
కంగారులకు కప్ కామన్!
క్రికెట్ వరల్డ్ కప్.. ప్రపంచానికి అత్యంత ఆసక్తి. క్రికెట్ వరల్డ్ కప్ వచ్చిందంటే అభిమానులకు పండుగ. ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకు దక్కినంత వన్డే వరల్డ్ కప్ ఆనందం మిగతా ఏ దేశాభిమానికి దక్కి ఉండకపోవచ్చు. అయితే క్రికెట్ చూసే సగటు ప్రేక్షకుడికి ఆస్ట్రేలియాకు కప్ రావడం సర్వ సాధారణమే అనే అభిప్రాయానికి రాకమానడు. ఇప్పటికే పలు దేశాలు వరల్డ్ కప్ ను ఒక్కసారైనా ముద్దాడాలని చూస్తుంటే.. ఆస్ట్రేలియా మాత్రం కప్ లను చేజిక్కించుకుంటూనే ఉంది. ఏడు సార్లు ఫైనల్ కు చేరిన ఆసీస్.. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ గా అవతరించి క్రికెట్ లో తమ సత్తాను రుజువు చేస్తూనే ఉంది.
1987 లో మొదలైన ఆసీస్ ప్రపంచకప్ విజయప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆస్ట్రేలియా ఎన్నిసార్లు కప్ గెలిచినా పెద్దగా సందడి ఏమీ ఉండదు. వన్డే వరల్డ్ కప్ 2015లో భాగంగా సొంతగడ్డపై జరిగిన ఫైనల్ మ్యాచ్ ను చూడటానికి క్రికెట్ ప్రేమికులు మాత్రమే వచ్చారు. కానీ ఆసీస్ కు చెందిన ప్రముఖ వ్యక్తులు ఎవరూ స్టేడియంలో కనిపించలేదు. స్వదేశంలో జరిగే మ్యాచ్ కాబట్టి నేటి మ్యాచ్ కు ఆసీస్ ప్రధాని టోనీ అబాట్ వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన మ్యాచ్ ను వీక్షించేందుకు రాలేదు. మరే ఏ దేశంలో అయినా వరల్డ్ కప్ జరిగిన ఫైనల్ మ్యాచ్ లకు ఆ దేశ ప్రధానులు రావడం ఇప్పటి వరకూ చాలానే చూశాం.
ఇంత వరకూ ఎందుకు?టీమిండియాతో సిడ్నీలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 70 శాతం భారత్ అభిమానులతో స్టేడియం నిండిపోతే.. ఆసీస్ కు అభిమానులు మాత్రం 30 శాతంగా ఉంది. అసలు జట్టుపై నమ్మకం ఉన్నప్పుడు స్టేడియంకు వచ్చి సందడి చేయాల్సిన అవసరం లేదనేది వారిని చూస్తే అర్ధం అవుతుంది కదా!