Jay Shah To Become BCCI President Says Reports: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజ్యాంగంలో సవరణలకు ఆమోదం తెలుపుతూ నిన్న (సెప్టెంబర్ 14) సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుత పాలకమండలికి మరో విడత పదవులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది. సుప్రీం తాజా తీర్పుతో ఆఫీస్ బేరర్లు వరుసగా 12 ఏళ్ల పాటు (స్టేట్ అసోసియేషన్‌లో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లు) పదవుల్లో కొనసాగే వెసలుబాటు లభించింది. దీంతో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా మరో మూడేళ్ల పాటు (వీరి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది) పదవుల్లో కొనసాగేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ఇవాళ మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్నాడని, ఆ స్థానంలో ఉన్న గంగూలీ ఐసీసీ అధ్యక్ష రేసులో ఉండబోతున్నాడని పలు ప్రముఖ వెబ్‌సైట్‌లు కథనాలను ప్రసారం చేశాయి. జై షాకు బీసీసీఐ పట్టం కట్టేందుకు 15 రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లు సంసిద్ధంగా ఉన్నట్లు సదరు వెబ్‌సైట్‌లు పేర్కొన్నాయి.
మరోవైపు ఐసీసీ చైర్మన్‌గా గ్రెగ్ బార్ల్కే (న్యూజిలాండ్) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండడంతో ఆ స్థానంలో గంగూలీని కూర్చొబెట్టేందుకు సన్నాహకాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఒకవేళ గంగూలీ ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైతే క్రికెట్‌లో అత్యున్నత పదవి చేపట్టబోయే 5వ భారతీయుడిగా రికార్డుపుటల్లోకెక్కుతాడు. గతంలో ఐసీసీ చైర్మన్లుగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జగ్మోహన్ దాల్మియా, ఆతరువాత మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్ పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment