టీమిండియాపై పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశాడు. భద్రతా కారణాల కారణంగా పాక్‌లో జరగాల్సిన ఆసియా కప్-2023లో ఆడేందుకు టీమిండియా నిరాకరించిన నేపథ్యంలో జునైద్ ఖాన్ అవాక్కులు చవాక్కులు పేలాడు. భారత క్రికెట్ జట్టుతో పాటు బీసీసీఐపై కూడా ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ నోరు పారేసుకున్నాడు. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండటానికి టీమిండియా క్రికెటర్లేమైనా ఏలియన్సా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.
ఇతర దేశాల క్రికెటర్లకు (శ్రీలంక, బంగ్లాదేశ్) లేని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ టీమిండియాకే ఎందుకని ప్రశ్నించాడు. ఐసీసీ ఈ విషయంలో జోక్యం చేసుకుని టీమిండియాను పాక్‌లో పర్యటించేలా చేయాలని, పాకిస్తాన్ లేని క్రికెట్ ఊహించడానికి కూడా అసాధ్యమని అన్నాడు. ప్రస్తుతం పాక్‌లో పరిస్థితులు మునుపటికంటే చాలా మెరుగయ్యాయని.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జట్లు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యటించాయని గుర్తు చేశాడు.
అగ్రశ్రేణి జట్లు పాక్‌లో పర్యటించినప్పుడు భారత్‌కు ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించాడు. పాక్ చిన్న జట్టేం కాదని, ఇటీవలే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌కు కూడా చేరిందని గొప్పలు పోయాడు. జునైద్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా అభిమానులు సైతం ధీటుగానే స్పందిస్తున్నారు. వారి దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను (ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత జరుగుతున్న హింసాకాండ) చూపిస్తూ జునైద్‌కు గట్టిగా కౌంటర్లిస్తున్నారు. 33 ఏళ్ల జునైద్.. పాక్ తరఫున 22 టెస్ట్‌లు, 76 వన్డేలు, 9 టీ20 ఆడాడు. టెస్ట్‌ల్లో 71, వన్డేల్లో 110, టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు.
కాగా, టీమిండియా పాక్‌లో పర్యటించేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తటస్థ వేదికగా యూఏఈని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీంతో సగం మ్యాచ్‌లు యూఏఈలో(భారత్ ఆడే మ్యాచ్‌లు), సగం మ్యాచ్‌లు తమ దేశంలో నిర్వహించేందుకు పాక్ అయిష్టంగా ఒప్పుకుంది. వేదిక విషయంలో ప్రధాన జట్లైన భారత్, పాక్ అంగీకారం తెలపడంతో టోర్నీ సజావుగా సాగుతుందని అంతా ఊహించారు.
అయితే, తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు యూఏఈలో మ్యాచ్‌లు ఆడేందుకు ససేమిరా అంటుండటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సెప్టెంబర్ నెలలో యూఏఈలో ఎండలు భయానకంగా ఉంటాయని ఈ రెండు దేశాలు సాకుగా చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యలో యూఏఈ, పాక్‌లలో కాకుండా టోర్నీ మొత్తాన్ని శ్రీలంకలో నిర్వహించే మధ్యేమార్గ ప్రతిపాదనను ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటున్నట్లు సమాచారం.
చదవండి: పాక్‌లో పర్యటిస్తున్న టీమిండియా సేఫ్.. వదంతులు నమ్మవద్దు
Comments
Please login to add a commentAdd a comment