రన్ మెషీన్, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఇకపై ఎంతమాత్రం ఫాబ్-4లో భాగంగా కాదని, టెస్ట్‌ల్లో తరుచూ విఫలమవుతున్న కోహ్లి ఫాబ్-4లో నిలిచే అర్ఘత కోల్పోయాడని, ఇకపై ఎవ్వరూ కోహ్లిని ఫాబ్-4లో ఒకడిగా పిలవకండని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టెస్ట్ క్రికెట్‌లో ఫాబ్-4గా పిలువబడే వారిలో స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లు తమకిచ్చిన బిరుదుకు న్యాయం చేస్తున్నారని.. కోహ్లి ఒక్కడే వరుసగా విఫలమవుతూ, అందుకు న్యాయం చేయలేకపోతున్నాడని అన్నాడు. కెరీర్‌లో (యాషెస్ మూడో టెస్ట్) వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న స్మిత్.. ఇటీవలే 32వ టెస్ట్ శతకాన్ని నమోదు చేయగా.. రూట్ సైతం ఇదే యాషెస్ సిరీస్‌లో సెంచరీ చేసి ఫామ్‌లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న విలియమ్సన్ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
విరాట్ విషయానికొస్తే.. ఇతను గత మూడేళ్లలో కేవలం ఒక టెస్ట్ సెంచరీ మాత్రమే చేశాడు. దీంతో అతన్ని ఫాబ్-4లో ఒకడిగా సంబోధించడంపై చాలా మంది ప్రశ్నించారు. ఈ విషయంలో ఆకాశ్ చోప్రా ఓ అడుగు ముందుకేసి, ఎవరూ చేయలేని సాహసం (కోహ్లిని బహిరంగంగా విమర్శించడం) చేశాడు. ఇకపై విరాట్ ఫ్యాబ్ 4లో ఒకడిగా పిలుపించుకోవడానికి ఎంతమాత్రం అర్హుడు కాదని వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లతో ఫ్యాబ్-3 మాత్రమే ఉందని అన్నాడు. ఆకాశ్ చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఘాటుగా ఉన్నా, ఇందులో నిజం లేకపోలేదు. 2014-2019 వరకు అద్భతంగా ఆడి (58.71 సగటుతో 5695 పరుగులు, 22 సెంచరీలు, 4 డబుల్ సెంచరీలు) ఫాబ్-4లో చోటు దక్కించుకున్న విరాట్.. ఆ తర్వాత మూడేళ్లలో 25 మ్యాచ్‌లు ఆడి కేవలం 1277 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు కేవగం 29.69గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment