 పరుగులతో క్రీజులో ఉండగా ఇలియట్ సెంచరీ చేస్తాడా అంటూ సాక్షి క్రికెట్ అభిమానులను ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. మరికొందరు మాత్రం 100కు పైగా పరుగులే చేస్తాడని అన్నారు. ఇంకొందరు అన్ని పరుగులు చేయలేకపోవచ్చని తెలిపారు. కొందరు క్రికెట్ అభిమానులైతే చేయొచ్చు చేయలేకపోవచ్చు.. కొట్టే వరకు చెప్పలేం అని మిశ్రమ స్పందన తెలియజేశారు. ఏదేమైనా ప్రస్తుతం ఇలియట్ 73 పరుగులతో క్రీజులో ఉన్నాడు. -
కష్టాల్లో కివీస్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కష్టాల్లో కూరుకుపోయింది. 151 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. రోంచి డకౌటయ్యాడు. 150 పరుగుల స్కోరు వద్ద ఆండర్సన్(0), రాస్ టేలర్(40) వరుసగా అవుటడంతో కివీస్ షాక్ కు గురైంది. ఇలియట్(72) పోరాటం చేస్తున్నాడు. టేలర్ తో కలిసి నాలుగో వికెట్ కు 138 బంతుల్లో 111 పరుగులు జోడించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, ఫాల్కనర్ 2 రెండేసి వికెట్లు పడగొట్టారు. జాన్సన్, మ్యాక్స్ వెల్ చెరో వికెట్ తీశారు. -
ఐదో వికెట్ కోల్పోయిన కివీస్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 150 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. ఆండర్సన్ డకౌటయ్యాడు. ఇదో స్కోరు వద్ద అంతకుముందు రాస్ టేలర్(40) అవుటయ్యాడు. వీరిద్దరినీ ఫాల్కనర్ పెవిలియన్ కు పంపాడు. ఇలియట్(72) పోరాటం చేస్తున్నాడు. 36 ఓవర్లలో 150/5 స్కోరుతో కివీస్ ఆట కొనసాగిస్తోంది. టేలర్ తో కలిసి నాలుగో వికెట్ కు 138 బంతుల్లో 111 పరుగులు జోడించాడు. -
నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. 35 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఇలియట్(68), రాస్ టేలర్(40) పరుగులతో ఆడుతున్నారు. విలియమ్సన్ 12, గప్టిల్ 15 పరుగులుచేసి అవుటయ్యారు. మెక్ కల్లమ్ డకౌటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్, మ్యాక్స్ వెల్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. -
ఇలియట్ అర్ధ సెంచరీ
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ గ్రాంట్ ఇలియట్ అర్ధ సెంచరీ సాధించాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికి 9వ అర్థసెంచరీ. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించిన ఇలియట్ నేటి మ్యాచ్ లోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్ ను ఇలియట్, టేలర్ ఆదుకున్నారు. నిలకడగా ఆడుతూ వీరిద్దరూ నాలుగో వికెట్ కు 123 బంతుల్లో 94 పరుగులు జోడించారు. కివీస్ 33 ఓవర్లలో 134/3 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. ఇలియట్ 62, టేలర్ 35 పరుగులతో ఆడుతున్నారు. -
100 పరుగుల స్కోరు చేసిన కివీస్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 26.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ఇలియట్(44) అర్ధ సెంచరీ దిశగా సాగుతున్నాడు. రాస్ టేలర్ 21 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. విలియమ్సన్ 12, గప్టిల్ 15 పరుగులుచేసి అవుటయ్యారు. మెక్ కల్లమ్ డకౌటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్, మ్యాక్స్ వెల్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. -
కివీస్ పోరాడుతుంది.. కానీ గడ్డు పరిస్థితే
ఆదివారం జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ పోరులో కివీస్‌కు కొంత గడ్డు పరిస్థితి తప్పదని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో 39 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన కివీస్ పోరాడుతుందని మీరు భావిస్తున్నారా అంటూ క్రికెట్ అభిమానులను సాక్షి.. ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కివీస్ 200 పరుగులు చేయడంకూడా కష్టంగా ఉండొచ్చని అంటున్నారు. కివీస్ పోరాటం బాగానే చేస్తుందని, కానీ, ఆస్ట్రేలియానే గెలుస్తుందా అనే అనుమానం కూడా కలుగుతుందని చెప్పారు. తాము మాత్రం న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటామని చెప్పారు. మరికొందరేమో.. కివీస్ 280 నుంచి 300 పరుగులు చేయొచ్చని, విజయం తప్పకుండా సాధిస్తుందని అంటున్నారు. 23 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ప్రస్తుతం 83 పరుగులతో క్రీజులో ఉంది. -
20 ఓవర్లలో కివీస్ స్కోరు 66/3
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. టేలర్(17), ఇలియట్(15) క్రీజ్ లో ఉన్నారు. విలియమ్సన్ 12, గప్టిల్ 15 పరుగులుచేసి అవుటయ్యారు. మెక్ కల్లమ్ డకౌటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్, మ్యాక్స్ వెల్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. -
విజేత ఎవరో?
-
ఆసీస్‌ను కివీస్ చిత్తుచేయాలి
ఆదివారం జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం న్యూజిలాండ్‌కు ప్లస్ అవుతుందని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. మొదట ఎవరు బ్యాటింగ్ తీసుకుంటే వారిపై ఒత్తిడి తక్కువగా ఉంటుందని, ప్రత్యర్థిని తాము నిర్దేశించే లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా చేయోచ్చని అంటున్నారు. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ న్యూజిలాండ్‌కు ప్లస్ అవుతుందా అంటూ సాక్షి ఫేస్ బుక్ ద్వారా క్రికెట్ అభిమానులను ప్రశ్నించగా.. ఈ విధంగా స్పందించారు. ఈ రోజు న్యూజిలాండ్ టీం ఆస్ట్రేలియాను బెంబేలిత్తిస్తుందని, వారిపై విజయం సాధిస్తుందని అన్నారు. ఆసిస్‌ను న్యూజిలాండ్ చిత్తుచేయాలని తామంతా కోరుకుంటున్నామని అన్నారు. -
ఆస్ట్రేలియా తో న్యూజిలాండ్ ఢీ
-
50 పరుగుల స్కోరు చేసిన కివీస్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 15.3 ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేసింది. టేలర్(13), ఇలియట్(5) క్రీజ్ లో ఉన్నారు. విలియమ్సన్ 12, గప్టిల్ 15 పరుగులుచేసి అవుటయ్యారు. మెక్ కల్లమ్ డకౌటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్, మ్యాక్స్ వెల్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. -
మూడో వికెట్ కోల్పోయిన కివీస్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 39 పరుగులకే 3వికెట్లు కోల్పోయింది. విలియమ్సన్(12) మూడో వికెట్ గా అవుటయ్యాడు. మిచెల్ జాన్సన్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(15), మెక్ కల్లమ్(0) త్వరగా పెవిలియన్ కు చేరారు. వీరిద్దరినీ మ్యాక్స్ వెల్, స్టార్క్ అవుట్ చేశారు. -
33 పరుగులకు ఓపెనర్లు అవుట్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 33 పరుగులకు ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. గప్టిల్ 15 పరుగులు చేసి రెండో వికెట్ గా అవుటయ్యాడు. గప్టిల్ ను మ్యాక్స్ వెల్ అవుట్ చేశాడు. ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్.. స్టార్క్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. కివీస్ 12 ఓవర్లలో 38/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. -
తొలి పవర్ ప్లేలో కివీస్ స్కోరు 31/1
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ తొలి పవర్ ప్లేలో వికెట్ నష్టపోయి 231 పరుగులు చేసింది. గప్టిల్(14), విలియమ్సన్(11) క్రీజ్ లోఉన్నారు. డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ డకౌట్ అయ్యాడు. అతడిని స్టార్క్ బౌల్డ్ చేశాడు. -
'టాప్'కు చేరిన గప్టిల్
మెల్ బోర్న్: న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ తాజా వన్డే వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వ్యక్తిగత స్కోరు 9 పరుగులకు చేరగానే అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. 541 పరుగులతో టాప్ లో కొనసాగుతున్న శ్రీలంక బ్యాట్స్ మన్ కుమార సంగక్కరను రెండో స్థానానికి పడిపోయాడు. 547 పరుగులతో గప్టిల్ అందరికంటే ముందున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో గప్టిల్ 15 పరుగులు చేసి అవుటయ్యాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో గప్టిల్ డబుల్ సెంచరీ(237) సాధించాడు. వన్డే ప్రపంచకప్ లో అత్యధిక వ్యక్తిస్కోరు రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. అంతేకాదు ఈ ప్రపంచకప్ లో అత్యధిక ఫోర్లు (59) బాదిన ఘనత కూడా అతడిదే. సంగక్కర(57) రెండోస్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్(48) మూడో స్థానంలో నిలిచాడు. -
6 ఓవర్లలో కివీస్ స్కోరు 22/1
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోయి 22 పరుగులు చేసింది. గప్టిల్(14), విలియమ్సన్(4) క్రీజ్ లోఉన్నారు. డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ డకౌట్ అయ్యాడు. అతడిని స్టార్క్ బౌల్డ్ చేశాడు. -
కివీస్ కు ఎదురుదెబ్బ.. మెక్ కల్లమ్ డకౌట్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ డకౌట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆసీస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా, మెక్ కల్లమ్ నిరాశగా మైదానాన్ని వీడాడు. కివీస్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. న్యూజిలాండ్ 2 ఓవర్లలో 6/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. -
ఏడు.. ఒకటి... ఎవరిదో విక్టరీ
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. బ్రెండన్ మెక్ కల్లమ్, మార్టిన్ గప్టిల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆసీస్ పేసర్ స్టార్క్ తొలి బంతి వేశాడు. ఆసీస్ కు ఇది ఏడో ఫైనల్ కాగా, న్యూజిలాండ్ కు మొదటిది. కంగారూలు ఇప్పటికే నాలుసార్లు వరల్డ్ కప్ టైటిల్ గెల్చుకున్నారు. కివీస్ తొలిసారిగా ప్రపంచ చాంపియన్ కావాలన్న పట్టుదలతో కివీస్ ఉంది. -
హోరా హోరీనే.. కానీ.. కివీస్ 'విన్'
మెల్బోర్న్: ఆదివారం జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ పోరు హోరా హోరీగా జరగడం ఖాయమని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. ఈ పోరులో విజయం న్యూజిలాండ్‌నే వరిస్తుందని చెప్తున్నారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సాక్షి ఫేస్బుక్ ద్వారా న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా: ఫైనల్ పోరు హోరాహోరీగా జరుగుతుందనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించగా.. భారీగా స్పందించారు. టాస్ గెలిచి ఎవరు బ్యాటింగ్ తీసుకుంటే విజయం వారినే వరిస్తుందని పలువురు చెప్పారు. తాము న్యూజిలాండ్‌కే మద్దతిస్తామని, ఆ టీమే గెలవాలని కోరుకుంటూ ముందస్తుగా అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. చూస్తూ ఉండండి ఈరోజు న్యూజిలాండ్ గెలవడం ఖాయమని మరికొందరు అభిప్రాయపడ్డారు. -
బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆతిథ్య జట్లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ మరో ఆలోచనకు తావులేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. రెండు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని మెక్ కల్లమ్ చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా తమకు లభిస్తున్న మద్దతుతో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు. ఇదో గొప్ప ఫైనల్ మ్యాచ్ అవుతుందని పేర్కొన్నాడు. మైదానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులను తమ ఆటతో అలరిస్తామని ఆసీస్ మైఖేల్ క్లార్క్ చెప్పాడు. -
విజేత ఎవరో?
మెల్ బోర్న్: తుది సమరానికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిద్దమయ్యాయి. ప్రపంచకప్ అందుకునేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు బరిలోకి దిగుతున్నాయి. సొంతగడ్డపై సగర్వంగా ఐదోసారి వరల్డ్ టైటిల్ అందుకోవాలని ఆసీస్ భావిస్తోంది. తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవాలన్న కసితో కివీస్ ఉంది. ఈ రెండు జట్లలో విజేత ఎవరో నేటి సమరంలో తేలుతుంది. -
మీ కోసమే గుండె గెలవాలంటోంది
మరణానికి చేరువవుతూ ‘నా జీవితానికి ఇదే చివరి మ్యాచ్’ అంటూ గుండెలు పిండేసేలా మాట్లాడిన మార్టిన్ క్రో కోసం ఎలాగైనా గెలవాలని కోరుకుంటున్న న్యూజిలాండ్... మైదానంలోనే చివరి శ్వాస విడిచిన హ్యూస్ జ్ఞాపకాలు వెంటాడుతుండగా, సొంతగడ్డపై స్నేహితుడికి కప్‌ను అంకితం ఇవ్వాలనే ఆలోచనతో ఆస్ట్రేలియా. 18 ఏళ్ల పాటు అలుపెరుగకుండా జట్టు భారాన్ని మోసిన వెటోరికి టోర్నీని కానుకగా అందించాలనుకుంటున్న కివీస్... ప్రపంచకప్‌ను ఐదో సారి గెలుచుకొని తమ కెప్టెన్ క్లార్క్‌కు ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్న ఆసీస్. గతంలో పది ప్రపంచకప్‌లు జరిగాయి. ప్రతీ ఫైనల్లోనూ విజయం సాధించాలనే పట్టుదల, పోరాటం, వేదన, సంబరం చూశాం. కానీ ఈ ప్రపంచకప్ తుది పోరు మాత్రం వాటన్నింటికీ భిన్నం. మైదానంలో ఎలా ఆడినా క్రికెటర్లు కూడా మానవమాత్రులే. స్కోర్లు, గణాంకాలే కాదు... భావోద్వేగాలూ ఉంటాయ్. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టైటిల్ పోరు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య ఉద్వేగభరిత వాతావరణంలో జరగబోతోంది. ఇరు జట్ల ఆటగాళ్లూ మైదానంలో తమ ‘హృదయం’తో ఆడబోతున్నారు. సర్వశక్తులొడ్డి ఈ ప్రపంచకప్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని పరితపిస్తున్నారు. మెల్బోర్న్: విశ్వవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. 45 రోజుల వినోదం తర్వాత... ప్రపంచకప్‌లో భారీ క్లైమాక్స్‌కు రంగం సిద్ధమైంది. నేడు (ఆదివారం) జరిగే తుది పోరులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. టోర్నీలో ఏడు సార్లు ఫైనల్‌కు చేరిన ఘనత ఆసీస్‌ది కాగా... కివీస్ తమ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ సారి టోర్నీలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు నెగ్గిన కివీస్ సూపర్ ఫామ్‌లో కనిపిస్తుండగా... అటు ఆసీస్ సొంత మైదానంలో తిరుగులేనిదిగా కనిపిస్తోంది. లీగ్ దశలో కివీస్ జట్టు ఆసీస్‌పై గెలిచింది. టోర్నీలో వ్యూహ ప్రతివ్యూహాల్లో దూకుడు ప్రదర్శించిన ఇరు జట్ల కెప్టెన్లు తమ విజయంపై ధీమాగా ఉన్నారు. జోరు మీదున్న కివీస్ సొంత గడ్డపై చెలరేగుతూ అజేయ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన న్యూజి లాండ్ అదే జోరును ఇక్కడా కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో ఆ జట్టు అద్భుత ఆటతీరు కనబర్చింది. మెకల్లమ్, గప్టిల్, ఇలి యట్, అండర్సన్‌లతో పాటు ఈ మ్యాచ్‌లో టేలర్, విలియమ్సన్ కూడా చెలరేగితే కివీస్‌కు తిరుగుండదు. అయితే న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు మెల్బోర్న్ మైదానం సవాల్ విసురుతోంది. టోర్నీ ఆసాంతం న్యూజిలాండ్‌లోనే ఆ జట్టు అన్ని మ్యాచ్‌లు ఆడింది. అక్కడి చిన్న మైదానాలతో పోలిస్తే ఎంసీజీ చాలా పెద్దది. 2011నుంచి కివీస్ ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి పిచ్, స్వింగ్లాంటివి కూడా వారికి కొత్తగానే చెప్పవచ్చు. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ టోర్నీలో అత్యధిక వికెట్లతో (21) చెలరేగాడు. అతను ప్రతీ మ్యాచ్‌లో జట్టుకు శుభారంభం అందించగా... హెన్రీ సెమీస్ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ఆరంభంలో ఇంగ్లండ్‌పై 7 వికెట్లతో చెలరేగిన అనంతరం ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని టిమ్ సౌతీ ఈ మ్యాచ్‌లో రాణిం చాలి. ఇక కివీస్ తరఫున ఆఖరి మ్యాచ్ ఆటబోతున్న వెటోరిది ఈ ఫైనల్లో కీలక పాత్ర. ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు తె చ్చుకున్న వెటో రి... మధ్య ఓ వర్లలో కీలకం కాగలడు. ఆసీస్‌కు వేదిక బలం ఆస్ట్రేలియా జట్టు ఎంసీజీలో ఫైనల్ ఆడటంలో ఉన్న ప్రయోజనాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇక్కడ ఆడిన గత ఆరు మ్యాచ్‌లలోనూ ఆసీస్ నెగ్గింది. మై దానంపై ఆ జట్టుకు పూర్తి అంచనా ఉంది. ప్రపంచకప్‌లో సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాపై ఏదో మూలన కొన్ని అనుమానాలుండేవి. అయితే భారత్‌పై అద్భుత గెలుపుతో ఆ జట్టు వాటిని పటాపంచలు చేసింది. బ్యాటింగ్‌లో వార్నర్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును కొంత ఆందోళపరుస్తోంది. అయితే ఫించ్ ఫామ్‌లోకి రాగా, స్మిత్ రూపంలో సూపర్ బ్యాట్స్‌మన్ కొండంత అండ. మ్యాక్స్‌వెల్, వాట్సన్‌లు చెలరేగితే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. గొప్ప వన్డే బ్యాట్స్మన్లలో ఒకడిగా గుర్తింపు లేకపోయినా క్లార్క్ తన కెరీర్ ఆసాంతం మిడిలార్డర్లో బాగా రాణించాడు. తన ఆఖరి మ్యాచ్‌లో అతను కూడా గుర్తుంచుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు. టోర్నీలో 20 వికెట్లు తీసిన మిషెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆసీస్‌కు పెద్ద బలం. హాజల్‌వుడ్ నిలకడగా బౌలింగ్ చేస్తుండగా, బౌలింగ్ స్థానం మార్చిన తర్వాత జాన్సన్ చెలరేగిపోతున్నాడు. ఆ జట్టులో ప్రధాన స్పిన్నర్ లేకపోయినా ఈ టోర్నీలో ఇప్పటివరకు దాని వల్ల నష్టం జరగలేదు కాబట్టి జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. జట్ల వివరాలు (అంచనా) ఆస్ట్రేలియా: క్లార్క్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, స్మిత్, మ్యాక్స్‌వెల్, వాట్సన్, హాడిన్, ఫాల్క్‌నర్, జాన్సన్, స్టార్క్, హాజల్‌వుడ్ న్యూజిలాండ్: మెకల్లమ్ (కెప్టెన్), గప్టిల్, విలియమ్సన్, టేలర్, ఇలి యట్, అండర్సన్, రోంచి, వెటోరి, సౌతీ, బౌల్ట్, హెన్రీ. పిచ్, వాతావరణం పిచ్‌పై బౌన్స్ ఉన్నా ఈ ప్రపంచకప్ మొత్తం బ్యాటింగ్‌కు అనుకూలించింది. ఫైనల్‌కు కూడా ఇలాగే ఉండవచ్చు. పేస్‌కు పెద్దగా సహకరించకపోవచ్చు. ఆదివారం వర్ష సూచన లేదు. ఒక వేళ వాన వచ్చినా రిజర్వ్‌డే ఉంది. ‘సరైన సమయంలోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా. ఇంకా టెస్టులు ఆడగల సత్తా నాలో ఉంది కాబట్టి కొనసాగుతున్నా. ఒక జట్టును ఫేవరెట్ అనడాన్ని నేను నమ్మను. లీగ్ దశలో వారి చేతిలో ఓడాం. అయినా మా స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిస్తే కివీస్‌ను ఓడించగలమన్న నమ్మకముంది. నా తమ్ముడు (హ్యూస్) జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి’ -క్లార్క్, ఆసీస్ కెప్టెన్ ‘ఫైనల్లో మాకు 50-50 అవకాశం ఉందనే ప్రస్తుతం చెప్పగలను. ఎంసీజీ పెద్దదైనా మేం పరిస్థితులకు తగినట్లుగా ఆడతాం. సమష్టితత్వమే మా బలం. వెటోరి తన సగం జీవితాన్ని క్రికెట్‌కే అంకితం చేశాడు. క్రోను చూస్తే బాధగా ఉంది. ఆయనకు ఈ సమయంలో కాస్త ఆనందంతో పాటు ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటున్నాం. క్రికెట్‌ను ప్రేమించే భారత అభిమానులు ఈ మ్యాచ్‌లో మాకు మద్దతుగా నిలవాలని కోరుతున్నా’ -మెకల్లమ్, కివీస్ కెప్టెన్ ‘ఇకపై నా జీవితం క్రికెట్ చూసే అవకాశం ఇవ్వకపోవచ్చు. ఈ మ్యాచ్ జ్ఞాపకాలతో చివరి వరకూ సంతోషంగా బతికేస్తా’ - మార్టిన్ క్రో (న్యూజిలాండ్ దిగ్గజం క్రో క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన ఎంతో కాలం బతకరని వైద్యులు చెప్పారు) -
వరల్డ్ కప్ గతి మార్చిన ఆ 'ఏడు' మార్పులు!
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ సమరం మరో మ్యాచ్ తో ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ లో ఐసీసీ కొన్ని వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకున్న ఈ మార్పులు.. క్రికెట్ గతినే మార్చేశాయి. అవేంటో చూద్దామా.. 1. హాట్ స్పాట్.. గతంలో మనకు పరిచయమున్న హాట్ స్పాట్ నిబంధనను ఈ వరల్డ్ కప్ నుంచి తొలగించారు. బంతి బ్యాట్ కు తగిలినా, బ్యాట్స్ మెన్ కు తాకినా, ప్యాడ్ తాకినా హాట్ స్పాట్ నిబంధనతో కచ్చితంగా తెలిసేది. దీనికి ఇరువైపులా రెండు ఇన్ ఫ్రా కెమెరాలను అమర్చి బంతి ఎక్కడ తాకింది అనేది నిర్ణయించేవారు. ఇది అత్యధిక ఖర్చుతో కూడుకున్నదే కాకుండా అన్ని వేదికల్లో అమర్చడం కష్టంతో కూడుకున్న నేపథ్యంలో ఈ వరల్డ్ కప్ నుంచి హాట్ స్పాట్ విధానాన్ని తొలగించారు. 2. బాల్ స్పిన్ ఆర్పీఎమ్ (రొటేషన్ పెర్ మినిట్).. ఇది ఈ వరల్డ్ కప్ లోనే ప్రవేశపెట్టిన నూతన విధానం. బాల్ స్పిన్ ఆర్పీఎమ్ లో స్పిన్నర్ వేసే బంతి వేగాన్ని కచ్చితంగా తెలుసుకునే వీలుంది. బౌలర్ చేతి నుంచి బంతి విడుదలయ్యాక దాని పరిభ్రమణాన్ని తెలుసుకోవడానికి ప్రవేశపెట్టిన విధానం ఇది. ఈ విధానంతో టీవీ స్క్రీన్ లపై స్పిన్నర్ బంతిని ఏ రకంగా విసిరాడో సగటు క్రీడాభిమాని కూడా తెలుసుకోవచ్చు. 3. స్పైడర్ కేమ్.. ఇదొక సరికొత్త విధానం. గేమ్ ను విస్తారంగా వీక్షించేందుకు క్రికెట్ బ్రాడ్ కాస్టర్స్ ప్రవేశపెట్టిన విధానం. స్డేడియంలో పైభాగాన స్పైడర్ కేమ్ ను అమర్చి.. దీనికి గ్రౌండ్ లో కొన్ని కేబుల్స్ ను అనుసంధానం చేస్తారు. దీంతో మ్యాచ్ ను విశాలంగా వీక్షించే అవకాశం ఉంది. 4. పిచ్ విజన్.. క్రికెట్ అంటేనే బ్యాట్స్ మెన్ కు బౌలర్ కు జరిగే పోరాటం. బౌలర్ చేతి నుంచి రిలేజ్ అయ్యే బంతిని క్రీజ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ ఏరకంగా ఆడుతున్నడో టీవీ స్ర్కీన్ ల ద్వారా తెలుసుకునే వీలుంది. ఇది బ్యాట్స్ మెన్ కు శాపంగానే చెప్పవచ్చు. బ్యాట్స్ మెన్ వీక్ జోన్ ను అంచనా వేసి బంతులను సంధించడానికి బౌలర్ కు చక్కటి అవకాశం. 5. హాక్ ఐ బాల్ ట్రాకింగ్.. బౌలర్ బౌన్స్ , స్వింగ్ తో పాటు స్పీడ్ ను అంచనా వేయడానికి ప్రవేశపెట్టిన సాంకేతిక విధానం. దీనికి ఆరు కెమెరాలను ఫీల్డ్ లో అమర్చి బౌలర్ బంతి వేగాన్ని నిర్దేశిస్తారు. కెమెరాలు రికార్డు చేసిన డేటాను కంప్యూటర్ ద్వారా క్షణాల్లో త్రీడీ ఇమేజ్ గా మార్చడమే హాక్ ఐ బాల్ ట్రాకింగ్ విధానం. 6. రియల్ టైమ్ స్నికో... ఇదొక క్రికెట్ లో నమ్మకమైన విధానంగానే చెప్పవచ్చు. బంతి బ్యాట్ ను తాకిందో లేదో దీనిద్వారా తెలుసుకుంటారు. బంతి బ్యాటును తాకితే, వచ్చే శబ్దాన్ని ఇది తక్షణం రికార్డు చేస్తుంది. ఒకవేళ తాకకపోతే.. శబ్దం రాదు కాబట్టి గ్రాఫ్ లో విషయం తెలిసిపోతుంది. ఈ పద్దతిని గతంలో పలు రకాలుగా ఉపయోగించారు. డీఆర్ఎస్(నిర్ణయ సమీక్ష పద్ధతి)లో రియల్ టైమ్ స్నికోను వాడిన సంగతి తెలిసిందే. 7. ఎల్ఈడీ స్టంప్స్, బెయిల్స్.. స్టంప్ కెమెరాలు మనకు ఎప్పటినుంచో తెలిసినవే. అయితే ఎల్ఈడీ స్టంప్స్, బెయిల్స్ మాత్రం ఈ తాజా టోర్నమెంట్ లో ఐసీసీ తెరపైకి తీసుకొచ్చింది. దీంతో బెయిల్స్ పడినప్పుడు లైట్లు వెలిగి అంపైర్లు తమ నిర్ణయాన్ని తొందరగానే కాకుండా కచ్చితంగా వెలువరించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా రనౌట్ల విషయంలో ఇది బాగా ఉపయోగపడింది. -
ఇదే నా చిట్ట చివరి మ్యాచ్:మార్టిన్ క్రో
మెల్ బోర్న్:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం జరిగే ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచే తాను చూసే చివరి మ్యాచ్ కావచ్చని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ క్రో(51) స్పష్టం చేశాడు. గత రెండు సంవత్సరాలుగా ఫాలిక్యులర్ లింఫోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న క్రో రేపటి ఫైనల్ మ్యాచ్ ను తప్పకుండా వీక్షిస్తానన్నాడు. తన అస్థిరమైన జీవితంలో చాలా గేమ్ లను చూస్తూ ఆనందిస్తున్నానని తెలిపాడు. అయితే రేపటి ఫైనల్ మ్యాచే తనకు చివరి మ్యాచ్ కూడా కావచ్చన్నాడు. 'నాకు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచే చివరి మ్యాచ్ కావొచ్చు. రెండు సంవత్సరాల క్రితం ఈ వ్యాధి సోకింది. గత సంవత్సరం ఈ వ్యాధితో చాలా బాధపడ్డాను. ఈ క్యాన్సర్ వ్యాధికి కీమోథెరపీ కాకుండా సహజ సిద్ధమైన వైద్యాన్నే చేయించుకుంటున్నాను. ఈ వ్యాధితో బాధేపడేవాళ్లు 12 నెలల కంటే ఎక్కువగా బ్రతికే వాళ్లలో ఐదు శాతం మాత్రమేనని' క్రో ఆవేదన వెలిబుచ్చాడు. న్యూజిలాండ్ తరపున 1980 నుంచి 1990 వరకూ క్రికెట్ కు సేవలందించిన మార్టిన్ క్రో 77 టెస్ట్ మ్యాచ్ లు, 143 వన్డేలు ఆడాడు. ఆ సమయంలో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్ మెన్ లలో ఒకడిగా కూడా క్రో గుర్తింపు పొందాడు. -
మెల్ బోర్న్ ముచ్చట్లు
హైదరాబాద్: మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో ఆదివారం వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో ఆతిథ్య జట్లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలపడనున్న విషయం తెలిసిందే. ఇప్పటిదాకా మెల్ బోర్న్ లో జరిగిన రికార్డులు ఓసారి చూద్దాం. ఈ మైదానంలో.. ఇప్పటిదాకా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు 342. ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా చేసింది. ఇక్కడ నమోదైన అత్యల్ప స్కోరు 94. ఆసీస్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ నమోదు చేసింది. ఈ గ్రౌండ్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ షేన్ వార్న్ - 46 వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ అతి పెద్ ఛేజింగ్ 297 పరుగులు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆసీస్ నెలకొల్పింది. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్‌పై బెట్టింగ్ రాయుళ్లు భారీగా నమ్మకముంచారు. ఆస్ట్రేలియా తరఫున స్టీవెన్ స్మిత్‌పై, కివీస్ కెప్టెన్ మెక్ కల్లమ్పై భారీగా బెట్టింగ్‌లు కాశారు. అదే విధంగా డేవిడ్ వార్నర్, గప్టిల్ పైనా కొంత వరకు నమ్మకం ఉంచారు. అయితే సెమీస్‌లో రాణించిన ఎలియట్ పై ఆశలు లేనట్టే కనిపిస్తున్నాయి. -
కుమార ధర్మసేన అరుదైన ఘనత
మెల్ బోర్న్: శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రస్తుత అంపైర్ కుమార ధర్మసేన అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. 1996 వరల్డ్ కప్ ను గెలిచిన శ్రీలంక జట్టులో ధర్మసేన సభ్యుడు. ఆ ఫైనల్ టీంలో సభ్యుడిగా ఉన్న ధర్మసేన.. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ల మధ్య ఆదివారం జరగబోయే వరల్డ్ కప్ ఫైనల్ కు అంపైర్ గా వ్యవహరించనున్నాడు. ఇలా ఆటగాడిగా, అంపైర్ గా భాగమవుతున్న మొదటి వ్యక్తి ధర్మసేననే. దీంతో ధర్మసేన పేరిట సరికొత్త ఘనత ఆవిష్క్రతం కాబోతుంది.1996 ఫైనల్లో శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి వరల్డ్ కప్ ను కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో 10 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన ధర్మసేన 47 పరుగులిచ్చిఒక వికెట్ తీశాడు. -
'ఫైనల్లో హైరిస్క్ అప్రోచ్ ను కంటిన్యూ చేస్తాం'
మెల్ బోర్న్:వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా హైరిస్క్ అప్రోచ్ నే కంటిన్యూ చేస్తామని అంటున్నాడు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండెన్ మెకల్లమ్. గతంలో సెమీస్ వరకూ వచ్చి చతికిలబడిన సందర్భాలను మెకల్లమ్ గుర్తు చేసుకున్నాడు. వరల్డ్ కప్ 2015లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తూ ఫైనల్ కు వచ్చామని.. ఫైనల్లో కూడా అదే తరహా ఆటను కనబరిచి కప్ ను గెలవడానికి యత్నిస్తామన్నాడు. కప్ గెలవడానికి ఇరు జట్లకు 50-50 ఛాన్స్ ఉందన్నాడు. 1992 సెమీ ఫైనల్లో తమ ఆశలను పాకిస్థాన్ ఆటగాడు ఇంజమామ్ హక్ కొల్లగొట్టాడన్నాడు. ఈసారి మాత్రం కప్పు గెలవడానికి తుదికంటూ పోరాడతామన్నాడు. వేగంగా ఆడటమే తనకు తెలిసిన విద్యని ఒక ప్రశ్నకు సమాధానంగా మెకల్లమ్ తెలిపాడు. -
ఆసీస్, కివీస్ ఫైనల్ చేరాయిలా..
మెల్బోర్న్: వన్డే ప్రపంచ కప్ టైటిల్ రేసులో ఆతిథ్య జట్లే మిగిలాయి. ఆదివారం జరిగే గ్రాండ్ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆసీస్ ఐదోసారి ప్రపంచ కప్ సాధించాలని ఆరాటపడుతుండగా, కివీస్ తొలిసారి ప్రపంచ చాంపియన్ కావాలని ఉవ్విళ్లూరుతోంది. విజేత ఎవరన్నది ఆదివారం సాయంత్రం తేలనుంది. లీగ్ దశలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు రెండూ గ్రూపు-ఎలో ఆడాయి. కివీస్ ఆరు లీగ్ మ్యాచ్‌ల్లోనూ నెగ్గి గ్రూపు టాపర్‌గా నిలిచింది. ఆసీస్ నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కివీస్ చేతిలో ఆసీస్ ఓడగా, బంగ్లాదేశ్‌తో మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్ల ప్రస్థానం ఎలా సాగిందంటే.. న్యూజిలాండ్ లీగ్ దశ శ్రీలంకపై 98 పరుగులతో ఘన విజయం స్కాట్లాండ్పై 3 వికెట్లతో గెలుపు ఇంగ్లండ్‌పై 8 వికెట్లతో భారీ విజయం ఆస్ట్రేలియాపై 1 వికెట్ తేడాతో గెలుపు అప్ఘానిస్థాన్‌పై 6 వికెట్లతో విజయం బంగ్లాదేశ్‌పై 3 వికెట్లతో గెలుపు క్వార్టర్ ఫైనల్ వెస్టిండీస్‌పై 143 పరుగులతో ఘనవిజయం సెమీ ఫైనల్ దక్షిణాఫ్రికాపై 4 వికెట్లతో ఉత్కంఠ విజయం ఆస్ట్రేలియా లీగ్ దశ ఇంగ్లండ్‌పై 111 పరుగులతో ఘన విజయం వర్షం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు న్యూజిలాండ్ చేతిలో వికెట్ తేడాతో ఓటమి అప్ఘానిస్థాన్‌పై 275 పరుగులతో భారీ విజయం శ్రీలంకపై 64 పరుగులతో గెలుపు స్కాట్లాండ్పై 7 వికెట్లతో విజయం క్వార్టర్ ఫైనల్ పాకిస్థాన్‌పై 6 వికెట్లతో విజయం సెమీ ఫైనల్ భారత్‌పై 95 పరుగులతో భారీ గెలుపు -
న్యూజిలాండే కప్ గెలవాలట!
ప్రపంచ కప్‌లో టీమిండియా పోరాటం ముగిసింది. ఉపఖండం జట్లు శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాయి. టైటిల్ రేసులో ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మిగిలాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానుల మద్దతు ఎవరికి? ఆదివారం ఆసీస్, కివీస్‌ల మధ్య జరిగే ఫైనల్లో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? సాక్షి ఫేస్బుక్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి అభిప్రాయం కోరింది. క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో స్పందించి తమ అభిప్రాయలను పోస్ట్ చేశారు. దాదాపు 95 శాతం మంది అభిమానులు న్యూజిలాండ్‌కు మద్దతు పలకడం విశేషం. కివీస్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ చాంపియన్ కావాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచ కప్ గెలవాలని కివీస్ తొలిసారి జగజ్జేత కావాలని పోస్ట్ చేశారు. ఆసీస్ ఇప్పటికే నాలుగుసార్లు కప్ సొంతం చేసుకున్నందున కివీస్‌కు మద్దతు ప్రకటించారు. చాలాకొద్ది మాత్రం ఆస్ట్రేలియాకు ఓటేశారు. కంగారూలు మరోసారి కప్ గెలిచి ఫిలిప్ హ్యూజ్కు అంకితమివ్వాలని అభిప్రాయపడ్డారు. ఆసీస్ క్రికెటర్ హ్యూజ్ ఓ మ్యాచ్ సందర్భంగా తీవ్రంగా గాయపడి మరణించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, మరికొందరు అభిమానులు ఫైనల్ మ్యాచ్‌పై ఆసక్తి చూపలేదు. సెమీస్‌లో భారత్ ఓడినందున నిరుత్సాహంగా ఉందని పోస్ట్ చేశారు. -
ఫైనల్ పోరుకు అంపైర్లు వీరే
దుబాయ్: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్లను ఎంపిక చేశారు. ఆదివారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే ఫైనల్ సమరంలో కుమార్ ధర్మసేన (శ్రీలంక), రిచర్డ్ కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. శుక్రవారం ఐసీసీ ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇక రంజన్ మదుగల్లెను (శ్రీలంక) మ్యాచ్ రెఫరీగా ఎంపిక చేశారు. ఎరాస్మస్ను థర్డ్ అంపైర్‌గా, ఇయాన్ గుడ్ను రిజర్వ్ అంపైర్‌గా నియమించారు. -
అనుష్క చేసిన తప్పేంటి?: గంగూలీ
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో విరాట్ కోహ్లి వైఫల్యానికి అతడి ప్రియురాలు అనుష్క శర్మ కారణమంటూ వస్తున్న విమర్శలను మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తప్పుబట్టాడు. అపరిపక్వతతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డాడు. అనుష్కపై ట్విటర్ లో చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించేవిగా ఉన్నాయన్నాడు. ' అనుష్క చేసిన తప్పేంటి. ఇతర ఆటగాళ్ల కుటుంబ సభ్యుల మాదిరిగానే సిడ్నీ మ్యాచ్ చూడడానికి వచ్చింది. కోహ్లి వైఫల్యానికి ఆమెను నిందించడం సరికాదు. విమర్శకుల అపరిపక్వతకు ఇది నిదర్శనం' అని గంగూలీ వ్యాఖ్యానించాడు. కోహ్లి, అనుష్క ప్రేమించుకోవడం తప్పుకాదని అన్నారు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన వరల్డ్ కప్ సెమీస్ ఫైనల్లో కోహ్లి(1) విఫలమవడంతో అనుష్క శర్మపై ట్విటర్ లో విమర్శలు వెల్లువెత్తాయి. -
ఆ నిబంధన మార్చాలి: ధోని
మెల్ బోర్న్: వన్డేల్లో బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రవేశపెట్టిన 'నలుగురు ఫీల్డర్ల' నిబంధన మార్చాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. ' ఈ నిబంధన మార్చాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. క్రికెట్ చరిత్రలో అంతకుముందెన్నడూ వన్డేల్లో డబుల్ సెంచరీలు మనం చూడలేదు. ఈ మూడేళ్లలోనే మూడు ద్విశతకాలు (వాస్తవానికి ఆరు డబుల్ సెంచరీలు) నమోదమయ్యాయి' అని ధోని పేర్కొన్నాడు. 30- యార్డ్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్ల కంటే ఎక్కువ మంది ఉండరాదని ఐసీసీ నిబంధన తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనతో డాట్ బాల్స్ వేయాలని అందరూ కోరుతున్నారని ధోని వాపోయాడు. 11 మందిని సర్కిల్ లోపలేవుంచితే మరిన్ని డాట్ బాల్స్ పడతాయంటూ వ్యంగ్యంగా అన్నాడు. -
తుది పోటీ.. ఎవరో మేటి?
మెల్ బోర్న్: ఆతిథ్య దేశాలు అమీతుమి తేల్చుకునేందుకు సిద్దమయ్యాయి. వన్డే వరల్డ్ కప్ టైటిల్ కోసం ఇరుజట్లు ఆదివారం మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో పోటీ పడనున్నాయి. ప్రపంచవిజేత కావాలన్న తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చకోవాలని కివీస్ టీమ్ పట్టుదలతో ఉంది. ఈ మెగాటోర్ని తుది సమరంలో తమ ఆధిపత్యం కొనసాగించాలని కంగారూ టీమ్ భావిస్తోంది. టోర్ని ఆసాంతం జోరు మీదున్న కివీస్ తుదిపోరులోనూ పైచేయి సాధించి తొలిసారి సగర్వంగా కప్పు అందుకోవాలని తహతహ లాడుతోంది. లీగ్ దశలో పరాజయానికి కివీస్ పై ప్రతీకారం తీర్చుకుని టైటిల్ కైవసం చేసుకోవాలని క్లార్క్ సేన తలపోస్తోంది. సొంత గడ్డపై చెలరేగాలని ఆసీస్, చివరి సవాల్ అధిగమించాలని కివీస్ బరిలోకి దిగనున్నాయి. బలాబలాల విషయంలో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనబడుతున్నాయి. ఆల్ రౌండర్లతో అలరారుతున్నాయి. లీగ్ దశలో ఆసీస్, నాకౌట్ లో దక్షిణాఫ్రికాను ఓడించిన కివీస్ ముందు ఏ జట్టైనా నిలబడడం కష్టమే. మెక్ కల్లమ్, గప్టిల్, విలియమ్సన్, ఆండర్సన్, ఇలియట్ బ్యాటింగ్ లో సత్తా చాటారు. అయితే రాస్ టేలర్ ఫామ్ లోకి రాకపోవడం, కీపర్ రోంచి అనుకున్నంతగా రాణించకపోవడం కివీస్ కు మైనస్ గా మారింది. బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌతీ అనూహ్యంగా చెలరేగుతున్నారు. స్పిన్నర్ వెటోరి సైలెంట్ గా తన పని కానిస్తున్నాడు. సెమీస్ లో జట్టులో స్థానం దక్కించుకున్న పేసర్ హెన్రీ కూడా రాణించడం కివీస్ కు కలిసొచ్చింది. లీగ్ దశలో ఉత్కంఠపోరులో కివీస్ చేతిలో ఓడినప్పటికీ క్లార్క్ సేన తర్వాత స్థాయికి తగిన ఆటతీరుతో ఫైనల్ చేరింది. వార్నర్, ఫించ్, స్మిత్, మ్యాక్స్ వెల్, వాట్సన్ మెరిశారు. అయితే గాయం నుంచి కోలుకుని టీమ్ పగ్గాలు చేపట్టిన కెప్టెన్ క్లార్క్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఇప్పటివరకు అతడి అవసరం రాకుండానే విజయాలు దక్కాయి. ఫైనల్లో రాణించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్ లో కంగారూలకు వంక పెట్టడానికి లేదు. స్టార్క్, హాజిల్ వుడ్, జాన్సన్ త్రయం ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ఇక ఫాల్క్ నర్ బంతి, బ్యాటుతోనూ రాణిస్తున్నాడు. వీళ్లే కీలకం.. వార్నర్ vs మెక్ కల్లమ్ ఇరు జట్లలోనూ డాషింగ్ ఓపెనర్లు ఉన్నారు. వీరు చెలరేగితే భారీ స్కోరు ఖాయం. ముఖ్యంగా కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ చెలరేగితే అతడిని ఆపడం కష్టం. పిచ్ ఏదైనా, బౌలర్ ఎవరైనా బాదడం అతడి ప్రత్యేకత. వార్నర్ కూడా భారీ షాట్లు ఆడడంలో సిద్ధహస్తుడే. స్మిత్ vs గుప్టిల్ రెండు టీమ్ లలో స్మిత్, గప్టిల్ నిలకడగా రాణిస్తున్నారు. గప్టిల్ డబుల్ సెంచరీ తానెంటో నిరూపించాడు. ఇండియాతో జరిగిన సెమీఫైనల్లో స్మిత్ సూపర్ షోతో సత్తా చాటాడు. బౌల్ట్ vs స్టార్క్ వికెట్ల వేటలో పోటీ పడుతున్న వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తే విజయం వారివైపు మొగ్గే అవకాశముంది. సిక్సర పిడుగులు మ్యాక్స్ వెల్, షేన్ వాట్సన్, కోరె ఆండర్సన్, ఇలియట్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆట గమనాన్ని మార్చే హిట్టర్స్. -
'టాస్ ఓడిపోవడం ఎదురుదెబ్బ'
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ సెమీస్ పోరులో టీమిండియా పరాజయం పాలవడానికి టాస్ ఓడిపోవడం ప్రధాన కారణమని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. టాస్ గెలవకపోవడమే టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ అని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు అనుకూలంగా టాస్ పడడంతో తన హృదయ స్పందన ఆగినంత పనైందని పేర్కొన్నాడు. ముందుగా బ్యాటింగ్ చేయడం ఆసీస్ కు కలిసి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే అన్నాడు. భారత బౌలర్లు బాగానే బౌలింగ్ చేసినప్పటికీ బ్యాట్స్ మెన్ నుంచి మద్దతు కరువవడంతో మ్యాచ్ చేజారిందని విశ్లేషించాడు. -
అప్పుడూ ఇలాగే జరిగింది!
మెల్ బోర్న్: వన్డే ప్రపంచకప్ టైటిల్ వేటలో ఆతిథ్య జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నిలిచాయి. గత వరల్డ్ కప్ లోనూ ఇలాగే జరిగింది. ఆతిథ్య దేశాలైన ఇండియా, శ్రీలంక టైటిల్ కోసం పోటీపడ్డాయి. 2011 ప్రపంచకప్ ను భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించాయి. పాకిస్థాన్ కూడా సహా ఆతిథేయిగా వ్యవహరించాల్సి ఉన్నా 2009లో శ్రీలంక క్రికెట్ టీమ్ పై లాహోర్ లో తీవ్రవాదుల దాడి జరగడంతో ఆ దేశాన్ని ఆతిథ్యం నుంచి ఐసీసీ తప్పించింది. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ఆతిథ్య దేశాలు శ్రీలంక, భారత్ పోటీపడ్డాయి. ధోని నేతృత్వంలోని టీమిండియా జగజ్జేతగా నిలిచింది. సెమీస్ లో పాక్ ను ఓడించి భారత్ ఫైనల్ చేరింది. న్యూజిలాండ్ పై విజయం సాధించి శ్రీలంక ఫైనల్లోకి ప్రవేశించింది. ఒక్క ఇంగ్లండ్ మినహా అప్పుడు నాకౌట్ కు చేరిన జట్లే ఈ ప్రపంచకప్ లోనూ లీగ్ దశ దాటాయి. తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరిన బంగ్లాదేశ్ ను ధోని ఖంగుతినిపించింది. తాజా టైటిల్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆదివారం తేలుతుంది. -
స్మిత్ హీరో... కోహ్లి జీరో!
సిడ్నీ: ఛేజింగ్ స్టార్ చతికిలపడ్డాడు. అభిమానుల ఆశలను వమ్ము చేశాడు. కీలక పోరులో భారత భావి కెప్టెన్ విరాట్ కోహ్లి విఫలమవగా, ఆసీస్ భావి నాయకుడు స్టీవెన్ స్మిత్ సత్తా చాటాడు. 15 పరుగులకే వికెట్ కోల్పోయిన దశలో బ్యాటింగ్ దిగిన స్మిత్ సంయమనంతో బ్యాటింగ్ చేసిన జట్టుకు భారీ అందించాడు. రెండో వికెట్ విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకభూమిక పోషించాడు. అంతేకాదు ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపించాడు. డైరైక్ట్ త్రోతో జడేజాను రనౌట్ చేసి ఔరా అనిపించాడు. ఓపెనర్లు శుభారంభం అందించినా ఒత్తిడికి లోనయి కోహ్లి వికెట్ సమర్పించుకున్నాడు. ఛేజింగ్ లో చెలరేగి ఆడతాడని అభిమానులు పెట్టుకున్న అంచనాలను తల్లకిందులు చేశాడు. కనీస పోరాట పటిమ కనబరచకుండా ఈ స్టార్ బ్యాట్స్ మెన్ వికెట్ పారేసుకోవడం అభిమానులను నిరాశపరిచింది. టీమిండియా ఓటమికి కోహ్లి ఒక్కడినే బాధ్యుడిని చేయడం కరెక్టు కాకపోయినా... అతడు నిలదొక్కుకునివుంటే పరిస్థితి మరోలా ఉండేదనడంలో సందేహం ఏమాత్రం లేదు. ధోని వారసుడిగా చెలామణి అవుతున్న కోహ్లి కీలక మ్యాచుల్లో సత్తా చాటితేనే భారత్ కు చిరస్మరణీయ విజయాలు అందించగలుగుతాడు. -
తిట్టడం కరెక్ట్ కాదేమో!
ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడిపోవడం వల్ల ప్రపంచమేమీ అంతమైపోదు. ఎవరి జీవితాలూ మారిపోవు. కాకపోతే ‘అవసరమైతే ఉద్యోగమైనా మానేస్తాగానీ... ఆఫీస్‌కు రాను’ అని బాస్‌కి చెప్పి టీవీకి అతుక్కుపోయిన అభిమానుల పరిస్థితే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆఫీస్‌కు వెళ్లి ఏం చెప్పాలి? వరుసగా ఏడు మ్యాచ్‌లు గెలిచిన జట్టును ఒక్క మ్యాచ్ ఓడిపోగానే తిట్టడం కరెక్ట్ కాదేమో! ఇంత పెద్ద టోర్నీలో ఏదో ఒక మ్యాచ్ ఓడిపోవడం సహజం. అయితే అది లీగ్ దశలో ఏ వెస్టిండీస్ చేతిలోనో ఓడితే బాగుండేది. నెల రోజులకు పైగా మీ జోరును, మీ ఉత్సాహాన్ని చూసి ఇక కప్ మనదేనన్న ధీమాతో ఉన్న మాకు ఇదో పెద్ద షాక్. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడిపోయినా... ఆ పోరాటం మా మనసుల్ని దోచింది. కానీ మీరు ఆడిన తీరే నిరాశపరిచింది. పిచ్చి మ్యాచ్‌లన్నీ అద్భుతంగా గెలిచి, అసలైన మ్యాచ్కొచ్చేసరికి కనీసం పోరాడలేకపోయారు. బయటకు చెప్పుకోలేని వేదన. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 300 చేయడం ఊహించలేని విషయమేం కాదు. ఒక దశలో 400 కూడా బాదుతారేమో అని భయమేసినా... పాపం బౌలర్లు ఎలాగోలా కష్టపడి దూకుడును ఆపారు. చివర్లో ఆ 20 అదనంగా రాకుండా ఉంటే బాగుండేది. సరే... 329 పరుగులు ఛేజ్ చేయడం చాలా కష్టం. ప్రపంచకప్ సెమీఫైనల్ లాంటి మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో ఛేజ్ చేయడం అంటే అద్భుతమే. అయితే మన బ్యాటింగ్ బలం జగద్విదితం. ఓపెనర్లు ఇద్దరూ అద్భుతంగా ఆడిన తర్వాత ధావన్ కాస్త తొందరపడ్డాడు. కానీ ఆ కోహ్లికి ఏమైంది. ఏదో పని ఉన్నట్లు ఐదు నిమిషాల్లో వెనక్కి వెళ్లాల్సిన అవసరమేముంది. ఇక రోహిత్ కూడా తన వంతు పాత్ర పూర్తిగా పోషించలేకపోయాడు. సురేశ్ రైనా షార్ట్‌పిచ్ బలహీనత ప్రపంచానికి తెలిసిందే. ఈ టోర్నీలో తన బలహీనతను అధిగమించాడనుకుంటే... మళ్లీ అదే షార్ట్ బంతికి బలయ్యాడు. అక్కడితోనే ఓటమికి మానసికంగా సిద్ధమయ్యాం. అయినా ధోని ఉన్నాడని ఓ ఆశ. ఆ ఆశతోనే చివరి వరకూ టీవీ కట్టేయలేకపోయాం. పాపం అతను మాత్రం ఏం చేస్తాడు. మహామహులంతా పెవిలియన్‌లో కూర్చున్నాక... కొండంత లక్ష్యాన్ని క ళ్ల ముందుంచుకుని ఏం పోరాడతాడు. తను అవుట్ కావడంతోనే అంతా అయిపోయింది. ప్రపంచకప్ ఆరంభానికి ముందు ధోనికి కూతురు పుట్టింది. ఇప్పటివరకూ తను కనీసం కూతురి స్పర్శను ఆస్వాదించలేదు. కావాలంటే భార్య, కూతురిని ఆస్ట్రేలియా పిలిపించుకోలేడా? కానీ ఒక పెద్ద టోర్నీ మధ్యలో ఆట తప్ప మిగతా విషయాల మీదకు దృష్టి పోకూడదు. మరి కోహ్లికి ఏం తొందరొచ్చిందనో అనుష్క శర్మను పిలిపించుకున్నాడు. అక్కడికీ మ్యాచ్ మధ్యలో వస్తున్న యాడ్‌లో బామ్మ చెబుతూనే ఉంది. ‘నువ్వు ఆట మీద దృష్టిపెట్టు. షూటింగ్‌లు ఎందుకు’ అని. అయినా కోహ్లి చెవులకు అది ఎక్కలేదు. వెనక్కు ఇవ్వొద్దు (వోంట్ గివ్ ఇట్ బ్యాక్) అంటూ కోట్లాది మంది గొంతెత్తి అరుస్తున్నా... లక్షలాది మంది పనులు మానుకుని ప్రార్థనలు చేస్తున్నా.... మీరు ఓ మ్యాచ్ ముందే కప్‌ను ఇచ్చేశారు. ఓ వైపు కోపం వస్తోంది, మరోవైపు బాధేస్తోంది. కానీ ఏం చేయగలం. మహా అయితే మాలో మేం నాలుగు తిట్లు తిట్టుకుంటాం. కానీ క్రికెట్‌ను చూడటం అయితే ఆపలేం కదా. ఓ పది రోజులు ఆగితే మళ్లీ ఐపీఎల్ వస్తుంది. ఇప్పుడు ఎంత తిట్టుకున్నా... మళ్లీ ఆ సమయానికి ఆటోమేటిక్‌గా చేయి టీవీ రిమోట్ అందుకుంటుంది. -బాధతో ఓ భారత అభిమాని -
కప్ గెలిస్తే నచ్చిన చోటికి హనీమూన్...
సోదరికి ఇలియట్ హామీ వెల్లింగ్టన్: ప్రపంచకప్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో... గ్రాంట్ ఇలియట్ కీలక పాత్ర మరువలేనిది. అయితే జట్టు విజయంపై సంతోషంగానే ఉన్నా తుది పోరు జరిగే ఈనెల 29నే ఇలియట్ సోదరి వివాహం కూడా జరుగబోతోంది. దీంతో ఆ వివాహానికి హాజరుకాలేని పరిస్థితి తనది. అయితే కివీస్ ప్రపంచకప్ గెలిస్తే కోరుకున్న చోటికి హనీమూన్‌కు పంపిస్తానని చెల్లికి మాట ఇచ్చాడు. వాస్తవానికి ఈ పెళ్లి షెడ్యూల్ ఏడాదికి ముందే ఫిక్స్ అయ్యింది. అప్పుడు జట్టులో ఇలియట్కు చోటు లేదు. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు అవకాశం వస్తుందని కూడా తను అనుకోలేదు. అందుకే ఈ తేదీని ఖరారు చేశామని ఇలియట్ సోదరి కేట్ తెలిపింది. -
ధోనిసేనకు ప్రధాని ఓదార్పు
న్యూఢిల్లీ: ప్రపంచకప్ సెమీస్‌లో ఓటమిపాలైన భారత జట్టుకు ప్రధాని నరేంద్ర మోది సాంత్వన వచనాలు పలికారు. ఓడినా ప్రదర్శన పట్ల గర్వం వ్యక్తం చేశారు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. భారత జట్టు ప్రపంచకప్ మొత్తం చాలా బాగా ఆడింది’ అని ప్రధాని ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా భారత్ సెమీస్ పరాజయంపై ట్విట్టర్లో స్పందించారు. ‘భారత జట్టు బాగా ఆడింది. వచ్చే ప్రపంచకప్ కోసం బెస్టాఫ్ లక్. అద్భుతంగా ఆడిన ఆసీస్‌కు అభినందనలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.