'ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ కు ఇదే సరైన సమయం'
హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ ల క్రికెట్ సిరీస్ జరగాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఇండియా సిమెంట్స్ -హైదరాబాద్ ఎలెవ్ జట్ల మధ్య జరుగుతున్న మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో భాగంగా ఇక్కడ విచ్చేసిన జహీర్ అబ్బాస్ మీడియాతో మాట్లాడుతూ తన ఆకాంక్షను వెల్లడించారు. భారత-పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ సిరీస్ జరగడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. పొరుగు దేశాలైన ఇండియా-పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ సిరీస్ జరగాలని యావత్ ప్రపంచం కోరుకుంటుందన్నాడు.
' రెండు దేశాల క్రికెట్ సిరీస్ కోసం నాతో పాటు ప్రపంచం కూడా ఎదురుచూస్తోంది. అందుకు భారత్ సంసిద్ధంగా ఉంటే.. ఇదే సరైన సమయం'అని అన్నారు. భారత-పాకిస్థాన్ ల సిరీస్ కోసం ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఉన్నట్లు ఐసీసీ సీఈవో తనతో చెప్పినట్లు అబ్బాస్ పేర్కొన్నారు. అందుకోసం తన నుంచి ఏమైనా సాయం కావాల్సి వస్తే తప్పకుండా అందిస్తానని జహీర్ అబ్బాస్ తెలిపారు. ఇప్పటికే ఇరు దేశాల క్రికెట్ సిరీస్ కోసం ఐసీసీ ప్రెసిడెంట్ గా సాయం అందించాలని అబ్బాస్ ను పీసీబీ కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోఅబ్బాస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో భాగంగా విజేతలకు ట్రోఫీలు బహుకరించేందుకు జహీర్ అబ్బాస్ ను హెచ్ సీఏ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) ఆహ్వానించింది.