ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా
ఫైనల్లో కివీస్‌పై ఏడు వికెట్ల విజయం ఠ ఐదోసారి ట్రోఫీ నెగ్గిన కంగారూలు
బాణం వేసేవాడి బొటనవేలు... ట్రిగ్గర్ నొక్కేవాడి చూపుడువేలు తీసేస్తే... ఇక దేనికీ పనికిరారుప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా కూడా ఇదే చేసింది. కివీస్ బలం, బలహీనత కూడా అయిన మెకల్లమ్‌ను ముందే మడతపెట్టింది. ఎదురెళ్లి యుద్ధం చేసే సైనికుల్లా... వెంటాడి చంపే చిరుతల్లా చెలరేగిన క్లార్క్ సైన్యం అలవోకగా ప్రపంచకప్ ఫైనల్లో గెలిచింది.
మెల్‌బోర్న్: పోరాటాలు అనుభవాన్నిస్తాయి.. పరాజయాలు పాఠాలను నేర్పుతాయి. లీగ్ దశలో న్యూజిలాండ్ చేతిలో ఓటమి నుంచి పాఠం నేర్చుకున్న ఆసీస్... ప్రపంచకప్ ఫైనల్లో విశ్వరూపం చూపించింది. తొలిసారి తుది సమరానికి వచ్చిన కివీస్ ఆశలపై నీళ్లుజల్లింది. ఆదివారం ఎంసీజీ మైదానంలో జరిగిన ఫైనల్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించి ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 45 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది.
ఇలియట్ (82 బంతుల్లో 83; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫామ్‌ను కొనసాగించగా, టేలర్ (72 బంతుల్లో 40; 2 ఫోర్లు) సమయోచితంగా ఆడాడు. తర్వాత ఆస్ట్రేలియా 33.1 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ క్లార్క్ (72 బంతుల్లో 74 ; 10 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడగా, స్మిత్ (71 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు), వార్నర్ (46 బంతుల్లో 45; 7 ఫోర్లు) నిలకడగా ఆడారు. ఫాల్క్‌నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’; స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించాయి.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (బి) మ్యాక్స్‌వెల్ 15; మెకల్లమ్ (బి) స్టార్క్ 0; విలియమ్సన్ (సి) అండ్ (బి) జాన్సన్ 12; టేలర్ (సి) హాడిన్ (బి) ఫాల్క్‌నర్ 40; ఇలియట్ (సి) హాడిన్ (బి) ఫాల్క్‌నర్ 83; అండర్సన్ (బి) ఫాల్క్‌నర్ 0; రోంచీ (సి) క్లార్క్ (బి) స్టార్క్ 0; వెటోరి (బి) జాన్సన్ 9; సౌతీ రనౌట్ 11; హెన్రీ (సి) స్టార్క్ (బి) జాన్సన్ 0; బౌల్ట్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (45 ఓవర్లలో ఆలౌట్) 183.
వికెట్ల పతనం: 1-1; 2-33; 3-39; 4-150; 5-150; 6-151; 7-167; 8-171; 9-182; 10-183.
బౌలింగ్: స్టార్క్ 8-0-20-2; హాజల్‌వుడ్ 8-2-30-0; జాన్సన్ 9-0-30-3; మ్యాక్స్‌వెల్ 7-0-37-1; ఫాల్క్‌నర్ 9-1-36-3; వాట్సన్ 4-0-23-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) ఇలియట్ (బి) హెన్రీ 45; ఫించ్ (సి) అండ్ (బి) బౌల్ట్ 0; స్మిత్ నాటౌట్ 56; క్లార్క్ (బి) హెన్రీ 74; వాట్సన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (33.1 ఓవర్లలో 3 వికెట్లకు) 186.
వికెట్ల పతనం: 1-2; 2-63; 3-175.
బౌలింగ్: సౌతీ 8-0-65-0; బౌల్ట్ 10-0-40-1; వెటోరి 5-0-25-0; హెన్రీ 9.1-0-46-2; అండర్సన్ 1-0-7-0.
మెకల్లమ్ నిరాశ
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో మెకల్లమ్ (0)ను లక్ష్యంగా చేసుకున్న ఆసీస్ ఇన్నింగ్స్ ఐదో బంతికే అతన్ని అవుట్ చేసింది. పవర్‌ప్లేలో స్టార్క్, హజల్‌వుడ్ స్వింగ్‌కు గప్టిల్ (15), విలియమ్సన్ (12) పరుగులు రాబట్టడంలో బాగా ఇబ్బందులుపడ్డారు. అయితే వరుస ఓవర్లలో ఈ ఇద్దరు అవుట్ కావడంతో కివీస్ 13 ఓవర్లలో 3 వికెట్లకు 41 పరుగులు చేసింది.
సూపర్ భాగస్వామ్యం
ఈ దశలో టేలర్, ఇలియట్ నిలకడగా ఆడారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్, డబుల్స్‌తో సరిపెట్టుకున్నారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 111 పరుగులు జోడించడంతో 35 ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోరు 150 పరుగులకే చేరుకుంది.
ఫాల్క్‌నర్ జోరు
నిలకడగా ఆడుతున్న ఈ జోడీని బ్యాటింగ్ పవర్‌ప్లేలో ఫాల్క్‌నర్ విడదీశాడు. 36వ ఓవర్‌లో మూడు బంతుల వ్యవధిలో టేలర్, అండర్సన్ (0)ను అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్‌లో రోంచీ (0) కూడా వెనుదిరిగాడు. ఓవరాల్‌గా 8 బంతుల వ్యవధిలో 1 పరుగు తేడాతో ఈ మూడు వికెట్లు పడటంతో కివీస్ కోలుకోలేకపోయింది. 33 పరుగుల తేడాతో చివరి 7 వికెట్లు కోల్పోవడంతో కివీస్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. జాన్సన్, ఫాల్క్‌నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
వార్నర్ విజృంభణ
లక్ష్యం చిన్నది కావడంతో రెండో ఓవర్‌లోనే ఫించ్ (0)ను అవుట్ చేసి బౌల్ట్ ఆశలు రేకేత్తించాడు. కానీ వార్నర్, స్మిత్‌లు వరుసగా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో 56 పరుగులు సమకూరాయి. జోరుమీదున్న వార్నర్‌ను 13వ ఓవర్‌లో హెన్రీ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
క్లార్క్ దూకుడు
కెప్టెన్ క్లార్క్ క్రీజులో కుదురుకున్నాక క్రమంగా బ్యాట్ ఝుళిపించాడు. స్మిత్ కంటే ఎక్కువగా స్ట్రయికింగ్ చేసిన అతను హెన్రీ, సౌతీ ఓవర్లలో ఫోర్లు కొట్టి జోరు పెంచాడు. ఈ జోడీని విడదీసేందుకు వెటోరిని ప్రయోగించినా ప్రయోజనం లేకపోయింది.
స్మిత్ బౌండరీ
ఇక ఆసీస్ విజయ లక్ష్యం 22 ఓవర్లలో 44 పరుగులు చేయాల్సిన దశలో స్మిత్ కూడా వేగం పెంచాడు. కానీ సౌతీ వేసిన ఇన్నింగ్స్ 31వ ఓవర్‌లో క్లార్క్ వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. దీంతో లక్ష్యం 19 ఓవర్లు 10 పరుగులుగా మా రింది. ఈ దశలో క్లార్క్ బౌల్డ్ అయ్యా డు. తర్వాత వాట్సన్ (2 నాటౌట్)తో కలిసి స్మిత్ ఫోర్‌తో లాంఛనాన్ని పూర్తి చేశాడు.