ప్రపంచకప్ సెమీఫైనల్స్లో భారతజట్టు విజయం సాధించాలని తమిళనాడులో ఓ అభిమాని తన నాలుక కోసుకున్నాడు.
అభిమానం వెర్రి తలలు వేయడం అంటే ఇదేనేమో! ప్రపంచకప్ సెమీఫైనల్స్లో భారతజట్టు విజయం సాధించాలని తమిళనాడులో ఓ అభిమాని తన నాలుక కోసుకున్నాడు. సుధాకర్ (21) అనే ఈ యువకుడిని వెంటనే స్నేహితులు, బంధువులు కలిసి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు తన నాలుకను రెండు అంగుళాల మేర కత్తిరించుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
అతడి పరిస్థితి నిలకడగానే ఉందని, అయితే.. సుధాకర్ను తీసుకొచ్చినవాళ్లు తెగిన నాలుక ముక్కను తేకపోవడంతో దాన్ని తిరిగి అతికించే మైక్రోసర్జరీ చేయలేకపోయామని వెల్లూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. కుదిరితే ప్లాస్టిక్ సర్జరీ చేయాలని మాత్రం వైద్యులు అనుకుంటున్నారు. తొలుత అతడు నోట్లో కత్తి పెట్టుకుని బొప్పాయి చెట్టు ఎక్కుతుండగా పడిపోయి నాలుక తెగిందని అన్నారుగానీ.. గట్టిగా అడిగితే అసలు విషయం తెలిసింది.