వాళ్లు కప్ గెలిచారు... వీళ్లు మనసులు గెలిచారు!
ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడి క్రికెట్ ప్రపంచకప్ గెలిచింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆటకు సంబంధించి వాళ్లకు ఫుల్ మార్కులు ఇచ్చేశాం. కానీ వాళ్ల ప్రవర్తన సంగతేంటి? ఫైనల్లో కంగారూల వెకిలి ప్రవర్తన ఇప్పుడు వాళ్ల దేశంలోనే చర్చగా మారింది.
ఫైనల్లో మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో గప్టిల్ అవుట్ కాగానే హాడిన్ బ్యాట్స్‌మన్ మొహం మీదే గ్లౌవ్స్‌తో చప్పట్లు కొట్టాడు. ఆ తర్వాత వెటోరి, ఇలియట్ అవుటైన సందర్భాల్లో ఆస్ట్రేలియన్లు నోరు అదుపు చేసుకోలేకపోయారు. ఈ ఇద్దరిని దారుణంగా తిట్టారట. ఇలాంటి సంఘటనలు ప్రపంచకప్‌లో జరగకుండా చూస్తామని ఐసీసీ మాట ఇచ్చింది. కానీ ఆస్ట్రేలియన్లకు ఇది పట్టలేదు. అయినా ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు... ఆసీస్ ప్రపంచకప్ గెలిచిందనా? గెలిచిన వాళ్లకు శిక్ష ఉండకూడదనా?
ఈ విషయంలో క్లార్క్ తెలివిగా వ్యవహరించానని అనుకుంటున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే... ‘నేను చూడలేదు’, ‘లైన్ క్రాస్ చేయలేదు’, ‘ఆస్ట్రేలియన్లు క్రికెట్ ఆడే విధానం’ అనే పాత మాటలనే వల్లె వేశాడు. ఒక పెద్ద మ్యాచ్‌లో తమ ప్రవర్తనతో ప్రత్యర్థి దేశ మద్దతుదారులను ఎంత గాయపరుస్తున్నామో ఆస్ట్రేలియా క్రికెటర్లు అర్థం చేసుకోలేకపోయారు. కేవలం తాము మాత్రమే దేశం కోసం ఆడతామని ఆస్ట్రేలియన్లు భావిస్తున్నట్లున్నారు. ప్రత్యర్థి క్రికెటర్లు కూడా ఓ దేశం కోసమే ఆడుతున్నారని, వాళ్లని గౌరవించాలని ఎందుకు అనుకోలేదో అర్థం కాలేదు.
ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ కంటే తపనతో ఆడిన జట్టు లేదు. కానీ వాళ్ల ఆటలో ఎక్కడా ఈ ‘రోత’ లేదు. దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో గెలిచాక మెకల్లమ్ ఓ మాట అన్నాడు. ‘తిట్టడం మా ఆటలో ఎప్పుడూ భాగం కాదు. దాని మీద ఎప్పుడూ దృష్టిపెట్టం కూడా’ అని చెప్పాడు. ఆ సెమీఫైనల్లో ఇలియట్ సిక్సర్ కొట్టగానే దక్షిణాఫ్రికా గుండె పగిలింది. స్టెయిన్ నేల మీద పడుకుండిపోయాడు. ఇలియట్ వచ్చి స్టెయిన్‌ను పైకి లేపి ఓదార్చిన తర్వాతే సహచరుల దగ్గరకు సంబరాలకు వెళ్లాడు. ఫైనల్లో క్లార్క్ అవుటయ్యే సమయానికి న్యూజిలాండ్ మ్యాచ్ దాదాపుగా ఓడిపోయింది.
ఆ సమయంలోనూ నలుగురు న్యూజిలాండ్ క్రికెటర్లు క్లార్క్ దగ్గరకు వచ్చి అభినందించి వెళ్లారు. 18 ఏళ్ల పాటు న్యూజిలాండ్ క్రికెట్‌కు సేవలు అందించిన వెటోరిని ఏ ఒక్క ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా అభినందించాడా? లేదు. నిజానికి దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ గెలిచిన మ్యాచ్‌లో అక్కడ కివీస్ బదులు ఆసీస్ ఆటగాళ్లు ఉండి ఉంటే... ఇలియట్ తరహాలో ఎవరైనా ప్రత్యర్థిని ఓదార్చేవారా? కచ్చితంగా లేదు. ఆస్ట్రేలియన్ల మనస్తత్వం అది కాదు. న్యూజిలాండ్ ఆటగాళ్లు చాలా మృదుస్వభావులు.
ఇదే ప్రపంచకప్‌లో ఆక్లాండ్‌లో లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆ సమయంలో కివీ ఆటగాళ్లు తమ సహజ శైలిలో ప్రత్యర్థి బాగా ఆడినందుకు అభినందించారు. కానీ దీనిని కంగారూలు జీర్ణించుకోలేకపోయారట. ‘ఆ మ్యాచ్‌లో మేం ఓడిపోయాక వాళ్లు చూపించిన మంచితనం మమ్మల్ని హర్ట్ చేసింది. ఫైనల్లో గెలిచినా వాళ్లు అంతే పొందికగా వచ్చి మమ్మల్ని అభినందిస్తారు. దానిని తట్టుకోవడం మా వల్ల కాదు.
అందుకే ఫైనల్‌కు ముందు టీమ్ మీటింగ్‌లో నేను ఓ విషయం స్పష్టం చేశా. ‘మనం వాళ్లపై ఎంత దారుణంగా మాటల యుద్ధం చేస్తే అంత మంచిది’ అని సూచించా’ అని కప్ గెలిచాక హాడిన్ చెప్పడం ఆస్ట్రేలియన్ల మనస్తత్వాన్ని సూచిస్తోంది. ఫైనల్లో మెకల్లమ్ స్ట్రయికింగ్‌కు రాగానే హాడిన్ వచ్చి తిట్టి వెళ్లాడు.
ఫైనల్ ముగిశాక మీడియా సమావేశంలో మెకల్లమ్‌ను... మీరు రిటైర్ అవుతున్నారా? అని మీడియా ప్రశ్నించింది. దీనికి మెకల్లమ్ చెప్పిన సమాధానం... ‘ఈ రోజు ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడి కప్ గెలిచింది. ప్రతి దేశంలో ఇదే హెడ్‌లైన్ కావాలి. నా రిటైర్‌మెంట్ లాంటి వార్త గురించి ఈ సందర్భంలో రాయడం అనవసరం. దయచేసి ఇది రెండు రోజుల తర్వాత మాట్లాడుకుందాం’ అని చెప్పాడు. ఆస్ట్రేలియా కప్ గెలిచి ఉండొచ్చు. కానీ న్యూజిలాండ్ తమ ప్రవర్తనతో అభిమానుల మనసులు గెలిచింది.
- సాక్షి క్రీడావిభాగం