వెటోరి బాటలో మరో బౌలర్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పేస్ బౌలర్ కైల్ మిల్స్ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం ప్రకటించారు. ప్రపంచకప్ ముగిసిన రోజునే కివీస్ ఆల్ రౌండర్ డానియల్ వెటోరి క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పేసర్ అదే బాట పడ్డారు. మిల్స్ టాప్ - 10 వన్డే బౌలర్ల జాబితాలో.. నెంబర్ వన్ ర్యాంకులో చాలాకాలం పాటు కొనసాగారు.
'క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. నా 36 ఏళ్ల జీవితంలో 14 ఏళ్ల పాటు క్రికెట్లోనే ఉన్నాను. ఇన్నాళ్లు క్రికెట్ జీవితాన్ని గడిపిన నాకు సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నాననే అనిపిస్తోంది. ఇకనుంచి ఎక్కువ సమయాన్ని నా కుటుంబ సభ్యులతో ఉండటానికి కేటాయిస్తాను' అని మిల్స్ అన్నారు.
మిల్స్ న్యూజిలాండ్ జట్టులో 170 వన్డేలు ఆడి 240 వికెట్లు పడగొట్టాడు. మూడు ప్రపంచకప్ టోర్నీల్లో ఆడాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో వెటోరి (297) తర్వాత స్థానం మిల్స్దే. కెరీర్లో 42 టీ20లు, 19 టెస్టు మ్యాచ్లు ఆడాడు. టెస్టు కెరీర్లో 13 ఓవర్లలో 4/16, వన్డే కెరీర్లో 5/25 మిల్స్ బౌలింగ్లోని అత్యుత్తమ గణాంకాలు.
ఇంగ్లండ్తో 2008లో హామిల్టన్లో జరిగిన మ్యాచ్లో మిల్స్ ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ అలిస్టర్ కుక్, కెవిన్ పీటర్సన్, మైకేల్ వాన్, ఆండ్రూ స్ట్రాస్లను పెవిలియన్కు పంపించి జట్టుకు ఘన విజయాన్ని అందించడంలో మిల్స్ ప్రతిభ చిరకాలం గుర్తుండి పోతుంది.