
ముంబై: భారత్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ అయిన జై షాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా సన్మానించనుంది. రేపు జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఐసీసీ నూతన చైర్మన్‌ను సన్మానించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. బోర్డు సెక్రటరీగా ఉన్న జై షా గతేడాది ఆగస్టులో జరిగిన ఐసీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అతిపిన్న వయసులో ఐసీసీ చైర్మన్ అయిన క్రికెట్ పరిపాలకుడిగా ఘనత వహించారు. అయితే మాజీ చైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీ కాలం నవంబర్ 30 వరకు ఉండటంతో జై షా కాస్త ఆలస్యంగా డిసెంబర్ 1న పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబర్ నుంచి బోర్డు కార్యదర్శిగా, 2021 జనవరి నుంచి ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) చైర్మన్‌గా కీలకపాత్ర పోషించిన జై షా ఇప్పుడు ఐసీసీ పీఠాన్ని అధిరోహించారు. నిజానికి బీసీసీఐ ఆఫీస్ బేరర్ కాకపోవడంతో ఎస్‌జీఎంలో జై షా పాల్గొనేందుకు వీల్లేదు. అయితే మీటింగ్‌కు ముందు లేదంటే తర్వాత ఆయన్ని
సత్కరించే అవకాశముంది.