![IPL Digital Rating Was 130 Million And PSL Got More Than 150 Million Said Najam Sethi - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/20/Untitled-2.jpg.webp?itok=32MQyE6M)
ఐపీఎల్‌ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు నజమ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో పోలిస్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ సూపర్ సక్సెస్ అంటూ నిరాధారమైన కామెంట్స్ చేశాడు. పీఎస్‌ఎల్ 2023 సీజన్ ముగిసిన అనంతరం పీసీబీ చీఫ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్‌కు మెరుగైన డిజిటల్ రేటింగ్ ఉందని గొప్పలు పోయాడు.
డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికగా పీఎస్‌ఎల్ 8వ ఎడిషన్‌ను 150 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారని, ఐపీఎల్-2022 సీజన్‌ను కేవలం 130 మిలియన్ల డిజిటల్ రేటింగ్ మాత్రమే దక్కిందని నిరాధారమైన లెక్కలు చెబుతూ జబ్బలు చరుచుకున్నాడు. ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్ ఎంతో గొప్పదో చెప్పడానికి ఇదొక్క విషయం చాలంటూ బడాయి ప్రదర్శించాడు.
పాక్‌లో జరగాల్సిన 2023 ఆసియా కప్‌లో పాల్గొనేది లేదని భారత్ కరాఖండిగా తేల్చి చెప్పిన నేపథ్యంలో సేథీ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై అంతర్జాతీయ క్రికెట్ సమాజం అసహనం వ్యక్తం చేస్తుంది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ, ఇలాంటి నిరధారమైన వ్యాఖ్యలు చేసి అంతంతమాత్రంగా ఉన్న ప్రతిష్టను మరింత దిగజార్చుకోవద్దంటూ నెటిజన్లు పీసీబీకి చురకలంటిస్తున్నారు.
ఇదిలా ఉంటే, మార్చి 18న ముగిసిన పీఎస్‌ఎల్ 2023 సీజన్‌లో లాహోర్ ఖలందర్స్ విజేతగా నిలిచింది. షాహీన్ అఫ్రిది నేతృత్వంలో ఖలందర్స్ వరుసగా రెండో సీజన్‌లో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. పీఎస్‌ఎల్ 2022 సీజన్‌లో ఎదురైన ప్రత్యర్ధి ముల్తాన్ సుల్తాన్స్‌నే ఖలందర్స్ మళ్లీ ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో సుల్తాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి పరుగు తేడాతో ఓటమిపాలైంది. రన్నరప్‌గా నిలిచన సుల్తాన్స్‌కు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment