
ఆసియా కప్-2023 ఆతిధ్యం విషయమై గతకొద్ది రోజులుగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా భారత్.. పాక్‌లో అడుగుపెట్టేది లేదని తెగేసి చెప్పింది. దీంతో మరో ఆప్షన్ లేని పాక్.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై (యూఏఈ) నిర్వహిస్తామని ప్రతిపాదిస్తూనే, వన్డే ప్రపంచకప్ కోసం తాము కూడా భారత్‌లో పర్యటించమని మెలిక పెట్టింది. తాము భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే, టీమిండియా సైతం పాక్‌లో ఆసియా కప్ మ్యాచ్‌లు ఆడాలని ప్రకటించింది.
ఈ మధ్యలో ఏసీసీ మిగతా సభ్య దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్‌లు.. యూఏఈలో ఆసియా కప్ జరిగే సమయానికి ఎండలు అధికంగా ఉంటాయని, అందుకే తాము యూఏఈలో అడుగపెట్టమని ప్రకటించాయి. ఈ సందిగ్థ పరిస్థితుల్లో పీసీబీ చీఫ్ నజమ్ సేథి సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. ఆతిథ్య హక్కులు తమవే కాబట్టి, వేదికను ఎంచుకునే అధికారం తమకే ఉంటుందని చెబుతూ.. ఆసియాకప్-2023ను పాక్, యూఏఈ, శ్రీలంకల్లో కాకుండా ఇంగ్లండ్‌లో నిర్వహిస్తే బాగుంటుందని అన్నాడు. పీసీబీ బాస్ సరికొత్త ప్రతిపాదనపై ఏసీసీ సభ్య దేశాలు ఏరకంగా స్పందిస్తాయో వేచి చూడాలి.
చదవండి: పాక్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్