ఐసీసీ అధ్యక్షుడి రాజీనామా
ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం ఉదయం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు అద్భుతమైన ఫామ్ను కనబరిచి క్వార్టర్స్ వరకు వెళ్లింది. అయితే క్వార్టర్స్లో టీమిండియా చేతిలో చిత్తయిన విషయం తెలిసిందే. ఐదోసారి విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కు వరల్డ్ కప్ ట్రోఫీని ఎవరు ఇవ్వాలన్న విషయంలో వివాదం రేగింది. తనను కనీసం ఆహ్వానించకపోవడంతో కమల్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఐసీసీ రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించారని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని, ఇందులో రెండో ఆలోచనకు తావులేదని ఆయన మీడియాకు స్పష్టం చేశారు.
ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ కు, ముస్తాఫా కమల్ కు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. మెల్ బోర్న్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసన్ తానే స్వయంగా ట్రోఫీని ఆస్ట్రేలియా కెప్టెన్ కు అందించారు. భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో అంపైరింగ్ లోపాల వల్లే బంగ్లా ఓడిందన్న వ్యాఖ్యలు కూడా కమల్ చేసినట్లు వినవచ్చింది. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసన్.. నిబంధనలను తోసిరాజని.. ట్రోఫీని అందించే కార్యక్రమానికి తానే వెళ్లారు. ఇదే ముస్తఫా కమల్ మనస్తాపానికి కారణమైందని చెబుతున్నారు.