
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 2021 నుంచి రెండేళ్ల పాటు కెరీర్ పరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. 2022 చివర్లో కోహ్లి ఎట్టకేలకు ఫామ్‌ను దొరకబుచ్చుకుని పూర్వవైభవం సాధించగలిగాడు. అయితే కోహ్లి ఫామ్ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమైంది. గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో గతం కంటే మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్న కోహ్లి.. టెస్ట్‌ల్లో మాత్రం ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు. తాజాగా సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ పోస్ట్ ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది.
ఇంతకీ ఆ పోస్ట్ ఏం సూచిస్తుందంటే.. 2021లో కోహ్లి 27 టెస్ట్ సెంచరీలు చేసే నాటికి ఫాబ్ ఫోర్‌గా పిలువబడే వారిలో మిగతా ముగ్గురు కోహ్లి కంటే తక్కువ సెంచరీ కలిగి ఉన్నారు. స్టీవ్ స్మిత్ 26, కేన్ విలియమ్సన్ 23, జో రూట్ 17 సెంచరీలు చేశారు. అయితే నేటి దినం వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. అప్పట్లో సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఫాబ్ ఫోర్‌లో ప్రథముడిగా పరిగణించబడిన కోహ్లి.. ప్రస్తుతం చివరివాడిగా మారిపోయాడు.
Kane Williamson is just one century away from equaling Steve Smith among the Fab 4 for the most Test centuries. pic.twitter.com/ZtFIV45lmE
— CricTracker (@Cricketracker) February 6, 2024
టెస్ట్ సెంచరీల సంఖ్యలో కోహ్లి ఫాబ్ ఫోర్‌లో చివరి స్థానానికి పడిపోయాడు. నేటికి 32 సెంచరీలతో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉండగా.. వరుస సెంచరీలు చేస్తూ పరుగులు వరద పారిస్తున్న విలియమ్సన్ 31 సెంచరీలతో రెండో స్థానానికి దూసుకువచ్చాడు. అప్పట్లో 17 సెంచరీలు చేసిన రూట్.. ఈ మధ్యకాలంలో ఏకంగా 13 సెంచరీలు చేసి 30 సెంచరీలతో మూడో ప్లేస్‌లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేసిన కోహ్లి ఫాబ్ ఫోర్‌లో చివరివాడిగా కొనసాగుతున్నాడు. ఓ పక్క టెస్ట్‌ల్లో తనకు పోటీదారులుగా పిలువబడే వారు సెంచరీల మీద సెంచరీలు చేస్తూ దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం చల్లబడ్డాడు.
కోహ్లికి ప్రధాన పోటీదారుడైన విలియమ్సన్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేయడంతో పాటు చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో ఆరు శతకాలు బాది శతక వేటలో దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం రేసులో వెనుకపడ్డాడు.
కోహ్లి టెస్ట్ సెంచరీ సంఖ్య తగ్గడానికి ఓ ప్రధానమైన కారణంగా ఉంది. కోహ్లి ఫాబ్ ఫోర్‌లోని మిగతా సభ్యులతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో టెస్ట్ మ్యాచ్‌లు చాలా తక్కువగా ఆడాడు. ఏదో టెస్ట్ క్రికెట్ అంటే ఆసక్తి లేనట్లు మ్యాచ్‌కు మ్యాచ్‌కు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఓ పక్క స్టీవ్ స్మిత్, కేన్ మామ, రూట్ దాదాపుగా ప్రతి మ్యాచ్ ఆడుతుంటే కోహ్లి ఏ అమవాస్యకో పున్నానికో టెస్ట్‌ల్లో కనిపిస్తున్నాడు.
కోహ్లి సెంచరీలు చేయకపోతేనేం పరుగులు సాధిస్తున్నాడు కదా అని అతని అభిమానులు వాదించవచ్చు. అయితే సహచరులతో పోలిస్తే కోహ్లి సాధించిన పరుగులు చాలా తక్కువ అన్న విషయాన్ని వారు మరువకూడదు. అభిమాన ఆటగాడు కదా అని మనం ఎంత సమర్ధించుకు వచ్చినా అంతిమంగా గణాంకాలు మాత్రమే మాట్లాడతాయని గుర్తించాలి. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడో లేదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment