'ఆ పదవికి వేరే వ్యక్తిని ఎంపిక చేయండి'
కరాచీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అధ్యక్ష పదవిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ నజమ్ సేథీ వెనక్కి తగ్గాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో సీనియర్ సభ్యుడిగా ఉన్న నజమ్.. ఐసీసీ అధ్యక్ష పదవికి సంబంధించిన నామినేషన్ ను తాజాగా ఉపసంహరించుకున్నాడు. ఐసీసీ అధ్యక్షునిగా అతని నియామకం దాదాపుగా ఖరారైన తరుణంలో దానిపై నజమ్ విముఖత వ్యక్తం చేశాడు. ఆ పదవికి మరో పాకిస్థాన్ టెస్ట్ క్రికెటర్ ను నామినేట్ చేయాలని పీసీబీకి విన్నవించాడు. ఈ తన అకస్మిక నిర్ణయం ప్రస్తుతానికి ప్రభావం చూపినా.. తన స్థానంలో మరో వ్యక్తిని కూర్చోబెడితే బాగుంటుదని బోర్డుకు స్పష్టం చేశాడు. దీంతో పాటు ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ కూడా నజమ్ సేథీ ఓ లేఖ రాశాడు. తన నిర్ణయాన్ని ఆలస్యంగా చెబుతున్నందుకు క్షమించమని ఐసీసీని అభ్యర్థించాడు.కానీ తాను తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ సభ్యులు అంతా ఆమోదిస్తారని భావిస్తున్నట్లు నజమ్ పేర్కొన్నాడు.
అంతకుముందు ఐసీసీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న ముస్తఫా కమల్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం నజమ్ సేథీ పేరు తెరపైకి వచ్చింది. ఆ పదవికి తన నియామకం దాదాపు పూర్తయిన క్రమంలో నజమ్ నామినేషన్ ను ఉపసంహరించుకున్నాడు.