'ఐపీఎల్ లో మళ్లీ చాన్స్ ఇవ్వండి'
కరాచీ: పాకిస్తాన్ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చోటు కల్పించాలని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ బీసీసీఐకి విజ్ఞప్తిచేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియంలో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి ఆయన రానున్నారు. బీసీసీఐ నూతన అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు పాక్ మాజీ కెప్టెన్ బెంగళూరుకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమ దేశ ఆటగాళ్లను లీగ్ లో ఆడనిస్తే ఐపీఎల్ కు మరింత జోష్ వస్తుందని అభిప్రాయపడ్డాడు.
2007 తర్వాత పాక్, భారత్ మధ్య 2012-13 సీజన్లో మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు జరిగాయి. ఐపీఎల్ మొదటి సీజన్లో(2008లో) పాక్ క్రికెటర్లు భాగస్వాయులయ్యారని, అయితే ముంబై దాడుల తర్వాత తమ ఆటగాళ్లను లీగ్ నుంచి నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారత్ ఆహ్వానం మేరకు ఐపీఎల్ ఫైనల్ వీక్షించేందుకు వస్తున్నాను, ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగు పడేందుకు బీజం పడేలా చేస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచమంతా భారత్-పాక్ మ్యాచుల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుందని జహీర్ అబ్బాస్ పేర్కొన్నారు.