ఇస్లామాబాద్: ప్రసుత క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్, టీమిండియా సారథి విరాట్ కోహ్లిలలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరితో పాటు మరికొంతమంది ఆటగాళ్ల పేర్లు కూడా తెరపైకి వచ్చినా వారిద్దరి తర్వాతే అని తేలింది. అయితే స్మిత్, కోహ్లిలలో ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మన్ అనే విషయంపై పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మన్ జహీర్ అబ్బాస్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.
‘ఆటపరంగా స్మిత్, కోహ్లిలు సమఉజ్జీలు. అయితే టెస్టుల్లో స్మిత్ అత్యుత్తమమని అతని రికార్డులు చూస్తే తెలుస్తుంది. కానీ విరాట్ కోహ్లి అన్ని ఫార్మట్లలో తనకు తిరుగులేదని నిరూపించాడు. ప్రపంచశేణి అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనిపించుకోవాలంటే ఒక్క ఫార్మట్‌లో మెరుగ్గా రాణిస్తే సరిపోదు కదా.. మూడు ఫార్మట్లలో రాణించాలి. ఆ విషయంలో కోహ్లి మెరుగ్గా ఉన్నాడు. డేవిడ్ వార్నర్ సైతం మూడు ఫార్మట్లలో రాణిస్తున్నాడు. కానీ నిలకడ లోపించింది.
గత కొన్నేళ్లుగా అతడు సాధించిన రికార్డులను చూస్తే అర్థమవుతుంది. ఇక కోహ్లిని రన్ మెషీన్ అనకూడదు. ఎందుకంటే మెషీన్లు కొన్ని సార్లు రిపేర్‌కు వచ్చి పనిచేయవు. కానీ కోహ్లి పరుగుల దాహానికి అలుపంటూ ఉండదు. ప్రస్తుతం కోహ్లికి సమాంతరమైన బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు. అయితే ఆటపట్ల నిబద్దత, అంకితభావం కొంతమంది యువ క్రికెటర్లలో చూస్తున్నాను. త్వరలో చాలా మంది కోహ్లిలు వస్తారని అనుకుంటున్నా. పాక్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్ కూడా మెరుగైన బ్యాట్స్‌మన్ అతడి నుంచి మరిన్ని రికార్డులను ఆశించవచ్చు’ అని జహీర్ అబ్బాస్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment