అందరూ కోరుకుంటున్నారు!
సాక్షి, హైదరాబాద్ : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య త్వరలోనే ద్వైపాక్షిక సిరీస్‌లు ప్రారంభం అవుతాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడు, దిగ్గజ బ్యాట్స్‌మన్ జహీర్ అబ్బాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్‌లో ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో తలపడిన తర్వాత పరిస్థితి మారవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలో జరుగుతున్న ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అబ్బాస్ మంగళవారం ఉప్పల్ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ‘క్రికెట్ ప్రపంచం మొత్తం భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్‌లు జరగాలని కోరుకుంటోంది. అభిమానులందరిలో ఆసక్తి రేపే పోరు ఇది. త్వరలోనే ఇది జరుగుతుందని ఆశిస్తున్నా. పాక్ మాత్రమే కాదు భారత్‌కు కూడా ఆడాలనే ఉద్దేశం ఉంది. అందరూ ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. బీసీసీఐ, పీసీబీ మధ్య చర్చలు సఫలం కావాలి’ అని అబ్బాస్ ఆకాంక్షించారు.
బౌలర్ల ఆయుధం బౌన్సర్...
ఆధునిక క్రికెట్‌లో పేస్ బౌలర్లకు బౌన్సర్ ఒక ఆయుధంలాంటిదని, దానిని తొలగించాలనే ఆలోచన తప్పని అబ్బాస్ అన్నారు. ఏ బౌలరైనా బ్యాట్స్‌మన్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపాలనే భావిస్తాడని చెప్పారు. ‘ఒకటి, రెండు దురదృష్టకర సంఘటనలు జరిగాయి. కానీ హెల్మెట్ లేని కాలంలో కూడా మేం బౌన్సర్లను సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌కు సరైన టెక్నిక్ లేకపోవడమే సమస్య. టి20 తరంలోనూ ఆడిన సచిన్‌లాంటివాళ్లే ఇందుకు మినహాయింపు’ అని జహీర్ ప్రశంసిం చారు. భారత జట్టు బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లిలో దూకుడు ఉండటంలో తప్పు లేదని, అయి తే మాటతో కాకుండా ఆటతో మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుందని ఐసీసీ అధ్యక్షుడు సూచించారు.
స్థాయి పెంచాలి...
గతంలో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పాల్గొన్న మొయినుద్దౌలా గోల్డ్ కప్ స్థాయిని పెంచేందుకు బీసీసీఐ ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన ‘ఆసియా బ్రాడ్‌మన్’ తన బ్యాటింగ్ శైలిని మొహమ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ అనుకరించారని గుర్తు చేసుకున్నారు.