Zaheer Abbas
-
ఐసీయూలో పాక్ దిగ్గజ క్రికెటర్
పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు సమాచారం. లండన్‌లోని సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలిసింది. నెల కిత్రం పని నిమిత్తం దుబాయ్ నుంచి లండన్‌కు వచ్చిన జహీర్ అబ్బాస్ కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. కరోనా నుంచి కోలుకున్న ఆయన మూడు రోజుల క్రితం చాతిలో నొప్పి ఉందని చెప్పడంతో లండన్‌లోని సెయింట్ మేరీస్ ఆసుపత్రికి తరలించారు. న్యుమోనియాతో బాధపడుతున్న అబ్బాస్‌కు వైద్యులు డయాగ్నసిస్ నిర్వహించారు. ''ప్రస్తుతం జహీర్ అబ్బాస్ పరిస్థితి బాగానే ఉందని.. అయితే ఊపిరి తీసుకోవడంలో కాస్త ఇబ్బంది ఉండడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచామని.. త్వరలోనే ఆయన కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తునట్లు'' వైద్యులు తెలిపారు. కాగా పాక్ దిగ్గజ క్రికెటర్ పరిస్థితిపై క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. మహ్మద్ హఫీజ్, అలన్ విల్కిన్స్ సహా పలువురు క్రికెటర్లు, అభిమానులు జహీర్ అబ్బాస్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇక పాకిస్తాన్ క్రికెట్లో దిగ్గజ ఆటగాడిగా పేరు పొందిన జహీర్ అబ్బాస్ 1969లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. పాక్ స్టార్ బ్యాటర్‌గా పేరు పొందిన జహీర్ అబ్బాస్ 72 టెస్టుల్లో 5062 పరుగులు, 62 వన్డేల్లో 2752 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 459 మ్యాచ్‌లాడిన జహీర్ అబ్బాస్ 34, 843 పరుగులు చేశాడు. ఇందులో 108 సెంచరీలు, 158 అర్థసెంచరీలు ఉండడం విశేషం. ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఒక టెస్టు, మూడు వన్డేలకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు. 2020లో జాక్వెస్ కలిస్, లిసా సాత్లేకర్లతో సంయుక్తంగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. Get well soon Zed Bhai. You are an asset of our country. All the Duaas and Prayers for your health🤲🏻 #GetWellSoon pic.twitter.com/6EDn1SFmy2 — Waqar Younis (@waqyounis99) June 22, 2022 Wishing speedy recovery & complete health to Zaheer Abbas sb. Get well soon. Aameen 🤲🏼 https://t.co/ld5VH2nj7f — Mohammad Hafeez (@MHafeez22) June 21, 2022 చదవండి: Ben Stokes: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. కెప్టెన్‌కు అస్వస్థత 'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్ అంట'.. ఇలాంటి బౌలింగ్ చూసుండరు! -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో కలిస్, లీసా, జహీర్ అబ్బాస్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మరో ముగ్గురు మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వస్‌కలిస్... అలనాటి పాకిస్తాన్ డాషింగ్ బ్యాట్స్‌మన్, మాజీ సారథి జహీర్ అబ్బాస్... ఆస్ట్రేలియా మహిళల జట్టు మాజీ కెప్టెన్ లీసా స్థాలేకర్ కొత్తగా ఈ జాబితాలో చేరినట్లు ఆదివారం ఐసీసీ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో షాన్ పొలాక్‌తో పాటు భారత దిగ్గజం సునీల్ గావస్కర్ పాల్గొని ఈ ముగ్గురికీ శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాఫ్రికా తరఫున 1995– 2014 మధ్య కాలంలో 166 టెస్టులు, 328 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌ల్లో కలిస్ ప్రాతినిధ్యం వహించాడు. సఫారీల తరఫున టెస్టుల్లో అత్యధికంగా 13,289 పరుగులు చేసి 292 వికెట్లు తీశాడు. వన్డేల్లో 11,579 పరుగులు సాధించి 273 వికెట్లు పడగొట్టాడు. గ్రేమ్ పొలాక్, బ్యారీ రిచర్డ్స్, డొనాల్డ్ తర్వాత ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు పొందిన నాలుగో దక్షిణాఫ్రికా క్రికెటర్ కలిస్. ‘ఏదో ఆశించి నేను ఆట ఆడలేదు. నా జట్టును గెలిపించేందుకు నిజాయితీగా ఆడాను. కానీ ఈరోజు ఐసీసీ గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది’ అని 44 ఏళ్ల కలిస్ వ్యాఖ్యానించాడు. మహిళల వన్డే ప్రపంచకప్ (2005, 2013), టి20 ప్రపంచ కప్ (2010, 2012) గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యురాలైన 41 ఏళ్ల లీసా స్థాలేకర్... భారత్‌లోని పుణే నగరంలో పుట్టి ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం పొందిన ఐదో మహిళా క్రికెటర్ లీసా. తన కెరీర్లో 8 టెస్టులు ఆడి 416 పరుగులు చేసి, 23 వికెట్లు తీసింది. 125 వన్డేలు ఆడి 2,728 పరుగులు చేసి 146 వికెట్లు పడగొట్టింది. 54 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన లీసా 769 పరుగులు చేసి 60 వికెట్లు తీసింది. హనీఫ్ మొహమ్మద్, ఇమ్రాన్ ఖాన్, జావెద్ మియాందాద్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్ తర్వాత ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం సంపాదించిన ఆరో పాకిస్తాన్ ప్లేయర్ జహీర్ అబ్బాస్. 73 ఏళ్ల జహీర్ అబ్బాస్ 1969 నుంచి 1985 వరకు పాక్ జట్టు తరఫున ఆడారు. 78 టెస్టులు ఆడిన ఆయన 5,062 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 62 వన్డేలు ఆడిన అబ్బాస్ 2,572 పరుగులు చేశారు. ఇందులో 7 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో 100 కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక ఆసియా క్రికెటర్ జహీర్ అబ్బాస్ కావడం విశేషం. -
అతడు కోహ్లి కంటే బెటరే కానీ..
ఇస్లామాబాద్: ప్రసుత క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్, టీమిండియా సారథి విరాట్ కోహ్లిలలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరితో పాటు మరికొంతమంది ఆటగాళ్ల పేర్లు కూడా తెరపైకి వచ్చినా వారిద్దరి తర్వాతే అని తేలింది. అయితే స్మిత్, కోహ్లిలలో ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మన్ అనే విషయంపై పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మన్ జహీర్ అబ్బాస్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ‘ఆటపరంగా స్మిత్, కోహ్లిలు సమఉజ్జీలు. అయితే టెస్టుల్లో స్మిత్ అత్యుత్తమమని అతని రికార్డులు చూస్తే తెలుస్తుంది. కానీ విరాట్ కోహ్లి అన్ని ఫార్మట్లలో తనకు తిరుగులేదని నిరూపించాడు. ప్రపంచశేణి అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనిపించుకోవాలంటే ఒక్క ఫార్మట్‌లో మెరుగ్గా రాణిస్తే సరిపోదు కదా.. మూడు ఫార్మట్లలో రాణించాలి. ఆ విషయంలో కోహ్లి మెరుగ్గా ఉన్నాడు. డేవిడ్ వార్నర్ సైతం మూడు ఫార్మట్లలో రాణిస్తున్నాడు. కానీ నిలకడ లోపించింది. గత కొన్నేళ్లుగా అతడు సాధించిన రికార్డులను చూస్తే అర్థమవుతుంది. ఇక కోహ్లిని రన్ మెషీన్ అనకూడదు. ఎందుకంటే మెషీన్లు కొన్ని సార్లు రిపేర్‌కు వచ్చి పనిచేయవు. కానీ కోహ్లి పరుగుల దాహానికి అలుపంటూ ఉండదు. ప్రస్తుతం కోహ్లికి సమాంతరమైన బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు. అయితే ఆటపట్ల నిబద్దత, అంకితభావం కొంతమంది యువ క్రికెటర్లలో చూస్తున్నాను. త్వరలో చాలా మంది కోహ్లిలు వస్తారని అనుకుంటున్నా. పాక్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్ కూడా మెరుగైన బ్యాట్స్‌మన్ అతడి నుంచి మరిన్ని రికార్డులను ఆశించవచ్చు’ అని జహీర్ అబ్బాస్ పేర్కొన్నాడు. చదవండి: ‘లూడో కలిపింది అందరినీ’ ఏం చూసి ఎంపిక చేస్తారు? -
రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే..
ఇస్లామాబాద్: టీమిండియా హిట్‌మ్యాన్, ఓపెనర్ రోహిత్ శర్మపై పాకిస్తాన్ దిగ్గజ బ్యాట్స్‌మన్ జహీర్ అబ్బాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ బ్యాటింగ్‌ను ఆస్వాదించడానికి ఇష్టపడతానని పేర్కొన్నాడు. అంతేకాకుండా రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీవీ నుంచి పక్కకు జరగనని, తదేకంగా అతడి బ్యాటింగ్ చూస్తూ ఉండిపోతానన్నాడు. మంగళవారం స్థానిక ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్ అబ్బాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో రోహిత్ నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా అతడి షాట్స్ సెలక్షన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అంతేకాకుండా షాట్స్ ఎంపిక చాలా వేగంగా ఉంటుంది. అయితే నేను కోహ్లిని తక్కువ చేసి మాట్లాడటం లేదు (కోహ్లి గురించి ప్రశ్నించిన సమయంలో). కోహ్లి కోహ్లినే. అతడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీమిండియా బ్యాటింగ్‌కు అతడు వెన్నెముక. ఓవరాల్‌గా రోహ్లి, కోహ్లిల బ్యాటింగ్‌తో ఓ క్రికెటర్‌గా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను’ అంటూ జహీర్ అబ్బాస్ పేర్కొన్నాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన తొలి ఆసియా బ్యాట్స్‌మన్‌గా జహీర్ అబ్బాస్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. -
‘ఇక చాలు.. కెప్టెన్సీ నుంచి తప్పుకో’
కరాచీ: పాకిస్తాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆ దేశ మాజీ ఆటగాళ్లు జహీర్ అబ్బాస్, షాహిద్ ఆఫ్రిదిలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్ తప్పుకుంటే అతడికి, పాక్ క్రికెట్‌కు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. వన్డే, టీ20లకు కెప్టెన్‌గా సర్ఫరాజ్ విజయంతమయ్యాడని ప్రశంసించారు. అయితే టెస్టు క్రికెట్ ఎంతో కఠినమైదని.. సర్ఫరాజ్ ఈ ఫార్మట్ సారథిగా సత్తా చాటలేడని పేర్కొన్నాడు. అతడే స్వతహగా టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టాలని సర్ఫరాజ్‌కు సూచించారు. తప్పుకుంటే అతడికే మంచిది: ఆఫ్రిది టెస్టు సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్ తప్పుకుంటే అతడికే మేలు జరుగుతుందని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. మూడు ఫార్మట్లకు కెప్టెన్‌గా వ్యవహరించడమనేది అధిక భారంతో కూడుకున్నదని పేర్కొన్నాడు. వన్డే, టీ20 క్రికెట్ సారథిగా సర్ఫరాజ్ విజయవంతమైన తరుణంలో టెస్టు నుంచి తప్పుకోవాలని ఆఫ్రిది అన్నాడు. అంతేకాకుండా టెస్టు జట్టు సారథిగా సర్ఫరాజ్ ఎంపిక సరైనది కాదనేది తన అభిప్రాయమన్నాడు. మిస్బావుల్ ఎంపిక సరైనది కాదు: జహీర్ మిస్బావుల్ హక్‌ను చీఫ్ సెలక్టర్‌గా, ప్రధాన కోచ్‌గా నియమించడం సరైనది కాదని జహీర్ అబ్బాస్ అభిప్రాయపడ్డాడు. రెండు పదవులు మిస్బావుల్‌కు అప్పగించడంతో అతడిపై అధిక భారం పడుతుందన్నాడు. టెస్టు క్రికెట్ చాలా కఠినమైనది ఈ ఫార్మట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడమనేది సవాల్‌తో కూడుకున్నదని.. అయితే ఆ సత్తా సర్ఫరాజ్‌కు లేదన్నాడు. దీంతో వన్డే, టీ20లపై ఫోకస్ పెట్టి, టెస్టు నుంచి తప్పుకుంటే మంచిదని జహీర్ సూచించాడు. -
ధోనిపై పాక్ మాజీ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : టీమిండియా మాజీ సారథి, సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనిపై పాకిస్తాన్ దిగ్గజ సారథి జహీర్ అబ్బాస్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో ధోని రాణించడంపైనే టీమిండియా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయన్నాడు. అతడి అనుభవం కోహ్లి సేనకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా సమతూకంతో ఉందని, ఒత్తిడిలో కూడా రాణించగల ధోని ఉండటం అదనపు బలమని వివరించాడు. ధోని.. బ్రెయిన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ ‘టీమిండియాలో ధోని అనే మేధావి ఉన్నాడు. అతడే బ్రెయిన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. ధోని అనుభవమే ప్రపంచకప్‌లో టీమిండియాను గెలిపిస్తుంది. సారథిగా, కోచ్‌గా, వ్యూహకర్తగా ధోని జట్టును సమర్థవంతంగా నడిపించగలడు. ఇక కోహ్లి కూడా తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన సమయమిది. ఐసీసీ లాంటి మెగా టోర్నీలను జట్టుకు అందిస్తేనే సారథిగా విజయవంతమైనట్టు. కోహ్లికి ముందున్న లక్ష్యం టీమిండియాకు ప్రపంచకప్‌కు అందించడమే 450 చూస్తాం.. ప్రస్తుతం ఇంగ్లండ్ పిచ్‌లు బ్యాటింగ్‌కు స్వర్గధామంగా మారాయి. భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. పాకిస్తాన్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సిరీస్‌లో అలవోకగా 300కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ప్రపంచకప్‌లో 450పైకి పైగా పరుగులు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్‌పై సిరీస్ ఓటమితో పాక్ కుంగిపోవాల్సిన అవసరం లేదు. పాక్ ఆటగాళ్లు ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. ప్రపంచకప్‌లో ఏమైనా జరగవచ్చు. ఏ జట్టైనా గెలవొచ్చు’అంటూ అబ్బాస్ పేర్కొన్నాడు. -
కోహ్లి ఒక లెజెండ్: పాక్ మాజీ క్రికెటర్
కరాచీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికే కోహ్లి దిగ్గజ క్రికెటర్లలో చేరిపోయాడంటూ కితాబిచ్చాడు. ఈ శకంలో క్రికెట్‌ను కోహ్లి శాసిస్తున్నాడంటూ జహీర్ అబ్బాస్ కొనియాడాడు. ఒక్కో తరంలో ఒక్కో ఆటగాడి హవా ఉంటుందని, ఈ తరంలో కోహ్లి తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ముందుకు సాగుతున్నాడన్నాడు. ఎప్పుడో కోహ్లి లెజెండరీ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడన్నాడు. వికెట్‌కు ఇరువైపులా తనదైన శైలితో షాట్లను సంధించే కోహ్లి అమితంగా ఆకట్టుకుంటున్నాడని, ఎడ్జ్‌బాస్టన్‌లో అతని ఆట తనను ఎంతగానో ముగ్ధుడిని చేసిందన్నాడు. సిరీస్ మొత్తం అదే ఆటతీరును ప్రదర్శిస్తాడని జహీర్ అబ్బాస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
టీంఇండియా పై ప్రతికారం తీర్చుకోండి..
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించి ప్రతికారం తీర్చుకోవాలని పాక్ జట్టును ఆ దేశ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ కోరాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఓటమి అనంతరం పాక్ వరుసగా దక్షిణాఫ్రికా, శ్రీలంకలపై గెలిచి సెమీస్‌లో ఇంగ్లండ్ పై సంచలన విజయంతో ఫైనల్‌కు చేరింది. అయితే ఈ సారి పాక్ భారత్ ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందని జహీర్ అబ్బాస్ డాన్ పత్రికతో అన్నాడు. ఓటమితో పుంజుకున్న పాక్ ఆటగాళ్లు టైటిల్ సాధించి ఐసీసీ టోర్నమెంట్‌లోని భారత్‌పై ఉన్న పాక్ చెత్త రికార్డును తుడిపెస్తారని ఈ మాజీ ఆటాగాడు ఆశాభావం వ్యక్తం చేశాడు. బలమైన ఇంగ్లండ్‌ను ఓడించిన పాకిస్థాన్ ఫైనల్లో దేశం కోసం ఎదో ఒకటి చేస్తుందని తెలిపాడు. ఇంగ్లండ్‌పై పాక్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి విజయం సాధించారని, ఇదే ఊపును ఫైనల్ మ్యాచ్‌లో కొనసాగించాలని అబ్బాస్ ఆకాంక్షించాడు. ఇప్పుడు పాకిస్థాన్ సమయం అని తొలి మ్యాచ్‌లో పాక్ ఓడినట్లే భారత్ ఓడుతుందని, చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పాక్‌దేనని అబ్బాస్ జోస్యం చెప్పాడు. ఐసీసీ టోర్నీల్లో ఇరు జట్లు 15 సార్లు తలపడగా భారత్‌ను 13 సార్లు విజయం వరించగా కేవలం రెండుసార్లు మాత్రమే పాక్ గెలిచింది. -
'ఐపీఎల్ లో మళ్లీ చాన్స్ ఇవ్వండి'
కరాచీ: పాకిస్తాన్ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చోటు కల్పించాలని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ బీసీసీఐకి విజ్ఞప్తిచేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియంలో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి ఆయన రానున్నారు. బీసీసీఐ నూతన అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు పాక్ మాజీ కెప్టెన్ బెంగళూరుకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమ దేశ ఆటగాళ్లను లీగ్ లో ఆడనిస్తే ఐపీఎల్ కు మరింత జోష్ వస్తుందని అభిప్రాయపడ్డాడు. 2007 తర్వాత పాక్, భారత్ మధ్య 2012-13 సీజన్లో మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు జరిగాయి. ఐపీఎల్ మొదటి సీజన్లో(2008లో) పాక్ క్రికెటర్లు భాగస్వాయులయ్యారని, అయితే ముంబై దాడుల తర్వాత తమ ఆటగాళ్లను లీగ్ నుంచి నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారత్ ఆహ్వానం మేరకు ఐపీఎల్ ఫైనల్ వీక్షించేందుకు వస్తున్నాను, ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగు పడేందుకు బీజం పడేలా చేస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచమంతా భారత్-పాక్ మ్యాచుల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుందని జహీర్ అబ్బాస్ పేర్కొన్నారు. -
'పీసీబీ చైర్మన్ పదవికి సిద్ధం'
లాహోర్:పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ పదవికి ఆ దేశ మాజీ క్రికెటర్, ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ ఆసక్తి కనబరుస్తున్నారు. పీసీబీ చైర్మన్ పదవిని చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సోమవారం ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. తనను అడిగితే ఆ పదవిని తప్పకుండా స్వీకరిస్తానని తెలిపారు. 'పీసీబీ చైర్మన్ పదవి చేపట్టడానికి నేను సిద్ధం. మరో రెండు నెలల్లో ఐసీసీ అధ్యక్ష పదవీ కాలం ముగిసిపోతుంది. ఆ తరువాత పాక్ క్రికెట్ జట్టుకు సేవలందించడానికి సిద్ధంగా ఉన్నాను' అని జహీర్ అబ్బాస్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆసియాకప్, వరల్డ్ టీ 20ల్లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన అనంతరం పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్‌పై విమర్శలు తారాస్థాయికి చేరాయి. వరల్డ్ కప్‌లో కనీసం రెండో రౌండ్‌కు చేరలేకపోయిన పాక్ జట్టు ఆట తీరుపై ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ క్రికెట్లో సమూల మార్పులు తీసుకురావాలంటే పీసీబీ చైర్మన్‌తో పాటు, పాక్ క్రికెట్ లో క్రియాశీలకంగా ఉన్నవారిని మార్చాల్సిన అవసరం ఉందని అప్పట్లోనే షరిష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ లో పలు మార్పులకు రంగం సిద్దమైంది. -
పాకిస్తాన్ నుంచి భారీగా...
కోల్‌కతాలో శనివారం భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగే టి20 ప్రపంచకప్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఆ దేశం నుంచి భారీ బృందం రానుంది. ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్, ఇమ్రాన్ ఖాన్, షహర్యార్ ఖాన్‌లతో పాటు పీసీబీ నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు రానున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు బెంగాల్ క్రికెట్ సంఘం సెహ్వాగ్‌ను సన్మానించనుంది. సచిన్, గవాస్కర్, కపిల్ తదితర దిగ్గజాలు కూడా మ్యాచ్‌కు వస్తారు. -
ఆ రెండింటిని ముడిపెట్టొద్దు: ఐసీసీ
న్యూఢిల్లీ: రాజకీయాలను, క్రికెట్ ను ఒకే పార్శ్వంలో చూడవద్దని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హితవు పలికింది. పాకిస్థాన్ తో డిసెంబర్ లో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ చర్చల్లో భాగంగా ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ కు బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఆహ్వానం పంపడంపై సోమవారం శివసేన కార్యకర్తలు ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. దీన్ని ఐసీసీ తీవ్రంగా తప్పుబట్టింది. రాజకీయాలను-క్రికెట్ ను ఒకే కోణంలో చూడటం ఎంతమాత్రం మంచిది కాదని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ తెలిపారు. క్రీడలు, రాజకీయాలు అనేవి ఎప్పుడూ వేర్వేరుగానే ఉంటాయి. అటువంటప్పుడు క్రీడలతో రాజకీయాలను ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు. 'నేను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ నే కావొచ్చు. అందులో కొత్తేమి లేదు. కానీ ప్రస్తుతం ఐసీసీ అధ్యక్షుణ్ని. క్రికెట్ ను ప్రపంచవ్యాప్తం చేయాలని కోరుకుంటున్నాను' అని జహీర్ అబ్బాస్ తెలిపారు. ఈరోజు ఉదయం ఇండో - పాక్ సిరీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శివసేన కార్యకర్తలు బీసీసీఐ కార్యాలయంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ప్రెసిడెంట్ శశాంక్ మనోహర్ ఛాంబర్లోకి చొరబడిన శివసేన కార్యకర్తలు ఆయనతో వాగ్వాదానికి దిగి సిరీస్ పై చర్చలు వద్దంటూ ఆందోళన చేపట్టారు. -
అందరూ కోరుకుంటున్నారు!
సాక్షి, హైదరాబాద్ : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య త్వరలోనే ద్వైపాక్షిక సిరీస్‌లు ప్రారంభం అవుతాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడు, దిగ్గజ బ్యాట్స్‌మన్ జహీర్ అబ్బాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్‌లో ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో తలపడిన తర్వాత పరిస్థితి మారవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలో జరుగుతున్న ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అబ్బాస్ మంగళవారం ఉప్పల్ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ‘క్రికెట్ ప్రపంచం మొత్తం భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్‌లు జరగాలని కోరుకుంటోంది. అభిమానులందరిలో ఆసక్తి రేపే పోరు ఇది. త్వరలోనే ఇది జరుగుతుందని ఆశిస్తున్నా. పాక్ మాత్రమే కాదు భారత్‌కు కూడా ఆడాలనే ఉద్దేశం ఉంది. అందరూ ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. బీసీసీఐ, పీసీబీ మధ్య చర్చలు సఫలం కావాలి’ అని అబ్బాస్ ఆకాంక్షించారు. బౌలర్ల ఆయుధం బౌన్సర్... ఆధునిక క్రికెట్లో పేస్ బౌలర్లకు బౌన్సర్ ఒక ఆయుధంలాంటిదని, దానిని తొలగించాలనే ఆలోచన తప్పని అబ్బాస్ అన్నారు. ఏ బౌలరైనా బ్యాట్స్‌మన్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపాలనే భావిస్తాడని చెప్పారు. ‘ఒకటి, రెండు దురదృష్టకర సంఘటనలు జరిగాయి. కానీ హెల్మెట్ లేని కాలంలో కూడా మేం బౌన్సర్లను సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌కు సరైన టెక్నిక్ లేకపోవడమే సమస్య. టి20 తరంలోనూ ఆడిన సచిన్లాంటివాళ్లే ఇందుకు మినహాయింపు’ అని జహీర్ ప్రశంసిం చారు. భారత జట్టు బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లిలో దూకుడు ఉండటంలో తప్పు లేదని, అయి తే మాటతో కాకుండా ఆటతో మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుందని ఐసీసీ అధ్యక్షుడు సూచించారు. స్థాయి పెంచాలి... గతంలో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పాల్గొన్న మొయినుద్దౌలా గోల్డ్ కప్ స్థాయిని పెంచేందుకు బీసీసీఐ ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన ‘ఆసియా బ్రాడ్‌మన్’ తన బ్యాటింగ్ శైలిని మొహమ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ అనుకరించారని గుర్తు చేసుకున్నారు. -
'ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ కు ఇదే సరైన సమయం'
హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ ల క్రికెట్ సిరీస్ జరగాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఇండియా సిమెంట్స్ -హైదరాబాద్ ఎలెవ్ జట్ల మధ్య జరుగుతున్న మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో భాగంగా ఇక్కడ విచ్చేసిన జహీర్ అబ్బాస్ మీడియాతో మాట్లాడుతూ తన ఆకాంక్షను వెల్లడించారు. భారత-పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ సిరీస్ జరగడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. పొరుగు దేశాలైన ఇండియా-పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ సిరీస్ జరగాలని యావత్ ప్రపంచం కోరుకుంటుందన్నాడు. ' రెండు దేశాల క్రికెట్ సిరీస్ కోసం నాతో పాటు ప్రపంచం కూడా ఎదురుచూస్తోంది. అందుకు భారత్ సంసిద్ధంగా ఉంటే.. ఇదే సరైన సమయం'అని అన్నారు. భారత-పాకిస్థాన్ ల సిరీస్ కోసం ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఉన్నట్లు ఐసీసీ సీఈవో తనతో చెప్పినట్లు అబ్బాస్ పేర్కొన్నారు. అందుకోసం తన నుంచి ఏమైనా సాయం కావాల్సి వస్తే తప్పకుండా అందిస్తానని జహీర్ అబ్బాస్ తెలిపారు. ఇప్పటికే ఇరు దేశాల క్రికెట్ సిరీస్ కోసం ఐసీసీ ప్రెసిడెంట్ గా సాయం అందించాలని అబ్బాస్ ను పీసీబీ కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోఅబ్బాస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో భాగంగా విజేతలకు ట్రోఫీలు బహుకరించేందుకు జహీర్ అబ్బాస్ ను హెచ్ సీఏ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) ఆహ్వానించింది. -
భారత్- పాక్ క్రికెట్ పునరుద్ధరిస్తాం
ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ కరాచీ: భవిష్యత్తులో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని ఐసీసీ కొత్త అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ వ్యాఖ్యానించారు. ఐసీసీ అధ్యక్ష హోదాలో క్రికెట్‌ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. ‘భారత్, పాక్ దేశాల అభిమానులు తమ జట్ల మధ్య క్రికెట్ జరగాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం నేను కూడా కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం. ఈ జట్ల మధ్య తరచుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం క్రికెట్‌కు కూడా మంచిది. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశమని తెలుసు. కానీ నా తరఫున సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. ఎక్కువ సిరీస్‌లు జరిగితే ఆటగాళ్లు, అభిమానులకు కూడా సంతృప్తినిస్తుంది’ అని అబ్బాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఐసీసీ అధ్యక్షుడిగా జహీర్ అబ్బాస్
కరాచీ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడిగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ నియమితులైయ్యారు. రేసు నుంచి పీసీబీ మాజీ చీఫ్ నజమ్ సేథి తప్పుకోవడంతో అబ్బాస్ పేరును పాక్ ప్రతిపాదించింది. దీంతో అబ్బాస్ పేరు ప్రతిపాదనకు ఐసీసీ తాజాగా ఆమోద ముద్ర వేయడంతో దీనిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తన నామినేషన్ ను ఆమోదించినందుకు ఐసీసీకి అబ్బాస్ కృతజ్ఞతలు తెలియజేశాడు. 'నాపై నమ్మకం ఉంచిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు, ఐసీసీకి ధన్యవాదాలు. శక్తివంచన లేకుండా క్రికెట్ అభివృద్ధికి తోడ్పడతా' అని అబ్బాస్ స్పష్టం చేశాడు. ఈ పదవి కోసం మాజీ ఆటగాళ్లు మాజిద్ ఖాన్, అసిఫ్ ఇక్బాల్ పేర్లు తెరపైకి వచ్చినా పీసీబీ గవర్నింగ్ బాడీ మాత్రం జహీర్ అబ్బాస్ వైపే మొగ్గు చూపింది. ఆసియా బ్రాడ్‌మన్‌గా పేరు తెచ్చుకున్న అబ్బాస్ 78 టెస్టుల్లో 5062 పరుగులు చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం జూలై 1 నుంచి ఏడాది కాలం నజమ్ సేథి ఈ పదవిని చేపట్టాల్సి ఉంది. అయితే గతేడాది నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా ఆయా దేశాలకు చెందిన ప్రముఖ టెస్టు ఆటగాళ్లనే ప్రతిపాదించాలని ప్రపంచ క్రికెట్ బాడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముందుగానే సేథి తప్పుకున్నారు. -
ఐసీసీ అధ్యక్షుడిగా అబ్బాస్!
ప్రతిపాదించిన పాక్ బోర్డు కరాచీ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవి కోసం తమ అభ్యర్థిగా దిగ్గజ ఆటగాడు జహీర్ అబ్బాస్‌ను పాక్ క్రికెట్ బోర్డు నామినేట్ చేసింది. పీసీబీ మాజీ చీఫ్ నజమ్ సేథి తప్పుకోవడంతో అబ్బాస్ పేరును ప్రతిపాదించారు. ఈ పదవి కోసం మాజీ ఆటగాళ్లు మాజిద్ ఖాన్, అసిఫ్ ఇక్బాల్ పేర్లు తెరపైకి వచ్చినా పీసీబీ గవర్నింగ్ బాడీ మాత్రం జహీర్ అబ్బాస్ వైపే మొగ్గు చూపింది. ఆసియా బ్రాడ్‌మన్‌గా పేరు తెచ్చుకున్న అబ్బాస్ 78 టెస్టుల్లో 5062 పరుగులు చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం జూలై 1 నుంచి ఏడాది కాలం నజమ్ సేథి ఈ పదవిని అలంకరించాల్సి ఉంది. అయితే గతేడాది నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా ఆయా దేశాలకు చెందిన ప్రముఖ టెస్టు ఆటగాళ్లనే ప్రతిపాదించాలని ప్రపంచ క్రికెట్ బాడీ ప్రకటించింది. ఈనేపథ్యంలో ముందుగానే సేథి తప్పుకున్నారు.